మహా మాస్టర్‌

25 Feb, 2019 10:21 IST|Sakshi

హెచ్‌ఎండీఏలో ఉన్నతోద్యోగి చక్రం  

మూడేళ్లుగా ఇక్కడే తిష్ట  

డీటీసీపీకి పంపినా తిరిగొచ్చిన అధికారి  

ప్లానింగ్‌ విభాగంలో ఆయనదే రాజ్యం  

అనుమతులివ్వకుండా కొర్రీలు పెడుతున్న వైనం  

ఇటు సిబ్బంది, అటు దరఖాస్తుదారులకు ఇబ్బందులు

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్లానింగ్‌ విభాగం అనగానే చాలామంది పెదవి విరుస్తుంటారు. భవన, లేఅవుట్‌ నిర్మాణ అనుమతులు అంత సులభంగా ఇవ్వరని, కిందిస్థాయి సిబ్బంది చుక్కలు చూపిస్తుంటారని దరఖాస్తుదారులు చెబుతుంటారు. అన్నీ సక్రమంగా ఉన్నా కొర్రీలు పెడుతూ దరఖాస్తులు క్లియర్‌ చేయరని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అయితే ఇదంతా అక్కడి ఓ ఉన్నతాధికారి ‘డైరెక్షన్‌’లోనే సాగుతోందని హెచ్‌ఎండీఏ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన అధికారులకు టార్గెట్స్‌ విధించి మరీ... ఇలా చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాము దరఖాస్తుదారుల దృష్టిలో చెడ్డవాళ్లమవుతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అధికారి 2014లో ఔటర్‌ రింగ్‌ రోడ్డు గ్రోత్‌ కారిడార్‌ విభాగంలో పీవోగా పని చేశారు. అయితే 2015లో అప్పటి హెచ్‌ఎండీఏ కమిషనర్‌ శాలినీమిశ్రా ఆయన పనితనం నచ్చక మాతృసంస్థ డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ)కి పంపించారు. కానీ పైరవీలతో 2016లో మళ్లీ హెచ్‌ఎండీఏకువచ్చిన ఆయనకు... అదే ఏడాది ఆగస్టులో చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ (సీపీవో)గా పదోన్నతి వచ్చింది. సాధారణంగా పదోన్నతి వచ్చిన డీటీసీపీ ఉద్యోగులు తిరిగి మాతృసంస్థకు వెళ్తుంటారు. లేదంటే ఏడాది పూర్తికాగానే వెళ్లిపోవాలి. కానీ ఈ అధికారి మాత్రం మూడేళ్లుగా హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగాన్ని వదలకుండా ఇక్కడే తిష్ట వేసి కాసుల మం త్రం జపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

‘పవర్‌’ఫుల్‌...  
2016లో హెచ్‌ఎండీఏకు వచ్చిన ఈ అధికారి ఇన్‌చార్జ్‌ చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన భవిష్యత్‌ నగరానికి దశాదిశ చూపించే మాస్టర్‌ ప్లాన్‌ విభాగ బాధ్యతలు చూసినట్టుగా కనిపించినా... దృష్టంతా ప్లానింగ్‌ విభాగం పనులపైనే ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. ఓ మాజీ మంత్రికి సన్నిహితుడినని చెప్పుకునే ఈయన... అప్పటి కమిషనర్‌తో 25 ఎకరాల పైనున్న లేఅవుట్‌ అనుమతుల ఫైళ్లు సీపీఓ చేతుల మీదుగా వెళ్లేలా ఆదేశాలు తీసుకురావడం, ప్రతి గేటెడ్‌ కమ్యూనిటీ అనుమతులు కూడా సీపీఓ పర్యవేక్షణలోనే జరిగేలా చూడడంలో సఫలీకృతం కావడం ఏ స్థాయిలో లాబీయింగ్‌ చేశారనే దానికి నిదర్శనమని అందరినోటా వినపడుతోంది. అయితే 2018 సెప్టెంబర్‌ 5న అడిషనల్‌ డైరెక్టర్‌ హోదా కల్పించికుంటూ 757 జీఓ తెచ్చుకున్న ఈ అధికారి ప్లానింగ్‌కు సంబంధించి రెండు జోన్ల బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. గతంలో సీపీవోకు ఉన్న అధికారాలు పోయి ఈయన చేతి నుంచి నేరుగా ఫైల్స్‌ క్లియర్‌ అయ్యేలా చూడటంలోను పై స్థాయి అధికారుల అండదండలు వినియోగించుకున్నట్టుగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ అధికారి తాను ఎక్కడుంటే అక్కడ ఎక్కువ అధికారాలు ఉండేలా చూసుకోవడం చూస్తుంటే ఏ స్థాయిలో ఆదాయ మార్గాలుంటాయోనని సిబ్బంది పేర్కొంటున్నారు.  

సిబ్బందిపై ఒత్తిడి...  
ఈ అధికారికి ప్లానింగ్‌ విభాగాధిపతి బాధ్యతలు వచ్చినప్పటి నుంచి కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది. కిందిస్థాయి అధికారులు అంతా బాగానే ఉందని ఫైల్‌ క్లియర్‌ చేస్తే, ఈయన కొర్రీలు పెట్టడం కొర్రీలు పెట్టడం షరామామూలేనని సమాచారం. ఒకానొక దశలో కిందిస్థాయి సిబ్బందికే ఫలానా కొర్రీలు పెట్టండని సూచిస్తుండడం, లేదంటే తనకు ఏసీబీలో పరిచయాలు ఉన్నాయంటూ హెచ్చరించడం చేస్తారని వినిపిస్తోంది. కొందరికైతే ఏకంగా వసూలు చేయమని సంకేతాలు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఓ జోన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ సెలవుపై వెళ్లి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు విధుల్లో చేరకపోవడం హెచ్‌ఎండీఏలో చర్చనీయాంశమైంది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ దీనిపై దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని ఇటు హెచ్‌ఎండీఏ వర్గాలు, అటు దరఖాస్తుదారులు కోరుతున్నారు.

దరఖాస్తుదారులకు చుక్కలు...  
టెక్నికల్‌గా మంచి అవగాహన కలిగిన ఈ అధికారి భవన నిర్మాణ అనుమతులకు వచ్చిన కొన్ని ఫైళ్ల విషయంలో దరఖాస్తుదారులకు చుక్కలు చూపిస్తున్నారు. గతంలో ఈయన సీపీవోగా ఉన్న సమయంలో కొన్ని నిర్మాణ సంస్థలకు అనుమతులిచ్చిన ఈ అధికారి... అదే ప్రాంతంలో వచ్చిన నిర్మాణ అనుమతులకు కొర్రీలు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మాస్టర్‌ ప్లాన్‌లో ప్రతిపాదిత రోడ్లు ఉన్నాయంటూ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌కు లేఖ రాస్తే కరెక్టెడ్‌ మాస్టర్‌ ప్లాన్‌ 2031 పంపివ్వామంటూ తిరిగి హెచ్‌ఎండీఏను అడిగితే ఇంకా ఫైనల్‌ కాలేదంటూ తిరిగి సమాధానమివ్వడం ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ అధికారి నిర్వాకంతో చాలామంది దరఖాస్తుదారులు ఏడాదిగా చక్కర్లు కొడుతున్నారు. వీరేగాక మరెంతో మంది దరఖాస్తుదారులు ఏదో రూపంలో వేదనకు గురవుతున్నారు.  

మరిన్ని వార్తలు