‘ఔటర్‌’పై రైట్‌ రైట్‌!

17 May, 2020 05:13 IST|Sakshi

రెండ్రోజుల్లో అన్ని వాహనాలకు అనుమతిచ్చే యోచన

కేంద్రం సడలింపు నిబంధనల ఆధారంగా నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) మళ్లీ వాహనాల రాకపోకలతో కళకళలాడనుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా అత్యవసర సేవలు, నిత్యావసర సరుకు వాహనాలు మినహా ఇతర వాహనాల రాకపోకల్ని నెలన్నర క్రితం హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఓఆర్‌ఆర్‌ విభాగాధికారులు నిలిపివేశారు. తాజాగా ఐటీ విభాగ కంపెనీలకు 33 శాతం సిబ్బందితో పనిచేసే వెసులుబాటునివ్వడం, ఇతర వ్యాపార సంస్థల కార్యకలాపాలు మొదలుకావడంతో ఓఆర్‌ఆర్‌పై అన్ని వాహనాలకు అనుమతినిచ్చే విషయమై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఆయా వాహనాల రాకపోకలతో వచ్చే టోల్‌ఫీజుతో మరింత సమర్థంగా ఓఆర్‌ఆర్‌ను నిర్వహిస్తూ, వాహనాల రాకపోకలను సాఫీగా సాగేలా చూడాలని యోచిస్తున్నారు. శనివారం నుంచే వాహన రాకపోకలను అనుమతించాలనుకున్నా.. కేంద్రం లాక్‌డౌన్‌ నిబంధనల్లో ఇచ్చే సడలింపుల ఆధారంగా గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాలని భావిస్తున్నారు. ఆదివారం కేంద్రం నిబంధనలు సడలించే అవకాశం ఉండడంతో వీలైతే సోమవారం నుంచే ఓఆర్‌ఆర్‌లో అన్ని వాహనాలకు అనుమతిచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. కాగా, 50 రోజుల లాక్‌డౌన్‌తో టోల్‌ఫీజు రూపేణా రూ.40 కోట్ల ఆదాయాన్ని సంస్థ కోల్పోయింది.

నగరం, శివార్లలో ట్రాఫిక్‌ సమస్య నుంచి ఊరట!
లాక్‌డౌన్‌కు ముందు రోజూ ఓఆర్‌ఆర్‌పై లక్షా 30వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగించేవి. లాక్‌డౌన్‌ సమయంలో మాత్రం రోజూ 3వేల వరకు తిరిగాయి. తాజాగా వాహనాలకు అనుమతిస్తే.. నగరం, శివార్లలో తలెత్తే ట్రాఫిక్‌ సమస్యలు కొంత తగ్గుతాయని ఆ విభాగాధికారులు చెబుతున్నారు. అలాగే, ఓఆర్‌ఆర్‌ వెంట వాహనదారులకు సకల సౌకర్యాలు కల్పించేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఇప్పటికే రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం కోసం తొలుత ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటును గాడిన పెడతామని అంటున్నారు.

మరిన్ని వార్తలు