ఇక ‘మహా’ పచ్చదనమే!

6 Jun, 2019 08:24 IST|Sakshi
తెల్లాపూర్‌లో హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన నర్సరీ (ఫైల్‌)

హరితహారం కోసం కోటీ 14 లక్షల మొక్కలు సిద్ధం  

ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో పాటు పార్కుల్లో పచ్చదనం పెంచేలా ప్రణాళికలు

అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగ అధికారులకు దిశానిర్దేశం చేసిన హెచ్‌ఎండీఏ కమిషనర్‌  

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పచ్చదనంపై దృష్టి సారించింది. నగరానికే తలమానికమైన ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో పాటు జన సముదాయాలు, కాలనీలు, నగర పంచాయతీలు, భువనగిరి, గజ్వేల్‌ రహదారులపై లక్షల్లో మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో పాటు చెరువుల చుట్టూ పక్కల కూడా భారీ స్థాయిలో మొక్కలు నాటి పచ్చదనాన్ని తీసుకొచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతుంది. ముఖ్యంగా ఔటర్‌ చుట్టూరా చిట్టడవిని తలపించే రీతిలో మొక్కలు నాటేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌కుమార్‌ ఐదో విడత హరితహారం కార్యక్రమంలో కోటీ 14 లక్షల మొక్కలను నాటడం, పంపిణీ చేయడం వంటి చర్యలు చేపట్టాలని అర్బన్‌ ఫారెస్ట్రీ డిపార్ట్‌మెంట్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓఆర్‌ఆర్‌ ప్రాంతాన్ని ఒక ఉద్యానవనంను తలపించేలా మొక్కలను పెంచాలని సూచించారు. ప్రధానంగా ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ ఛేంజెస్, సర్వీసు రోడ్లు, జాతీయ, రాష్ట్రీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో పాటు గతంలో ఓఆర్‌ఆర్‌ చుట్టూపక్కల నాటిన మొక్కల ప్రస్తుత పరిస్థితి ఏంటన్న దానిని కూడా ఆరా తీశారు. గతంలో నాటిన మొక్కల సంరక్షణను చూసుకుంటూనే మరిన్ని మొక్కలు నాటాలని హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్రీ డిపార్ట్‌మెంట్‌ అధికారులకు కమిషనర్‌ అరవింద్‌కుమార్‌ దిశానిర్దేశనం చేసినట్టు తెలిసింది.  

కోటీ 14 లక్షల మొక్కలు రెడీ...
నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో గ్రీనరీ పెంచేందుకు కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన హరితహారంలో ఈ ఏడాది కోటి 14 లక్షల మొక్కలను హెచ్‌ఎండీఏ అందుబాటులో ఉంచింది. వీటిలో దాదాపు 60 లక్షల మొక్కలను ఎంపీడీవోల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించిన హెచ్‌ఎండీఏ అధికారులు దాదాపు 54 లక్షల మొక్కలు మొదట నాటాలని నిర్ణయించారు. ఓఆర్‌ఆర్, పార్కులు, రేడియల్‌ రోడ్లు, చెరువుల, ఉప్పల్‌ భగాయత్, మూసీ రివర్‌ ప్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాంతాల్లో మొక్కలు పెంచేందుకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. ఓఆర్‌ఆర్‌ వెంట వాహన ప్రయాణాన్ని చల్లదనం చేయడంతో పాటు అడవిని తలపించేలా మొక్కలు నాటేందుకు అర్బన్‌ ఫారెస్ట్రీ అధికారులు సిద్ధమవుతున్నారు. గతేడాది ఓఆర్‌ఆర్‌ వెంట పెట్టిన మొక్కల్లో దాదాపు 90 శాతం మేర మొక్కలను సంరక్షించగలిగామని తెలిపారు. మరో మూడేళ్లలో గ్రీనరీ ఫలితాలు కనిపిస్తాయన్నారు. గతేడాది 95 లక్షల 30 వేలు మొక్కలు హెచ్‌ఎండీఏ పంపిణీ చేయడంతో పాటు నాటితే ఈసారి ఆ సంఖ్య కోటీ 14 లక్షలకు పెంచామని తెలిపారు. దాదాపు 163 రకాల మొక్కలను హెచ్‌ఎండీఏ పరిధిలోని 18 నర్సరీలో పెంచామని తెలిపారు.  

బ్లాక్‌ ప్లాంటేషన్‌...
హెచ్‌ఎండీఏ ఆధ్వరంలో ప్రత్యేకంగా 17 ప్రాంతాలలో  25 చోట్ల  బ్లాక్‌ ప్లాంటేషన్‌ చేపడుతున్నారు. జన సముదాయాలకు, కాలనీలకు దగ్గరలో చేపట్టనున్న బ్లాక్‌ ప్లాంటేషన్‌లలో నడక రహదారులు, చిన్నారుల పార్కులు, సైక్లింగ్‌ పాత్‌లు కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే 12 నగర పంచాయితీలలో కూడా పచ్చదనాన్ని పెంచేలా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. భువనగిరి, గజ్వేల్‌ రహదారిపై సెంట్రల్‌ మీడియన్లలో(రోడ్డు మధ్యలో ఉన్న ఖాళీస్థలం) కూడా గతంలోలాగానే మొక్కలు పెంచి పచ్చదనాన్ని అభివృద్ధి చేయనున్నారు. అలాగే కీసర, ఘట్‌కేసర్, శంషాబాద్, పెద్దఅంబర్‌ పేట, నానక్‌రాంగూడ తదితర ప్రాంతాల్లో ల్యాండ్‌స్కేప్‌ చేసి పచ్చదనాన్ని కళ్లముందు కనపడేలా చేయనున్నారు. అలాగే హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగం ప్రైవేటు లే–అవుట్ల అనుమతులు మంజూరు చేసేటప్పుడు కూడా పచ్చదనాన్ని పెంపొందించటానికి తప్పనిసరిగా మొక్కల పెంపకం చేపట్టేటట్లు చర్యలు తీసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు