'అది హైదరాబాద్‌ మెట్రో కాదు'

6 Dec, 2017 12:10 IST|Sakshi

మెట్రో పిల్లర్‌కు పగళ్లంటూ ప్రచారం

వార్తలను ఖండించిన మెట్రో ఎండీ

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో పిల్లర్‌కు పగుళ్లు వచ్చినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తమని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని ఐఎస్‌బీ- గచ్చిబౌలి మార్గంలోని మెట్రో పిల్లర్‌కు పగుళ్లంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. అసలు ఆ మార్గంలో మెట్రో లైనే లేదని తెలిపారు. ఇలాంటి వార్తలపై గతంలోనే మంత్రి కేటీఆర్‌ వివరణ కూడా ఇచ్చారని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటో హైదరాబాద్‌ మెట్రోది కాదని.. పెషావర్‌లోని మెట్రో పిల్లర్‌ అని ఆయన బుధవారం వెల్లడించారు. వేల టన్నుల బరువు, భూకంపాలను సైతం తట్టుకునేలా హైదరాబాద్‌ మెట్రోను నిర్మించామన్నారు. కొందరు ఓర్వలేక మెట్రోపైన  దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కాగా నగర వాసుల కలల మెట్రో నవంబర్‌ 28న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నాగోల్‌–అమీర్‌పేట్, మియాపూర్‌–అమీర్‌పేట్‌ మధ్య 30 కిలో మీటర్లు నడుస్తున్న మెట్రోకు గ్రేటర్‌వాసుల నుంచి విశేష ఆదరణ వస్తోంది. లక్షలాదిమంది సిటీజన్లు కుటుంబ సభ్యులతో కలిసి మెట్రోలో జాయ్‌రైడ్స్‌ చేసి ఆనందిస్తున్నారు. గడిచిన వారంలో దాదాపు 9 లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణించారు. లక్షా 50 వేల మెట్రో స్మార్టు కార్డులు విక్రయించారు.

మరిన్ని వార్తలు