అక్రమ నల్లాలపై కదులుతున్న డొంక!

20 Jan, 2020 08:55 IST|Sakshi

సత్ఫలితాలిస్తున్న జలమండలి ఇంటింటి సర్వే

ఇప్పటి వరకు రూ.11.66 కోట్ల ఆదాయం  

నెలకు నల్లా బిల్లుల ద్వారా రూ.33.30 లక్షలఅదనపు రెవెన్యూ

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో అక్రమ నల్లాల తీగ లాగితే డొంక కదులుతోంది .నగర పరిధిలో వేలాదిగా ఉన్న ఆక్రమ నల్లాల భరతం పట్టేందుకు జలమండలి చేపట్టిన ఇంటింటి సర్వే సత్ఫలితాన్నిస్తోంది. ఇప్పటి వరకు 6 నిర్వహణ డివిజన్ల పరిధిలో చేపట్టిన సర్వేలో 1600 అక్రమ నల్లాల భాగోతం బయటపడింది. మరో ఆరువేల నల్లా కనెక్షన్ల కేటగిరి మార్పుతో జలమండలికి అదనపు ఆదాయం సమకూరింది. అక్రమ నల్లాలను వీడీఎస్‌ పథకం కింద క్రమబద్ధీకరించడం, జరిమానాలు, నల్లా కనెక్షన్‌ ఛార్జీల రూపంలో బోర్డుకు రూ.11.66 కోట్ల ఆదాయం లభించింది. నెలవారీగా మరో రూ.33.30 లక్షల అదనపు ఆదాయం నల్లా బిల్లుల ద్వారా సమకూరుతోంది. ఇంటింటి సర్వే ప్రక్రియను మరో 14 నిర్వహణ డివిజన్ల పరిధిలో కొనసాగించడం ద్వారా జలమండలి రెవెన్యూ ఆదాయాన్ని గణనీయం గా పెంచాలని బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.దానకిశోర్‌ సిబ్బందికి దిశానిర్దేశం చేయడం విశేషం. ఈ సర్వే ద్వారా మహా నగరం పరిధిలో ఉ న్న సుమారు 50 వేల అక్రమ నల్లాల బండారం బయటపడుతుందని బోర్డు వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటి లెక్క తేలితే జలమండలికి ఆర్థిక కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు. 

ఇంటింటి సర్వే ఫలితాలు ఇలా..
జలమండలి రెవెన్యూ సిబ్బంది, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సిబ్బంది ఇంటింటికి వెళ్లి..ప్రస్తుతం ఆయా భవనాలకున్న నల్లా కనెక్షన్‌ వివరాలు, బోర్డు రికార్డులో ఉన్న వివరాలతో సరి పోలుతున్నాయో లేదో చెక్‌ చేస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాల ఇంటి నిర్మాణ వైశాల్యం, అంతస్తులు, నెలవారీగా వారు చెల్లిస్తున్న నీటి బిల్లు...నీటి పరిమాణం..తదితర వివరాలను సేకరిస్తున్నారు. ఈ సిబ్బంది సేకరించిన వివరాలను..బోర్డు విజిలెన్స్‌ సిబ్బంది తిరిగి తనిఖీ చేస్తున్నారు. కనెక్షన్‌ కేటగిరిలో మార్పులు గుర్తిస్తే..వెంటనే మార్పులు చేర్పులు చేస్తున్నారు. అక్రమ నల్లాలను గుర్తిస్తే..వీడీఎస్‌ పథకం కింద క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తున్నారు. 

నష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నం...
రూకల్లోతు ఆర్థిక నష్టాల్లో ఉన్న జలమండలిని గట్టెక్కించేందుకు, రెవెన్యూ ఆదాయం పెంపుపై బోర్డు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం నెలకు లభిస్తున్న రూ.120 కోట్ల ఆదాయంలో సింహభాగం..సుమారు రూ.75 కోట్లు విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తోంది. మిగతా మొత్తం నిర్వహణ వ్యయాలు, ఉద్యోగుల జీతభత్యాలకు అరకొరగా సరిపోతోంది. ప్రస్తుతం నెలకు సుమారు రూ.30 కోట్ల లోటుతో నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో చేపట్టిన ఇంటింటి సర్వేతో ఇప్పటి వరకు రూ.11.66 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. నెలవారీగా నల్లా బిల్లుల రూపేణా అదనంగా రూ.33.30 లక్షల ఆదాయం లభిస్తోంది.

మరిన్ని వార్తలు