జలమండలి వీడీఎస్‌కు శ్రీకారం

23 Nov, 2019 09:12 IST|Sakshi

అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణ షురూ 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌లో అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణకు సంబంధించి జలమండలి శుక్రవారం వీడీఎస్‌ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఎలాంటి అదనపు చార్జీల్లేకుండానే కనెక్షన్లను క్రమబద్ధీకరించుకోవచ్చు. 2020 ఫిబ్రవరి 21 వరకు 90 రోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది. నగరవాసులకు మంచి నీటిని సరఫరా చేసేందుకు జలమండలి గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని నగరానికి తీసుకొస్తోంది. ఇందుకు ప్రతి వెయ్యి లీటర్లకు గాను రూ.47 చొప్పున ఖర్చు చేస్తోంది. రోజుకు 472 మిలియన్‌ గ్యాలన్లు అంటే 214.76 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తోంది. అయితే ఇందులో 37శాతం వివిధ కారణాలతో వృథా అవుతోంది. మరోవైపు కొంతమంది అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకొని జలమండలి ఆదాయానికి గండి కొడుతున్నారు. ఫలితంగా జలమండలికి ప్రతినెల సుమారు రూ.20 కోట్ల మేర నష్టం వస్తోంది.

ఈ నేపథ్యంలో అక్రమ నల్లా కనెక్షన్లపై దృష్టిసారించిన జలమండలి వీడీఎస్‌కు శ్రీకారం చుట్టింది. గతంలోనూ క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వగా.. మూడేళ్ల బిల్లుతో పాటు రెట్టింపు కనెక్షన్‌ చార్జీలు పెనాల్టీగా వసూలు చేశారు. కానీ ఈసారి ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే క్రమబద్ధీకరణకు అవకాశమిచ్చారు. ఈ పథకం కాలపరిమితి ముగిసిన తర్వాత క్రమబద్ధీకరించుకోవాలనుకుంటే రెట్టింపు కనెక్షన్‌ చార్జీలు, మూడేళ్ల వినియోగ చార్జీలతో పాటు రూ.300 సర్వీస్‌ చార్జీ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. వీడీఎస్‌లోనే క్రమబద్ధీకరించుకుంటే ఎలాంటి అదనపు చార్జీలు లేకపోవడంతో పాటు చట్టపరమైన చర్యల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. వీడీఎస్‌కు సంబంధించి జలమండలి కార్యాలయ అధికారులను గానీ, 155313 నంబర్‌లో గానీ సంప్రదించొచ్చని సూచించారు.  

మరిన్ని వార్తలు