హెలీ టూరిజానికి అంతరాయం

7 Mar, 2016 01:09 IST|Sakshi
హెలీ టూరిజానికి అంతరాయం

వెనుదిరిగిన ప్రజలు
టికెట్ మొత్తం ఇవ్వకుండా పంపిన నిర్వాహకులు

 
హైదరాబాద్: హెలీ టూరిజానికి ఆదిలోనే అంతరాయం ఎదురైంది. రాష్ట్ర పర్యాటక శాఖ, ఇండ్‌వెల్ ఏవియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి ఒకటిన నెక్లెస్ రోడ్డు, జలవిహార్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో హెలీ టూరిజం కార్యక్రమం ప్రారంభమైంది. హెలీకాప్టర్‌లో నగరాన్ని వీక్షించాలన్న ఆసక్తితో పలువురు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేశారు. కొందరికి ఆదివారం సమయం కేటాయించారు. ఈ నేపథ్యంలో నల్లగొండకు చెందిన డి. ప్రసాద్, మెహిదీపట్నంకు చెందిన జనార్దన్ తదితరులు ఆదివారం ఉదయమే హెలీ టూరిజం నిర్వహించే ప్రదేశానికి వచ్చి తమ టికెట్లు చూపించారు. అక్కడ ఉన్న నిర్వాహకులు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటలకు రావాలని చెప్పారు. వారు అక్కడే నిరీక్షించి 4 గంటలకు నిర్వాహకులను ప్రశ్నిస్తే ఈ రోజు హెలీకాప్టర్ ట్రిప్పులు రద్దయ్యాయని మరోసారి సమయం కేటాయిస్తామని, లేకుంటే టికెట్ మొత్తం వెనక్కు తీసుకోవాలని దురుసుగా బదులిచ్చారు. మెహిదీపట్నానికి చెందిన జనార్దన్ మాట్లాడుతూ తాను మూడు రోజుల క్రితం నాలుగు టికెట్లు బుక్ చేశానన్నారు.

ఉదయం 4 సార్లు నిర్వాహకులకు ఫోన్ చేసి కుటుంబసభ్యులతో కలసి వచ్చానన్నారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు మమ్మల్ని అక్కడే ఉంచి.. చివర్లో ట్రిప్పులు రద్దు చేస్తున్నట్లు తెలిపారన్నారు. డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి, మరి కొద్ది సేపు ఉంచి  అది కూడా ఇవ్వకుండా వెనక్కు పంపారని వాపోయారు. తనతోపాటు పది మంది వెనక్కు వెళ్లారన్నారు. ఈ విషయమై హెలీ టూరిజం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కిట్టును సాక్షి ప్రశ్నిస్తే ఉపరాష్ట్రపతి నగరంలో ఉన్నందున ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వటంలో 4 గంటలు ఆలస్యం చేశారన్నారు. దాంతో హెలీ టూరిజం కోసం టికెట్లు కొనుగోలు చేసిన వారిలో కొందరిని వె నక్కు పంపాల్సి వచ్చిందన్నారు.
 

మరిన్ని వార్తలు