ఆ ట్యాగ్‌ మాకెందుకు?

17 Feb, 2018 09:43 IST|Sakshi

ఆడపిల్ల అణిగిమణిగి ఉండాలా?

ప్రశ్నించిన ‘హోలీమేరీ’ విద్యార్థినులు     

ఆడపిల్లలా ఉండు.. ఆడపిల్లలా మాట్లాడు.. ఆడపిల్లలా నడువు..చివరకు నవ్వడం, ఏడ్వడం, కూర్చోవడం, తినడం.. ఇలా అన్నీ ఆడపిల్లలా చేయమంటారు! ఎందుకు వేశారీ శిక్షలు.? ఎవరు విధించారీ ఆంక్షలు.? అసలీ ‘ఆడపిల్ల’ ట్యాగ్‌ మాకెందుకు? అంటూ ప్రశ్నించారు హోలీమేరీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ విద్యార్థినులు. స్త్రీ వివక్షపై ‘సాక్షి’ సాగిస్తున్న సమరంలో భాగంగా ‘నేను శక్తి’ శీర్షికతో అమ్మాయిలు మనసు విప్పి మాట్లాడారు.  స్త్రీపురుషసమానత్వ భావనకు సాక్ష్యంగా నిలిచారు.     

సాక్షి, సిటీబ్యూరో :  మేము అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. బరువుగా కాదు.. బాధ్యతగా ఎదుగుతాం. మా చుట్టూ ఉన్న సమాజాన్ని నిలదీస్తాం. మార్పుని సాధిస్తాం. అమ్మాయే కదా.! అన్నీ నిశ్శబ్దంగా
భరిస్తుంది అనుకుంటున్నారా? ఎదుర్కొంటాం.. తిరగబడతాం.. సమానత్వం కోసం.. సమాజంలో మార్పు కోసం..   

ఆడపిల్లవి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ తీసుకున్నావా? అని ఆశ్చర్యపోతాడు చుట్టం చూపుగా వచ్చిన అంకుల్‌.  అయినా ఇంజినీరింగ్‌ ఎందుకు? త్వరగా పూర్తయ్యే డిప్లొమా కోర్సు ఏదైనా చేయలేకపోయావా? అంటూ ఉచిత సలహా ఇస్తాడు దారినపోయే దానయ్య. పురివిప్పిన నెమలిలా ఓ ఆడపిల్ల అన్నయ్య పెళ్లిలో నాట్యం చేయడం కూడా తప్పేనంట. ఆడపిల్ల చదివితే ఓ సమస్య.. ఉద్యోగం చేస్తే మరో సమస్య. ఆమె ఇంట్లో ఉన్నా,  బయటకెళ్లినా సమస్యే. నిజానికి ఆమె ప్రతి కదలికా ఓ సమస్యే. అసలు ఆడపిల్లే సమస్యగా మారిన చోట అంబరాన్నంటే ఆత్మవిశ్వాసంతో అడుగడుగునా తనని తాను రుజువు చేసుకుంటూ.. వివక్షని ఎదిరిస్తూ.. తమ కాళ్లపై తాము నిలబడుతూ మహిళా శక్తికి మారుపేరుగా నిలుస్తున్నారీ నేటి బాలికలు. తాము ఎదుర్కొన్న అవమానాలు, వివక్షలను చెప్పిన అమ్మాయిలు... ‘సాక్షి’ సమరంలో భాగమవుతామని ముక్తకంఠంతో నినదించారు.

అన్నింట్లో వివక్షే..
‘ఆటల దగ్గర్నుంచి వేషధారణ వరకు మగపిల్లల్లో లేని అణకువని ఆడపిల్లల్లో ఎందుకు వెతుకుతారు? అణకువగా ఉండడమంటే అణిగిమణిగి ఉండడమనేనా? ఆడపిల్లలకు అభిప్రాయాలుండవా? ఆకాంక్షలుండవా? ఆశలుండవా? చదువు, ఉద్యోగం ఆడపిల్లలకు అవసరం లేని విషయాలా? ఆ రెండింటిలోనూ ఎంపిక బాధ్యత ఆమెది కాదా? ఏ కోర్సు చేయాలి.. డిప్లొమోనా? ఇంజనీరింగా? ఏ సబ్జెక్ట్‌ తీసుకోవాలి... మెకానికలా? కంప్యూటర్‌ సైన్సా? ఏ ఉద్యోగం చేయాలి.. టీచరా? డాక్టరా? చివరకు ఏ మీడియం తీసుకోవాలి... అన్నయ్యకైతే ఆంగ్లం..? నాకైతే తెలుగు! ఏ డ్రెస్‌ వేసుకోవాలి... చూడీదారా? షార్ట్స్‌ వేసుకోవాలా? మా పనులకు హద్దు సూర్యాస్తమయమేనా? నాన్నకి జబ్బు చేస్తేనో, అమ్మకి మందులు అయిపోతేనే ఆడపిల్లలు బయటకెళ్తే రేప్‌లు జరుగుతాయని భయపెట్టడం కన్నా... అలా జరగకుండా మగపిల్లల్ని పెంచరెందుకో? డబ్బున్నా లేకున్నా ఆడపిల్లకి సర్కార్‌ బడి, అన్నయ్యకి ప్రైవేట్‌ కార్పొరేట్‌ చదువు. ఎందుకీ వివక్ష? తల్లిందండ్రుల బాధ్యతను ఆడపిల్లలు పంచుకోరనేగా? ఈ అసమానతలను, వివక్షనూ పక్కనపెట్టి మమ్మల్ని సమానంగా ఎదగనివ్వండి.. మేమేంటో నిరూపిస్తాం’ అంటూ సవాల్‌ చేశారు ‘హోలీమేరీ’ విద్యార్థినులు. అన్నింటికీ అమ్మాయి అంటూ తక్కువ చేసి చూసే అసమాన భావనలకు స్వస్తి పలుకుతూ... మాకు తగిలిస్తోన్న ‘అమ్మాయి ట్యాగ్‌’ను వదిలించుకొని.. మేమొక శక్తిగా ఎదుగుతామని చాటి చెప్పారు.

మరిన్ని వార్తలు