హోలీ.. మృత్యుకేళీ

19 Mar, 2014 04:25 IST|Sakshi
హోలీ.. మృత్యుకేళీ

వారంతా పదవ తరగతి విద్యార్థులు.. ఒకే పాఠశాలలో చదువుతున్నారు. సోమవారం ఆనందంగా హోలీ సంబరాల్లో మునిగితేలారు. అనంతరం మిర్యాలగూడ మండలం చిల్లాపురం పరిధిలోని వజీరాబాద్ మేజర్‌కాల్వలో స్నానానికి వెళ్లారు. అక్కడ ఓ విద్యార్థి కాల్వలో పడిపోయాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో మిగతా నలుగురూ పడిపోయారు. సోమవారం కాల్వలో ఒకరి మృతదేహం లభించింది. మిగతా నలుగురు ఈ సంఘటనతో భయపడి ఎక్కడో దాక్కున్నారని వారి కుటుంబ సభ్యులు భావించారు. కానీ, కాల్వలో పడిపోయి చనిపోయిన వారిలో ఆ నలుగురూ ఉన్నారని తెలవడంతో అంతా షాక్‌కు గురయ్యారు.  
 
 
మిర్యాలగూడ మండలం చిల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని వజీరాబాద్ మేజర్ కాల్వ ఐదుగురు విద్యార్థులను బలిగొంది.  వీరిలో సోమవారం ఒక విద్యార్థి మృతదేహం లభించగా, మిగతా నలుగురివి మంగళవారం పోలీసులు కనుగొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడ పట్టణానికి చెందిన మేరెడ్డి కోటిరెడ్డి కుమారుడు నవీన్‌రెడ్డి (15), హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఏలూరి కమలాకర్‌రావు కుమారుడు సాయికుమార్ (16), గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరు గ్రామానికి చెందిన ఉద్దంటి సుబ్బారావు కుమారుడు మహేష్ (16) , నిడమనూరు మండలం తుమ్మడం గ్రామానికి చెందిన పగిళ్ళ శ్రీనివాస్ కుమారుడు కార్తీక్ (16), త్రిపురారం మండలం బాబుసాయిపేట గ్రామానికి చెందిన బచ్చు మురళి కుమారుడు శివకుమార్ (16) స్థానిక ఎస్పీఆర్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నారు. సోమవారం హోలీ పండగ కావడంతో ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి ఉదయం 6గంటలకే బయటకు వెళ్లారు. అందరూ కలిసి హోలీ ఆడారు.


 ఒకరిని కాపాడబోయి మరొకరు..

 హోలీ ఆడాక స్నానం చేసేందుకు పట్టణానికి సమీపంలో ఉన్న వజీరాబాద్ మేజర్ కాల్వకు వెళ్లారు. ఐదుగురికీ ఈత రాదు.  మేజర్‌కాల్వ ఒడ్డున ఉండి స్నానం చేస్తున్నారు. ఈ క్రమంలో మేజర్‌కాల్వలో ప్రవాహం అధికంగాా ఉండడంతో ఒక విద్యార్థి కొట్టుకపోతుండటంతో ఒకొక్కరు వారిని కాపాడబోయి ఐదుగురు కాల్వలో కొట్టుకుపోయినట్టు భావిస్తున్నారు. ముందుగానవీన్‌రెడ్డి కొట్టుకుపోతుండగా చూసిన కొంతమంది పాఠశాల యాజమాన్యానికి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్‌ఐ రాహుల్‌దేవ్ సంఘటనస్థలానికి సిబ్బందితో చేరుకొని కాల్వకు నీటి విడుదలను నిలిపివేయించారు. సంఘటన స్థలానికి కొద్దిదూరంలోనే నవీన్‌రెడ్డి మృతదేహం సోమవారమే లభించింది. కాగా ఒక విద్యార్థి మాత్రమే కొట్టుకుపోయాడని భావించి నీటి విడుదలను తిరిగి కొనసాగించారు.

 భయపడి ఉంటారని భావించి..

 రాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో మిగతా నలుగురు విద్యార్థుల తల్లిదండ్రులు రూరల్ ఎస్‌ఐ రాహుల్‌దేవ్‌కు ఫిర్యాదు చేశారు. కళ్ల ముందే స్నేహితుడు కొట్టుకపోవడంతో భయపడి ఉండొచ్చని..ఆలస్యంగా వస్తుండొచ్చని భావించారు. మంగళవారం ఉదయం కూడా పిల్లల ఆచూకీ లభించకపోవడంతో ఎస్‌ఐ రాహుల్‌దేవ్ మళ్లీ మేజర్‌కాల్వకు నీటి విడుదల నిలిపివేసి సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వెంకటాద్రిపాలెం గ్రామ సమీపంలో ఒక మృతదేహం లభించగా, మరో ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు చిల్లాపురం శివారులో ఒకేచోట లభించాయి. మృతదేహాలను బయటికి తీయించి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.  పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఆస్పత్రికి ఎస్పీఆర్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తరలివచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణమంతా విషాద వాతావరణం నెలకొంది. ఈ మేరకు రూరల్ ఎస్‌ఐ రాహుల్‌దేవ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
 
 ప్రయోజకుడిని చేద్దామనుకుని..

 మృతుడు నవీన్‌రెడ్డి తండ్రి కోటిరెడ్డి రెడ్డీ ల్యాబ్స్ లో పనిచేస్తూ  మిర్యాలగూడ పట్టణంలోని సంతోష్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. రోజూ కంపెనీకి వెళ్లి వస్తుంటాడు. ఇతనికి కుమారుడు నవీన్‌రెడ్డితోపాటు మరో కుమార్తె ఉంది. పిల్లల చదువు కోసం మిర్యాలగూడలో ఉంటున్నాడు. ఎదిగిన కుమారుడు అకాల  మరణంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చదువుల్లో మంచి ప్రతిభ కనపరిచే కుమారుడిని ప్రయోజకుడిని చేయాలని తల్లిదండ్రులు కన్న కలలు కలగా మిగిలిపోయాయి.  
 
 కుమారుడి కోసమే పట్టణంలో...

 నిడమనూరు మండలం తుమ్మడం గ్రామానికి చెందిన పగిల్ల శ్రీనివాస్‌కు  కుమారుడు కార్తీక్, ఓ కుమార్తె ఉన్నారు. పిల్లలను మంచిగా చదివించాలని మిర్యాలగూడ పట్టణం వచ్చి ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. పిల్లలను చదివించుకుంటూ వచ్చేకొద్దిపాటి వేతనంతో సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలో కుమారుడిని వజీరాబాద్ మేజర్ కాలువ మింగేయడంతో తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి.
 
చిరు ఉద్యోగం చేస్తూ...

 త్రిపురారం మండలం బాబుసాయిపేటకు చెందిన బచ్చు మురళి  ఐకేపీ కార్యాలయంలో సీసీగా పనిచేస్తూ తన ఇద్దరు కుమారులను, కుమార్తెను పట్టణంలో చదవిపిస్తున్నాడు. పదవ తరగతి చదువుతున్న కుమారుడు శివకుమార్ కాల్వలో కొట్టుకుపోయి మృతి చెందటంతో తల్లిదండ్రులు షాక్‌కు గురై సొమ్మసిల్లి పడిపోయారు.
 

మరిన్ని వార్తలు