జాతిపితకు ఘన నివాళులు

31 Jan, 2017 02:26 IST|Sakshi
జాతిపితకు ఘన నివాళులు

లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌ వద్ద గవర్నర్, సీఎం నివాళులు
సాక్షి, హైదరాబాద్‌: జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గవర్నర్‌ నరసింహన్ , ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌ వద్ద ఉన్న బాపూఘాట్‌లో గాంధీ విగ్రహం వద్ద పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం బాపూ ధ్యాన మందిరంలో జరిగిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ‘రఘుపతి రాఘవ రాజారాం..’ అంటూ స్కూల్‌ విద్యార్థులు, పెద్దలతో కలిసి గవర్నర్, ముఖ్యమంత్రి గళం కలిపారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను స్మరిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. వివిధ పాఠశాలలకు చెందిన  విద్యార్థులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బాపూఘాట్‌ వద్ద కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నాయిని, తలసాని శ్రీనివాస్, పద్మారావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్‌శర్మ, దైవజ్ఞశర్మ తదితరులు నివాళులర్పించారు. ఇక గవర్నర్‌ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు రాకముందే సీఎల్పీ నేత జానారెడ్డి బాపూఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించారు. సీఎం, గవర్నర్‌ వచ్చి, వెళ్లిపోయిన అనంతరం కాం గ్రెస్‌ నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్‌రెడ్డి నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు