సీఎం సారూ.. కనికరించండి 

13 Aug, 2019 12:26 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాను.. ఉద్యోగం చేసే పరిస్థితి లేకపోయింది.. అనేక ఏళ్లుగా ఎలాగోలా బతుకు బండి లాగాను..ఇప్పుడు వృద్ధుడినై పోయా..ఏదో ఒక ఉపాధి చూపండి అని ఓ కుటుంబం సీఎం కోసం తెలంగాణ భవన్‌ వద్ద కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తోంది. రెండు రోజుల క్రితం బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌ వద్ద సీఎం కేసీఆర్‌ను కలవాలని వచ్చారు. రోడ్లపైనే పడుకుంటున్నారు. తెలంగాణ భవన్‌లో ఎవరినీ కలవడానికి అక్కడి సిబ్బంది కనికరించలేదు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన షేక్‌ ఖాసిం దీనావస్థ ఇది.. ఆ వివరాలు ఖాసీం  మాటల్లోనే..1980 నుంచి 1999 వరకు హోంగార్డుగా విధులు నిర్వహించా. విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మెదడు దెబ్బతిని పక్షవాతం వచ్చింది. దీనికి తోడు మూర్ఛవ్యాధి వేధిస్తోంది. అప్పటికి పిల్లలు చిన్నవారు కావడంతో కుటుంబ పోషణ భారమైంది. ఉన్న ఒక్క కుమారుడు యాకుబ్‌పాషా సరిగ్గా మేజర్‌ అయ్యే సమయానికి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.  

ఆ ప్రమాదంలోనే తల్లి షేక్‌ మొగలబికి నడుం విరిగింది. ఉన్న ఒక్క కూతురు షేక్‌ మీరాబి ఆలనా పాలన చూసుకుంటున్నది. మా కుటుంబం పరిస్థితి ప్రస్తుతం వర్ణనాతీతంగా ఉంది. ఎలాంటి ఆదాయ వనరులు లేకపోవడంతో కూతురు మీరాబి తల్లిదండ్రుల పోషణ భారంతో ఒత్తిడికి గురవుతోంది. నా హోంగార్డు ఉద్యోగాన్ని గానీ, పోలీసు శాఖలో లేదా ఏ ఇతర శాఖలోనైనా మరో జాబ్‌ గానీ కూతురు మీరాబికి ఇవ్వాలని కోరుకుతున్నా.  ఈ నెల 8న హోంమంత్రిని కలవడానికి సచివాలయానికి వెళ్లగా కుదరలేదు. అక్కడి సిబ్బంది బయటికి పంపించారు. తెలంగాణ భవన్‌లో సీఎంను కలిసేందుకు వచ్చినా ప్రయోజనం లేకపోయింది. మాతో పాటు కూతురు మీరాబి తన చిన్నారితో చెట్ల కింద నిద్రించాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పటికైనా స్పందించాలని వృద్ధ దంపతులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు