హోర్డింగ్‌ పై హోంగార్డ్‌ : భారీ ట్రాఫిక్‌ జామ్‌

14 May, 2018 11:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని ఖైరతాబాద్‌లో హోంగార్డుల ఆందోళనతో సోమవారం భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న వాహనదారులు సుమారు మూడు గంటలుగా నరకం అనుభవిస్తున్నారు. ట్యాంక్‌ బండ్‌ మొదలు ఖైరతాబాద్‌-నెక్లెస్‌ రోడ్డు, ఖైరతాబాద్‌-పంజాగుట్ట, సోమాజిగూడ, రాజ్‌భవన్‌ రోడ్లలో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. దాదాపు మూడు గంటల సమయం నుంచి ట్రాఫిక్‌ జామ్‌ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఖైరతాబాద్ సర్కిల్ కావడంతో వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

మహబూబ్‌నగర్‌కు చెందిన గుర్రం గౌడ్‌ అనే హోంగార్డు ఉద్యోగం నుంచి తొలగించిన 400 మంది హోంగార్డులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలంటూ హోర్డింగ్‌ ఎక్కి ఆందోళనకు దిగాడు. లేకపోతే పైనుంచి దూకుతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీని కారణంగా భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. గౌడ్‌ ఆందోళనకు మద్దతుగా మరో 250 మంది హోంగార్డులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని, ఆందోళనకు దిగారు. తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలంటూ ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్ బైఠాయించారు.

పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్లు ఉద్యోగం చేయించుకొని, అనంతరం సర్వీస్‌ నుంచి తొలగించాని ఆవేదన వ్యక్తం చేశారు. 400 మంది హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాంటూ డిమాండ్‌ చేశారు. తమ ఉద్యోగ హామీ ఇచ్చేంత వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిరసనకారుడిని కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు