సస్పెండ్‌ చేశారని.. హోంగార్డు హల్‌చల్‌

14 Jun, 2019 12:04 IST|Sakshi
 హోంగార్డు యాదీలాల్‌

ఆత్మహత్య చేసుకుంటానని హోంగార్డు హల్‌చల్‌ 

పంజగుట్ట:  అకారణంగా తనను విధుల్లోనుంచి సస్పెండ్‌ చేశారని, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో  పోలీస్‌స్టేషన్‌ ఎదుటే ఆత్మహత్యకు పాల్పడతానని ఓ హోంగార్డ్‌ హల్‌చల్‌ చేసిన సంఘటన పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ ఎదుట చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..నార్సింగ్‌కు చెందిన యాదీలాల్‌ పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఇతను మద్యం మత్తులో విధులకు హాజరవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత నెల 7న ఫిర్యాదు దారులతో సరిగ్గా ప్రవర్తించనందున అతడిని హోంగార్డ్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు.

గురువారం అతడిని పిలిచిన హెడ్‌ క్వార్టర్స్‌ అధికారులు నిన్ను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు అందినందున,  డ్యూటీకి రావాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఉత్తర్వులను అందించారు. దీంతో నేరుగా పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన యాదీలాల్‌  ఆత్మహత్య చేసుకుంటానని హల్‌ చేశాడు. హంగామాచేశాడు.  ఈ సందర్భంగా యాదీలాల్‌ మాట్లాడుతూ అకారణంగా తనను సస్పెండ్‌ చేశారని, తాను సరిగా విధులు నిర్వహించడం లేదని, ఫిర్యాదు దారులతో అసభ్యంగా  మాట్లాడినట్లు ఆరోపిస్తున్న అధికారులు అందుకు ఆధారాలు చూపాలని కోరాడు. మే 5న పోలీస్‌స్టేషన్‌ బ్యారెక్‌లో కొందరు హోంగార్డులు గొడవపడ్డారని, అందుకు తనను బాధ్యుడిని చేస్తూ చర్య తీసుకోవడం దారుణమని ఆరోపించాడు. తనను విధుల్లోంచి తొలగిస్తే తన కుటుంబం రోడ్డున పడుతుందని ఆవేదనవ్యక్తం చేశాడు. తనకు న్యాయం జరిగేవరకు అక్కడి నుంచి కదిలేదని భీష్మించుకున్నాడు.

ఆరోపణలు అవాస్తవం.. 
హోంగార్డు యాదీలాల్‌ ఆరోపణలు అవాస్తవమని పంజగుట్ట ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌ కుమార్‌ తెలిపారు. అతడి ప్రవర్తన సరిగా లేనందున పలుమార్లు హెచ్చరించామని, అయినా వైఖరిలో మార్పు రాకపోవడంతో మే 7న హోంగార్డ్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అతడిని అటాచ్‌ చేసినట్లు తెలిపాడు. యాదీలాల్‌సస్పెన్షన్‌  విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌ కుమార్‌ 

మరిన్ని వార్తలు