అభివృద్ధిపై దృష్టి పెట్టండి

12 Jan, 2017 03:06 IST|Sakshi
అభివృద్ధిపై దృష్టి పెట్టండి

► మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాల డీజీపీలతో కేంద్ర హోంశాఖ!
►నాయకులకు భద్రత పెంచాలని ఆదేశం
►మావోయిస్టు పార్టీ మార్చిన నగదుపై చర్చ

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు, వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర హోంశాఖ వివిధ రాష్ట్రాల డీజీపీలకు సూచించింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కీలక భేటీ జరిగినట్టు తెలిసింది. మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాల నుంచి డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. ఏటా ఎంఓపీఎఫ్‌(మాడ్రనైజేషన్  ఆఫ్‌ పోలీస్‌ ఫోర్స్‌)ఎల్‌డబ్ల్యూఈ(లెఫ్ట్‌ వింగ్‌ ఎక్స్‌ట్రిమిజమ్‌)కు సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించేవారు.

కానీ గతేడాది ప్రణాళిక బడ్జెట్‌లో నిధుల కోత విధించారు. దీంతో మావోయిస్టు ప్రాబల్య ప్రాంత రాష్ట్రాలు తమకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాల ని కేంద్ర హోంశాఖను కోరాయి. ఈ రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ఈ సారి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో నాన్  ప్లాన్ (ప్రణాళికేతర)బడ్జెట్‌ కింద నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు తెలిసింది.

సమాచారం మార్పిడి చేసుకోవాలి: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో ప్రస్తుతం మావోయిస్టుల పరిస్థితి, ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లపై బుధవారం సమావేశంలో చర్చ జరిగినట్టు తెలిసింది. మల్కన్ గిరిలో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌కు మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉండడంతో ఆ దిశలో కేంద్ర కమిటీ వ్యూహాలపై అన్ని రాష్ట్రాలు నిఘావర్గాల సమాచారాన్ని మార్పిడి చేసుకోవాలని హోంశాఖ సూచించినట్లు తెలిసింది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత మావోయిస్టు పార్టీ నగదు మార్పిడి వ్యవహారంపై కూడా కీలక చర్చ జరిగినట్టు సమాచారం. బీడీ కాంట్రాక్టర్ల ద్వారా మావోయిస్టు పార్టీ నగదు మార్పిడి చేసిందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మావోయిస్టు ప్రభా విత ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలని, ఆయా ప్రాంతాల్లో పర్య టించే రాజకీయ నాయకులకు బందోబస్తు పెంచాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.

మరిన్ని వార్తలు