ప్రస్తుతానికి సేఫ్‌..!?

8 Apr, 2020 13:22 IST|Sakshi
పరకాలలోని ఐసోలేషన్‌ వార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరిత

విదేశాల నుంచి వచ్చిన వారి హోం క్వారంటైన్‌ పూర్తి

ఎవరిలో కనిపించని కరోనా లక్షణాలు

ఇక ఢిల్లీ నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి

సాక్షి, వరంగల్‌ రూరల్‌:వివిధ దేశాల నుంచి రూరల్‌ జిల్లాకు వచ్చిన పలువురి క్వారంటైన్‌ పూర్తి కావడం, వారిలో ఎవరికీ కరోనా వైరస్‌(కోవిడ్‌ –19) లక్షణాలు లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసులు నమోదు కాలేదు. జిల్లా ప్రస్తుతానికి సేఫ్‌ జోన్‌లో ఉంది. ప్రజలంతా లాక్‌డౌన్‌ను పకడ్బందీగా పాటిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తే జిల్లాను కరోనా రక్కసి నుంచి కాపాడుకోవడం సులువేనంటున్నారు.. అధికారులు.

99 మంది క్వారంటైన్‌ పూర్తి
ఇతర దేశాల నుంచి జిల్లాకు మార్చి 1 నుంచి 100 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 1,471 మంది జిల్లాకు వచ్చారు. వీరందరి క్వారంటైన్‌ పూర్తి అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఒక్కరు నర్సంపేట బిట్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్నారు. హోం క్వారంటైన్‌ గడువు అందరిదీ పూర్తి అయింది. అయితే హోం క్వారంటైన్‌ పూర్తయిన వారు మరో 28 రోజుల పాటు బయటకు రావొద్దని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఐదుగురికి కరోనా టెస్ట్‌లు
ఢిల్లీ నుంచి వచ్చిన నలుగురి నమూనాలను టెస్ట్‌లకు హైదారాబాద్‌ ల్యాబ్‌కు పంపించగా నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. ఢిల్లీ నుంచే వచ్చిన మరొకరి నమూనాలను  టెస్ట్‌ కోసం ఈ నెల 6వ తేదీన ల్యాబ్‌కు పంపించగా.. ఇంకా రిపోర్టు రాలేదని అధికారులు తెలిపారు. పాజిటివ్‌ వస్తే ఆ వ్యక్తి ఎవరెవరిని కలిశారనే విషయాలను ఆరాతీయడంతోపాటు ఆ వ్యక్తి ఇంటి చుట్టు ప్రక్కల వారిని పరీక్షించనున్నారు. 

జిల్లాలో 500 బెడ్ల క్వారంటైన్‌ సెంటర్లు
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో క్వారంటైన్, ఐసోలేషన్‌ వార్డులను ముందస్తుగానే సిద్ధం చేశారు. జిల్లాలో నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట పట్టణాల్లో  క్వారంటైన్‌ సెంటర్లలో 500 బెడ్‌లు, 21 ఐసోలేషన్‌ బెడ్‌లను అందుబాటులో ఉంచారు. వీటిలో 38 మంది వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. మంగళవారం కలెక్టర్‌ హరిత పరకాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులను పరిశీలించి, అధికారులతో ఏర్పాట్ల పై సమీక్షించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు