అంతర్జాతీయ ప్రయాణికులకు హోం క్వారంటైన్‌ ముద్రలు

22 Mar, 2020 02:26 IST|Sakshi

శంషాబాద్‌: అంతర్జాతీయ ప్రయాణికులకు హోం క్వారంటైన్‌ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు శనివారం సాయంత్రం వివిధ దేశాల నుంచి వచ్చిన పలువురు ప్రయాణికులకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హోం క్వారంటైన్‌ ముద్రలు వేశారు. ఈనెల 31న హోం క్వారంటైన్‌ చేయాల్సిందిగా ఆ ముద్రల్లో రాసి ఉంది. ఈ సమయంలో కోవిడ్‌ అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలో ప్రభుత్వాసుపత్రికి వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. 

క్వారంటైన్‌ గదుల్లో సౌకర్యాల లేమిపై స్పందించిన హైకోర్టు 
విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచే గదుల్లో తగిన సౌకర్యాలు ఉండటం లేదంటూ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై హైకోర్టు స్పందించింది. ఈ కథనాలను సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)గా పరిగణించింది. ఒకే గదిలో ఇద్దరు, ముగ్గురిని ఉంచుతున్నారని, ఆ గదుల్లో ఏ మాత్రం పరిశుభ్రత లేకపోవడం, దోమలు, నల్లులు ఉంటున్నట్లు ఆ కథనాల్లో వచ్చిందని ఆ పిల్‌లో పేర్కొంది. మరుగుదొడ్లలో కనీసం నీటి వసతి కూడా లేని విషయాన్ని ప్రస్తావించింది. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తదితరులను ప్రతివాదులుగా పేర్కొంది. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది.  

పురపాలికల్లో క్వారంటైన్‌ కేంద్రాలు 
కోవిడ్‌–19 వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచన మేరకు రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో క్వారంటైన్‌ కేంద్రాలు, తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాటుకు అవసరమైన భవనాలను గుర్తించాలని మున్సిపల్‌ కమిషనర్లకు పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు. అన్ని పురపాలికల్లో పారిశుద్ధ్యాన్ని కాపాడాలని సూచించారు. కోవిడ్‌–19 వ్యాప్తి, నివారణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పురపాలికల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు.  

ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల నియంత్రణ 
ఏసీ ద్వారా కోవిడ్‌–19 వ్యాప్తి చెందే అవకాశాలుండటంతో పురపాలక శాఖ పరిధిలోని అన్ని ప్రభుత్వ విభాగాల కార్యాలయాల్లో ఏసీల వినియోగంపై నియంత్రణ పాటించాలని పురపాలక శాఖ కార్యదర్శి సి.సుదర్శన్‌ రెడ్డి ఆదేశించారు. అవసరమైనప్పుడు మాత్రమే ఏసీలు వాడాలని, వెలుతురు వచ్చేలా కార్యాలయాల కిటికీలు తెరిచి ఉంచాలని సూచించారు.

మరిన్ని వార్తలు