నచ్చిన చదువు.. మెచ్చిన పేరెంట్స్‌

20 Feb, 2019 09:22 IST|Sakshi

నగరంలో నయా ట్రెండ్‌ హోమ్‌ స్కూలింగ్‌  

పిల్లలు నచ్చినది చదువుకునే వెసులుబాటు  

స్కూల్‌ కంటే హోమ్‌ స్కూలింగ్‌నే నయమంటున్న తల్లిదండ్రులు  

పిల్లలపై మానసిక ఒత్తిడి, అనారోగ్యకర పోటీ ఉండదనే భావన  

హోమ్‌ స్కూలింగ్‌తో పిల్లల్లో వికాసం ఉండదంటున్న నిపుణులు  

సాక్షి, సిటీబ్యూరో: హోమ్‌ స్కూలింగ్‌... ఇప్పుడు హైదరాబాద్‌లో నయాట్రెండ్‌. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లకుండా పరీక్షలు రాయకుండా వెసులుబాటు కల్పించే చదువు. ఒక తరగతి నుంచి మరో తరగతికి వెళ్లాల్సిన పనిలేదు. పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. పాఠ్యాంశాలతో పని లేదు. నచ్చిన పుస్తకాలు చదువుకోవచ్చు. కళలు, సాహిత్యం, ఆటలు, పాటలు తదితర అభిరుచుల్లో పిల్లలకు తమకు ఇష్టమైనది ఎంపిక చేసుకోవచ్చు. జ్ఞాన సముపార్జన కోసం బడికి వెళ్లడమే ప్రామాణికమైతే అపారమైన జ్ఞానాన్ని ఇంటి నుంచే  పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ఈ నయాట్రెండ్‌ ముందుకొస్తోంది. ఆ మాటకొస్తే ఇది పూర్తిగా సరికొత్త భావన కూడా కాదు. రాజులు, జమీందార్లు తమ పిల్లలకు ఇంటి వద్దే చదువులు చెప్పించారు. సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు పిల్లలకు ఇంటి చదువులే చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఈ హోమ్‌ స్కూలింగ్‌ భావన మధ్యతరగతి వర్గాలను అమితంగా ఆకట్టుకుంటోంది. ఒత్తిళ్లు, పోటీ పరీక్షలు, నచ్చిన సబ్జెక్టుల్లో మాత్రమే చదువుకునే ఒక గొప్ప అవకాశంగా కొంతమంది పేరెంట్స్‌ భావిస్తున్నారు. ఇది నాణేనికి ఒకవైపు అయితే... మరోవైపు ‘హోమ్‌ స్కూలింగ్‌’ అనే భావన పూర్తిగా అశాస్త్రీయమైందని, పిల్లల మానసిక, శారీరక వికాసానికి అతి పెద్ద ఆటంకమని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

నచ్చిందే చదువుకోవచ్చు...  
మాదాపూర్‌లోని ఒక ప్రముఖ సంస్థలో మార్కెటింగ్‌ రంగంలో పనిచేస్తున్న శ్రీకాంత్‌ నాలుగేళ్ల క్రితం తన ఇద్దరు కూతుళ్లను షేక్‌పేట్‌లోని ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్లో చేర్పించాడు. మార్కుల వెంట పరుగులు పెట్టించే ఆ స్కూల్లో పిల్లలు తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు భావించాడు. అది పిల్లలనే కాకుండా తమను కూడా ప్రభావితం చేసిందని గుర్తించాడు. పిల్లల ఎదుగుదలకు దోహదం చేసే సృజనాత్మకమైన ఆటపాటలు లేకపోవడం, 24గంటలు చదువు, హోమ్‌వర్క్‌ తప్ప మరో ధ్యాస లేకపోవడంతో పిల్లల మానసిక వికాసం దెబ్బతింటోందని తెలుసుకున్నాడు. వెంటనే ఆ స్కూల్‌ నుంచి మాన్పించాడు. ఇప్పుడు ఆ పిల్లలు ఇంటి వద్దే చదువుకుంటున్నారు. అమ్మానాన్నలే వాళ్లకు గురువులు. ఒక్క శ్రీకాంత్‌ దంపతులే కాదు. చాలామంది తల్లిదండ్రులు హోమ్‌ స్కూలింగ్‌ను ఉత్తమ పేరెంటింగ్‌గా భావిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ నిపుణులు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారులు తదితర వర్గాల్లో ఈ ట్రెండ్‌ కనిపిస్తోంది.

‘8గంటల పాటు పిల్లలను బడిలో బంధించడం వల్ల వాళ్ల స్వేచ్ఛను హరించడం మినహా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. పైగా ఏదో ఒక రకమైన సిలబస్‌కు మాత్రమే పరిమితం కావడంతో మిగతా సిలబస్‌లోని మంచి అంశాలను కోల్పోతున్నారు. హోమ్‌ స్కూల్‌లో సీబీఎస్‌ఈ, ఎస్సెస్సీ, ఐఈజీ, కేంబ్రిడ్జి వంటి వివిధ రకాల సిలబస్‌ల నుంచి నచ్చిన పాఠ్యాంశాలపై పిల్లలను  చదివంచవచ్చున’ని చెప్పారు బంజారాహిల్స్‌కు చెందిన మరో హోమ్‌ స్కూలింగ్‌ పేరెంట్స్‌. పిల్లలకు ఏది కావాలో అది స్కూళ్లలో లభించడం లేదని హోమ్‌ స్కూలింగ్‌ పేరెంట్స్‌ భావిస్తున్నారు. గణితం, సైన్స్, ఇంగ్లిష్‌ వంటి నాలుగైదు సబ్జెక్టుల్లోనే బోధిస్తున్నారని, ఓపెన్‌ స్కూలింగ్‌ విధానంలో 40 సబ్జెక్టులు ఉంటాయని, వాటిలో నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చని చెబుతున్నారు. గణితంలో ప్రావీణ్యం లేని పిల్లలు ఫుట్‌బాల్‌లోనో, పెయింటింగ్‌ లేదా మరో ఆర్ట్‌లోనో గొప్పవాళ్లు కావచ్చు. ఒత్తిడితో కూడిన చదువుల వల్ల కెరీర్‌ ఎంపికలో గందరగోళం ఏర్పడుతుందంటున్నారు. మరోవైపు ఇలాంటి పేరెంట్స్‌ చరిత్ర అధ్యయనాన్ని సైతం  తిరస్కరిస్తున్నారు. సిలబస్‌లు, ఒత్తిడి మాత్రమే కాకుండా భారీగా వసూలు చేసే ఫీజులు కూడా కొంతమంది తల్లిదండ్రులను హోమ్‌ స్కూలింగ్‌ విధానం వైపు ప్రోత్సహిస్తున్నాయి. 

ప్రకృతితో మమేకం...
మరోవైపు డీ స్కూలింగ్‌ అనే మరో సరికొత్త భావన కూడా ముందుకొస్తోంది. పిల్లలు తెలుసుకోవాల్సిన అంశాలను ప్రత్యక్షంగా పరిచయం చేయడం, అడవులు, నదులు, పర్వతాలు, ప్రకృతిలోనే అనేక అంశాలను వారికి పరిచయం చేయడం ద్వారా చాలా విషయాలు తెలుస్తాయని అభిప్రాయపడుతున్నారు. పల్లెలు, అక్కడి జీవన పద్ధతులు, వ్యవసాయం, తోటల పెంపకం, అర్బన్‌ ఫార్మింగ్‌ తదితర అంశాలను  జోడిస్తున్నారు. ఆటాపాటల్లో నచ్చిన వాటిని ఎంపిక చేసి శిక్షణనిప్పిస్తున్నారు. హోమ్‌ స్కూలింగ్‌ పేరెంట్స్‌కి ఎలాంటి అసోసియేషన్‌లు లేవు. కానీ ప్రతిఏటా దేశంలోని ఏదో ఒక నగరంలో హోమ్‌స్కూల్‌ పేరెంట్స్, పిల్లల సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారం క్రితం నగరంలోని కీసరలో ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. హైదరాబాద్‌తో పాటు బెంగళూర్, చెన్నై, ముంబై, త్రివేండ్రం, గోవా, ఢిల్లీ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 350 మందికి పైగా పేరెంట్స్, వారి పిల్లలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పిల్లలకు చదువు చెప్పేందుకు తాము అనుసరిస్తున్న పద్ధతులు, కరిక్యులమ్‌ ఎంపిక, సృజనాత్మకమైన కార్యక్రమాలు తదితర అంశాలపై ఈ ఐదు రోజుల సమావేశాల్లో విస్తృతంగా చర్చించారు.  

ఇది పెద్ద తప్పిదం  
స్కూల్‌ ఫోబియో ఉన్నవాళ్లకు మాత్రమే హోమ్‌ స్కూలింగ్‌ విధానం వర్తిస్తుంది. కానీ అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్న పిల్లల వికాసానికి బడిని మించిన ఆశ్రయం మరొకటి లేదు. హోమ్‌ స్కూల్‌ పిల్లలను మానసిక దుర్భరులుగా మార్చేస్తుంది. స్కూళ్లలో ఒత్తిడి, మార్కుల కోసం పోటీ ఉండవచ్చు. దానిని  తగ్గించుకునేందుకు మార్గాలను ఆలోచించాలి. కానీ దానికి ప్రత్యామ్నాయం ఇల్లు మాత్రం కాదు. పిల్లలకు సొంత కమ్యూనిటీ ఉండాలి. తమలాంటి ఇతర పిల్లలతో కలిసిపోవాలి. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకోవాలి. పరిపూర్ణమైన వ్యక్తులుగా ఎదిగేందుకు బడి, సమాజం ప్రాణాధారమైనటువంటివి. హోమ్‌ స్కూలింగ్‌ విధానం చాలా పెద్ద తప్పిదం.  – డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి,మానసిక నిపుణులు 

మరిన్ని వార్తలు