‘గే’ల గోస... వినేదెవరు?

18 Jun, 2018 09:26 IST|Sakshi
లామకాన్‌లో సమావేశమైన  ఎల్‌జీబీటీ సభ్యులు 

సాక్షి,హైదరాబాద్‌ : సమాజంలో తమను కూడా మనుషులుగా గుర్తించాలని తమ హక్కులను కూడా కాపాడాలని పలువురు స్వలింగ సంపర్కులు డిమాండ్‌ చేశారు. ప్రపంచంలో ప్రతి ఏడాది జూన్‌లో స్వలింగ సంపర్కుల హక్కుల పోరాట మాసాన్ని నిర్వహిస్తుంటారు.

ఆదివారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో లెస్బియన్లు, ట్రాన్స్‌జెండర్లు, గే లు, బై సెక్సువల్‌(ఎల్‌జీబీటీ) సమావేశమయ్యారు. ప్రైడ్‌ ఫెస్టివల్‌ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర నలుమూలల నుంచి వచ్చిన 200 మంది ఎల్‌జీబీటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ హక్కులను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా తమ కుటుంబంలోనే తమను వెలివేస్తున్నారంటూ వీరు ఆవేదన వ్యక్తం చేశారు.

కాలేజీల్లో తమను సూటిపోటి మాటలతో వేదిస్తున్నారని ఓ యువకుడు ఆరోపించాడు. తాను ‘గే’ నని తెలుసుకొని తన తల్లి వారం రోజులు అన్నం పెట్టకుండా మాడ్చారని,  ఓ రూమ్‌లో వేసి బంధించారని ఇదెక్కడి అన్యాయమని ఇంకో యువకుడు ఆందోళన చెందాడు.

తనలో వచ్చిన మార్పులను గమనించి తన తండ్రి తీవ్రంగా కొట్టి ఇంట్లో నుంచి తరిమేశాడని, ఏం పాపం చేశానని తాను ఇప్పుడు రోడ్డునపడాల్సి వచ్చిందని ఆరోపించారు. ఇలా ఒక్కొక్కరు తమ సమస్యలపై గొంతు విప్పారు. తమకు కూడా గుర్తింపు కావాలని వీరంతా డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు