రైతు సమితులకు గౌరవ వేతనం 

2 Jan, 2019 01:59 IST|Sakshi

రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో వేతనాలిచ్చే యోచన 

1.60 లక్షల మంది సభ్యులకు ఏడాదికి రూ. 200 కోట్ల వరకు ఖర్చు 

సీఎం ఆదేశాలకు అనుగుణంగా మార్గదర్శకాలపై కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌ : రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ వేతనంపై రాష్ట్ర వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల సందర్భంగా సభ్యులకు వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ విషయంపై అధికారులు దృష్టిసారించారు. వారికి వేతనం, విధులు వంటి వాటిపై విస్తృతస్థాయిలో మార్గదర్శకాలు తయారు చేయాలని యోచిస్తున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు దక్కేలా చూడటం, మార్కెట్‌లో సమస్యలు రాకుండా రైతులను సమన్వయపరచడం, రైతుబంధు, బీమా అమలు తదితర అంశాల్లో సమితులే కీలక పాత్ర వహించాలని సర్కారు స్పష్టంచేసింది. రైతులకు అమలు చేసే ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమితులకు విస్తృతమైన అధికారాలు కల్పించేలా కొత్త మార్గదర్శకాలు ఖరారు చేసే అవకాశముందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో పంట కాలనీల ఏర్పాటులోనూ, ఆహారశుద్ధి పరిశ్రమలను నెలకొల్పడంలోనూ రైతు సమన్వయ సమితి సభ్యులను భాగస్వాములను చేసే అవకాశముంది.  

వెయ్యి నుంచి రూ.ఐదు వేల వరకు వేతనం... 
రైతులను సంఘటిత పరచి వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో సమితులను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో మొత్తం 1.61 లక్షల మంది సమితి సభ్యులున్నారు. గ్రామస్థాయిలో 15 మంది, మండల, జిల్లా స్థాయిల్లో 24 మంది సభ్యుల వంతున సమితులు ఏర్పడ్డాయి. రాష్ట్రస్థాయిలో 42 మందితో ఏర్పాటు చేయాల్సి ఉంది. గతేడాది రైతుబంధు, రైతుబీమా అమలులో రైతు సమితి సభ్యులు కీలకపాత్ర పోషించారు. ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిగా వ్యవహరించారు. వారికి ఎటువంటి గౌరవ వేతనం ఇవ్వడంలేదు. దీంతో ఈ ఏడాది నుంచి వారికి వేతనం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే ఆర్థిక ఏడాది నుంచి వేతనాలిచ్చే అవకాశమున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఎంతివ్వాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

గ్రామ సమితి సభ్యులకు రూ.వెయ్యి, సమన్వయకర్తకు రూ.1,500 ఇస్తే ఎలా ఉంటుందని చర్చిస్తున్నారు. ఇక మండల సమితి సభ్యునికి రూ. 1,500, సమన్వయకర్తకు రూ. 2 వేలుపై కసరత్తు చేస్తున్నారు. ఇక జిల్లా సమన్వయ సమితి సభ్యునికి రూ. 2,500, జిల్లా సమన్వయకర్తకు రూ. 5 వేలుపై చర్చిస్తున్నారు. రాష్ట్రస్థాయి సభ్యునికి రూ. 5 వేలు, చైర్మన్‌కు క్యాబినెట్‌ హోదా ఇస్తున్నందున ఆ మేరకు జీతభత్యాలుంటాయి. ప్రభుత్వ పెద్దలతో వీటిపై చర్చించాల్సి ఉందని అధికారులు అంటున్నారు. వారికి గౌరవ వేతనాలు ఇవ్వాలంటే ఏడాదికి రూ. 200 కోట్లు ఖర్చయ్యే అవకాశముంది. అలాగే మండల, జిల్లా సమన్వయకర్తలకు కార్యాలయాలు కేటాయించే ఆలోచనా ఉంది. జిల్లా సమన్వయకర్తకు వాహన సౌకర్యం కల్పించనున్నట్లు సమాచారం.  

రాష్ట్ర రైతు సమితిలో వ్యవసాయ నిపుణులు... 
రాష్ట్ర రైతు సమితిని సర్కారు ఇప్పటికీ నియమించలేదు. 42 మందితో కూడిన రాష్ట్ర సమితిలో కొందరు వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలను నియమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రైతు సమితిలో సలహాలు సూచనలు ఇచ్చే వ్యవసాయ నిపుణులు, మేధావులు అవసరమనేది సర్కారు యోచన. అందువల్ల రాష్ట్ర సమితిలో జాతీయస్థాయి వ్యవసాయ నిపుణులను నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రస్థాయిలో ఉన్న వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ఇక రాష్ట్రరైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌ హోదా కలిగి ఉంది. దానికి రూ. 500 కోట్ల నిధిని కేటాయించనున్నారు.   

మరిన్ని వార్తలు