మైనింగ్ జోన్ రద్దయ్యేనా!

25 May, 2014 23:52 IST|Sakshi

 యాచారం, న్యూస్‌లైన్: తెలంగాణలో టీఆర్‌ఎస్ విజయం సాధించడంతో యాచారం, నందివనపర్తి గ్రామాల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మండల పరిధిలోని ఈ రెండు గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో దాదాపు 900 ఎకరాల్లో ైమైనింగ్ జోన్ ఏర్పాటుకు నిర్ణయించారు. అయితే స్థానిక రైతులు మాత్రం జోన్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యాపారులతో కుమ్మక్కైన అధికారులు.. ఆ భూముల్లో సాగు సాగడంలేదని తప్పుడు రికార్డులు సృష్టించి మైనింగ్ జోన్ ఏర్పాటుకు కుట్రలు చేశారని రైతులు ఆరోపిస్తూ ఆందోళనలకు దిగారు. వివిధ రాజకీయపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించి కలెక్టర్‌తోసహా ఇతర ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.

 ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డిలు కూడా పలుమార్లు జిల్లా కలెక్టర్లను కలిసి రద్దు విషయంలో తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. అయితే మైనింగ్ జోన్ రద్దుకు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. కాగా రెండేళ్ల కిందట జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి తెలంగాణ ప్రభుత్వం వస్తే మైనింగ్ జోన్ రద్దుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరగదనే ఆశతో అన్నదాతలున్నారు. ఈ రెండు గ్రామాల్లో వందలాది మంది రైతులు ఏళ్ల కొద్ది ఆ భూములను సాగుచేసుకొని జీవనోపాధి పొందుతున్నారు. ఈ మైనింగ్ జోన్‌లో అత్యధికంగా ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులే స్టోన్ క్రషర్లు, క్వారీల ఏర్పాటుకు అనుమతులు పొందారు.

 అయితే స్థానికుల ఆందోళనలకు భయపడి సదరు భూముల్లో ప్రభుత్వం స్టోన్ క్రషర్లకు, క్వారీల ఏర్పాటుకు మాత్రం అనుమతులివ్వడం లేదు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడనుండడం, తన సన్నిహితుడైనా కేసీఆరే త్వరలో రాష్ట్రానికి సీఎం కానున్నట్లు స్పష్టం కావడంతో ఈ విషయంపై కోదండరాం ప్రత్యేక దృష్టి సారించాలని మండల రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మైనింగ్ జోన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులివ్వాలని వారు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా