గ్రీన్‌హౌస్‌ బదులు నెట్‌హౌస్‌

10 Mar, 2017 03:21 IST|Sakshi

ఈ ఏడాది నుంచి దృష్టి సారించనున్న ఉద్యానశాఖ
గ్రీన్‌హౌస్‌కు రూ. 40 లక్షలైతే... నెట్‌హౌస్‌కు రూ. 17 లక్షలే


సాక్షి, హైదరాబాద్‌: గ్రీన్‌హౌస్‌ బదులు నెట్‌హౌస్‌ను ప్రోత్సహించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. గ్రీన్‌హౌస్‌ నిర్మాణానికి ఎకరాకు రూ.40లక్షల వరకు ఖర్చు అవుతుంటే... నెట్‌హౌస్‌ నిర్మాణానికి రూ. 17 లక్షలు కానుంది. పైగా నిర్వహణ భారం తక్కువగా ఉండటం, పంటల దిగుబడి గ్రీన్‌హౌస్‌తో సమానంగా ఉండటంతో నెట్‌ హౌస్‌ వైపు వెళ్లడమే ఉత్తమమని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి గ్రీన్‌హౌస్‌ తోపాటు నెట్‌హౌస్‌నూ ఎక్కువగా ప్రోత్స హించాలని.. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అందువల్ల వచ్చే బడ్జెట్‌లో గ్రీన్‌హౌస్‌తోపాటు నెట్‌హౌస్‌కూ నిధులు కేటాయించాలని ఆ శాఖ ప్రభు త్వాన్ని కోరింది. రెండింటికీ కలిపి రూ. 300 కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖను కోరినట్లు తెలిసింది.

ధనిక రైతులకే గ్రీన్‌హౌస్‌..?
గ్రీన్‌హౌస్‌కు బడ్జెట్‌లో ప్రభుత్వం అధికంగానే నిధులు కేటాయిస్తోంది. 2016–17 బడ్జెట్‌లో రూ.200కోట్లు కేటాయించింది. 800 ఎకరా ల్లో సాగు చేయాలన్నది లక్ష్యం. గ్రీన్‌హౌస్‌ సాగుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం ఏకంగా 75 శాతం సబ్సిడీ ఇస్తోంది. దేశంలో ఇంత భారీ సబ్సిడీ ఇచ్చే రాష్ట్రం మరోటి లేదు. గ్రీన్‌హౌస్‌కు ఎకరానికి రూ. 40 లక్షల వరకు ఖర్చు అవుతుండగా... అందులో రైతు తన వాటాగా రూ. 10 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. మూడు ఎకరాల వరకు సబ్సిడీ ఇస్తుండటంతో అందుకోసం రైతు రూ. 30 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఇది ధనిక రైతులకే ఉపయోగపడుతోంది.

ఒకవైపు కంపెనీలకు, మరోవైపు పేద, మధ్యతరగతి రైతులకు భారంగా మారుతున్న గ్రీన్‌హౌస్‌ బదులు నెట్‌హౌస్‌ను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక ఎకరా నెట్‌హౌస్‌ నిర్మాణానికి రూ.14 లక్షలు, సాగునీటి వ్యవస్థల ఏర్పాటుకు రూ.1.60 లక్షలు, సాగు ఖర్చు రూ. 2 లక్షలు కలిపి రూ. 17.60 లక్షలు ఖర్చు అవుతుందని ఉద్యానశాఖ అంచనా వేసింది. అందులో ప్రభుత్వం రూ. 13.20 లక్షలు సబ్సిడీ ఇవ్వనుంది. రైతు తన వాటా గా రూ. 4.40 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటికే హైదరాబాద్‌ జీడిమెట్లలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలో నెట్‌హౌస్‌లను ఏర్పాటు చేశారు.

నెట్‌హౌస్‌తో లాభాలేంటంటే...
∙తక్కువ ఖర్చుతో నెట్‌హౌస్‌ను నిర్మించు కోవచ్చు. ∙గ్రీన్‌హౌస్‌ నిర్మాణానికి వాడే ప్లాస్టిక్‌ షీట్‌తో సూర్యరశ్మి ద్వారా వచ్చే వేడి మొక్కలపై పడుతోంది. దీంతో ఏసీలను వాడాల్సి వస్తోంది. నెట్‌హౌస్‌కు ప్లాస్టిక్‌ షీట్‌ వేసినా రంధ్రాలు ఉండటం వల్ల గాలి లోనికి వెళ్లడంతో వేడి సాధారణంగానే ఉంటుంది. ∙నెట్‌ల వల్ల కొన్ని రకాల చీడపీడల నుంచి రక్షణ పొందొచ్చు. ∙నెట్‌హౌస్‌లో ప్లాస్టిక్‌ రంధ్రాలున్న నెట్‌ షీట్ల వల్ల 130 కిలోమీటర్ల గాలి వేగాన్ని కూడా తట్టుకోగలుగుతుంది.

మరిన్ని వార్తలు