డెంగీ డేంజర్‌ ; కిట్లకు కటకట..

22 Sep, 2019 02:24 IST|Sakshi

డెంగీ నిర్ధారణ కిట్లు సరిపడా లేకపోవడంతో రోగుల గగ్గోలు..

కనీసం 10 లక్షల మందికి అవసరం కాగా, 1.35 లక్షల మందికే కిట్లు

టెస్టులకు 2, 3రోజులు ఆగాలంటున్న వైద్యసిబ్బంది.. 

సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వ ఆసుపత్రులకు ఇదో పరీక్ష. డెంగీ రోగులకు పరీక్షలు చేయడంలో విఫలమవుతున్నాయి. రాష్ట్రంలో డెంగీ నిర్ధారణ పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. సరిపడా డెంగీ నిర్ధారణ కిట్లు లేక పాట్లుపడుతున్నాయి. రెండు, మూడు రోజులు ఆగాలని వైద్య సిబ్బంది చెబుతుండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం డెంగీపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం కిట్లు సమకూర్చకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. నివేదికలతో ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు.  

అవసరం 10 లక్షలు...అందుబాటులో 1.35 లక్షల మందికే 
వైరల్‌ జ్వరాలు విజృంభిస్తుండటం, ఒక్కోసారి 103–104 డిగ్రీల జ్వరం వస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా జనం ఆందోళన చెందుతున్నారు. వైరల్‌ జ్వరాలు, డెంగీ అనుమానిత కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. వైద్యవిధాన పరిషత్‌ పరిధిలోని 31 జిల్లా, 87 ఏరియా ఆసుపత్రులకు రోజూ లక్షలాదిమంది తరలివస్తున్నారు. పడకలు కూడా దొరకని పరిస్థితి. ఉస్మానియా, వరంగల్‌ ఎంజీఎం, హైదరాబాద్‌లోని తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌కూ రోగులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

వేలాది ప్రైవేటు ఆసుపత్రుల నుంచి కూడా డెంగీ నిర్ధారణ కోసం లక్షలాది మంది వస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షలమందికి డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉండగా, వైద్య విధానపరిషత్‌ ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో కేవలం 1.35 లక్షలమందికి మాత్రమే సరిపడా కిట్లున్నాయి. అందులో ప్రాథమిక నిర్ధారణ కోసం నిర్వహించే ర్యాపిడ్‌ టెస్టు కిట్లు 73 వేలుండగా, పూర్తిస్థాయి నిర్ధారణ కోసం నిర్వహించే ఎలీసా కిట్లు కేవలం 62 వేలమందికి సరిపోను మాత్రమే ఉన్నాయి. ఎలీసా పరీక్షల కోసం రెండు, మూడు రోజులపాటు ఆగాలని ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది చెబుతుండటంతో బాధితులు ఉస్సూరుమంటూ వెనుదిరుగుతున్నారు. 

వైద్య విధాన పరిషత్‌ యంత్రాంగం విఫలం 
వైద్య విధాన పరిషత్‌కు ఇన్‌చార్జి కమిషనర్‌గా హైదరాబాద్‌ కలెక్టర్‌ మాణిక్‌రాజ్‌ కొనసాగుతున్నారు. రెండు విధులతో ఆయన జిల్లా, ఏరియా ఆసుపత్రులపై దృష్టి సారించడంలేకపోతున్నారు. కనీసం ఆయా ఆసుపత్రుల యంత్రాంగంతో సమీక్ష నిర్వహించలేని పరిస్థితి. ఆయన కంటే కిందిస్థాయిలో ఉండే అధికారులు కూడా డెంగీ నిర్వహణ, పర్యవేక్షణలో విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి.  

ఎలీసా కిట్లు ఏడే..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాకూ అధికారులు డెంగీ నిర్ధారణ కిట్లు తక్కువగానే ఇచ్చారు. ర్యాపిడ్‌ టెస్టు కిట్లను గజ్వేల్‌ ఏరియా ఆసుపత్రికి 500, దుబ్బాక ఆసుపత్రికి 150, తూప్రాన్‌ ఆసుపత్రికి 250 మాత్రమే ఇచ్చారు. సిద్ధిపేట జిల్లా ఆసుపత్రికి కేవలం ఏడే ఎలీసా కిట్లు ఇచ్చారు. ర్యాపిడ్‌ పరీక్ష కిట్టు ద్వారా ఒక్కో యూనిట్‌ ఒక్కరికి, ఎలీసా కిట్టు ఒక్కోటి 96 మందికి పరీక్ష చేయడానికి వీలుంది. నీలోఫర్‌ ఆసుప త్రికి 70 ఎలీసా కిట్లు మాత్రమే ఇచ్చారు. అయితే, ఇక్కడికి రోజూ కనీసం 2 వేల మందికి పైగా పిల్లలు వస్తున్నారు. హైదరా బాద్‌లోని ఫీవర్‌ ఆసుపత్రికి రోజూ 2,500 మంది రోగులు వస్తుంటారు. అక్కడ కేవలం 3,936 మందికి సరిపోయే 41 ఎలీసా కిట్లు అందుబాటులో ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఆసుపత్రికి ఐదు ఎలీసా కిట్లు మాత్రమే ఉన్నాయి.

ఆలస్యానికి కారణమిదే.. 
డెంగీ పరీక్షలు నిర్వహించడంలో ఆలస్యానికి కారణం కిట్ల కొరత కాదు. అవసరమైనన్ని కిట్లు అందుబాటులో ఉంచుతున్నాం. అవసరమైనప్పుడు తెప్పిస్తున్నాం. అయితే, ఎలీసా పరీక్షకు నిర్వహించే ఒక్కో కిట్టు ధర రూ.25 వేలు. ఒక్కో కిట్టు ద్వారా 96 మందికి పరీక్షలు చేయడానికి వీలుంది. కొద్దిమంది కోసం ఒక్కసారి కిట్టు విప్పితే మిగతావారి కోసం దాన్ని దాచి ఉంచలేం. కాబట్టి 96 రక్త నమూనాలు వచ్చే వరకు ఆగుతున్నాం. 
-చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ,టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు