బెత్తం.. పాఠాలు!

12 Feb, 2019 10:41 IST|Sakshi

స్కూళ్లలో పిల్లలపై పెరుగుతున్న కార్పొరల్‌ పనిష్‌మెంట్స్‌

ఏటా  250 నుంచి 300 వరకు కేసులు నమోదు

చదువుకోవాలనే ఆసక్తిని దూరం చేస్తున్న కఠిన శిక్షలు

టీచర్లపై ఒత్తిడి, నిర్దేశిత లక్ష్యాలే కారణం

సాక్షి, సిటీబ్యూరో: కడారి వివేకానంద్‌. తొమ్మిదో తరగతి విద్యార్థి. నగర శివార్లలోని శామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్‌ రెసిడెన్షియల్‌ స్కూల్లో చదువుకుంటున్నాడు. రాత్రి  9.30 గంటల తరువాత కూడా ఆ విద్యార్థి తన హాస్టల్‌ గదిలో లైటు ఆర్పేయకపోవడంతో ఆగ్రహానికి గురైన హాస్టల్‌ వార్డెన్‌ ఆ అబ్బాయిని చితకబాదాడు. దాంతో అతడి చేయి విరిగిపోయింది.  
నేరేడ్‌మెట్‌లోని మరో ప్రైవేట్‌ పాఠశాలలో యూకేజీ చదువుతున్న యశ్వంత్‌ అనే చిన్నారిపైన   కూడా స్కూల్‌ టీచర్‌ అలాగే చేయి చేసుకోవడంతో  అతడు తీవ్రంగా గాయపడ్డాడు. బోడుప్పల్‌లోనూ  ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

ఈ ఏడాది జనవరి నుంచి  ఇప్పటి వరకు సుమారు 20 పని దినాల్లో 14 మంది చిన్నారులు ఈ తరహా కార్పొరల్‌ పనిష్‌మెంట్‌లకు గురైనట్లు స్వచ్చంద సంస్థలు వెల్లడిస్తున్నాయి. పిల్లలకు విద్యాబుద్ధులు బోధించే క్రమంలో ఉపాధ్యాయులు సహనం కోల్పోతున్నారు. శారీరకంగా శిక్షిస్తేనే చెప్పినట్లు వింటారనే అపోహ, స్కూల్‌ యాజమాన్యాల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లు వంటి కారణాల వల్ల టీచర్లు ‘బెత్తం పాఠాల’కు పాల్పడుతున్నారు. కేవలం కొట్టడమే కాకుండా అనేక రకాలుగా పిల్లలను శారీరకంగా  హింసిస్తున్నట్లు పలు స్వచ్చంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో  ఏటా  250 నుంచి 300 వరకు ఈ తరహా కార్పొరల్‌ పనిష్‌మెంట్‌ కేసులు నమోదు కావడం గమనార్హం.

మూర్తిమత్వ వికాసానికి అడ్డంకులు....
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. డిజిటల్‌ బోధనా సదుపాయాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో వైవిధ్యంగా బోధించాల్సిన టీచర్లు అందుకు విరుద్ధంగా పాతకాలం నాటి ‘బెత్తం’నే ఆశ్రయిస్తున్నారు. కొడితేనే చెప్పిన మాట వింటారనే అపోహ ఒకవైపు అయితే మరోవైపు పిల్లల వెనుకుబాటుకు టీచర్లనే బాధ్యులను చేసే యాజమాన్య వైఖరి, వాళ్ల జీతభత్యాల్లో కోత విధించడం, ఉత్తమ ఫలితాల కోసం టీచర్లపై ఒత్తిళ్లను తీవ్రతరం చేయడం వంటి అంశాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. దీంతో  పిల్లల మూర్తిమత్వ వికాసం మసకబారుతుంది. చిన్నారుల ఆలోచనల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి దెబ్బతింటుందని మనస్తత్వ నిపుణులు పేర్కొంటున్నారు. క్రమంగా చదువుకోవాలనే ఆసక్తికి దూరమవుతున్నారు. భావి జీవితంపైన ఈ అనాసక్తి దుష్ప్రభావం  చూపుతుంది. ‘కార్పొరల్‌ పనిష్‌మెంట్‌ల వల్ల చిన్నారులు అన్ని రకాల హక్కులను కోల్పోతున్నారు. ప్రత్యేకించి స్వేచ్ఛగా ఎదగాల్సిన బాల్యంపైన, విద్యాహక్కులపైన ఇది ప్రభావం చూపుతుంది.’ అని ఆందోళన వ్యక్తం చేశారు బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుతరావు. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఎదురయ్యే ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు కూడా టీచర్లు పిల్లలపై చేయి చేసుకుంటున్నారనే  ఆరోపణలు ఉన్నాయి. తరగతి గదిలో ఒక చిన్నారిని తీవ్రంగా కొట్టడం వల్ల మిగతా విద్యార్థులు భయపడి చెప్పిన మాట వింటారనే అపోహ కూడా ఉంది. కానీ దీనివల్ల పిల్లలు హాయిగా చదువుకోలేని వాతావరణం నెలకొంటోంది.  

శిక్షలు ఇలా....
పిల్లలను శిక్షించడంలో టీచర్లు అనేక రకాల పద్ధతులను పాటిస్తున్నారు.  
బెత్తంతో గట్టిగా విచక్షణ కోల్పోయి కొడుతున్నారు. దీంతో చిన్నారులు లేత శరీరం కందిపోయి తీవ్రమైన బాధను, నొప్పిని అనుభవిస్తున్నారు. కొన్ని సార్లు ఎముకలు విరుగుతున్నాయి. ఇలాంటి కేసుల్లో డాక్టర్లు సైతం విస్మయానికి గురవుతున్నారు.
పిల్లలను గంటల తరబడి ఎండలో నిల్చోబెడుతున్నారు. దీంతో పిల్లల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది.
అర్దనగ్నంగా నిల్చోబెట్టి తోటి విద్యార్థుల ముందు అవమానిస్తున్నారు.  
ఫీజులు చెల్లించలేని వారిని  వేరుగా కూర్చోబెట్టడం వల్ల తీవ్రమైన అవమానానికి గురవుతున్నారు.
ఈ విధమైన హింసకు, వివక్షకు గురికావడం వల్ల పిల్లలు మారుతారనే భావన ఉంది.  
కానీ ఇలాంటి హింసలతో వాళ్లు పూర్తిగా చదువులకు దూరమవుతున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు.తమకు ఇక చదువు రాదనే నిరాశ పిల్లల భావిజీవితాన్ని ప్రభావితం చేస్తుంది.

చట్టాలు ఏం చెబుతున్నాయి....
పిల్లలపైన ఎలాంటి హింస, వేధింపులు, వివక్షత చూపినా చట్టప్రకారం నేరమే. జువైనెల్‌ యాక్ట్‌ 1975, 1981 చట్టాల ప్రకారం న్యాయస్థానాలు  మూడున్నరేళ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉంది.  
సాధారణంగా పిల్లలు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, టీచర్ల  సంరక్షణలో, ఆధీనంలో ఉంటారు. వాళ్లు ఎక్కడ ఉన్నా స్వేచ్ఛగా ఎదిగే  పరిస్థితులు ఉండాలి.
పిల్లలకు సరైన పద్ధతిలో నేర్పించలేని ఉపాధ్యాయులే  బెత్తంను ఆశ్రయిస్తున్నట్లు స్వచ్చంద సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.

లైటు వేశాడని విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌
శామీర్‌పేట్‌: హాస్టల్‌ రూమ్‌లో లైటు వేశాడని ఓ విద్యార్థిని పాఠశాల వార్డెన్‌ చితకబాదిన సంఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కుటుంబసభ్యులు, శామీర్‌పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని మచ్చబొల్లారంకు చెందిన సతీష్‌కుమార్‌ కుమారుడు వివేకానంద శామీర్‌పేట మండలం తుర్కపల్లిలోని శాంతినికేతన్‌ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. అక్కడే పాఠశాల హాస్టల్‌లో ఉంటున్నాడు. కాగా ఈ నెల 2న రాత్రి సమయంలో హాస్టల్‌లోని తన గదిలో వివేకానంద తాళంచెవి కన్పించకపోవడంతో లైట్‌ వేసి వెతుకుతున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన హాస్టల్‌ వార్డెన్‌ రాకేష్‌ లైట్లు ఎందుకు వేశావని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రంగా కొట్టాడు. దీంతో వివేకానంద ఎడమ చేయి వాచింది. బాగా నొప్పిపెట్టడంతో స్కూల్‌ యాజమాన్యం అతడికి స్కూల్‌లోనే ప్రాథమిక చికిత్స జరిపారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో ఈ నెల 8న తండ్రికి సమాచారం ఇచ్చారు. ఫుట్‌బాల్‌ ఆడుతుండగా ఎడమచేతికి గాయం తగిలిందని, విజయ హెల్త్‌కేర్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నామని వివేకానంద తండ్రి సతీష్‌కుమార్‌కు తెలిపారు. దీంతో ఆసుపత్రికి తీసుకువెళ్లి ఎక్స్‌రే తీయగా చెయ్యి విరిగిందని వైద్యులు నిర్ధారించారు. తన కుమారుడి చెయ్యి విరగడానికి కారణమైన హాస్టల్‌ వార్డెన్‌తో పాటు శాంతినికేతన్‌ స్కూల్‌ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని బాధితుడి తండ్రి సతీష్‌కుమార్‌ శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు