వడ్డీ కాసుల భారం

8 Dec, 2017 02:58 IST|Sakshi

పేరుకుపోతున్న ‘స్వగృహ’ అప్పుల వడ్డీ

నెలకు రూ.1.4 కోట్లు చెల్లిస్తున్న ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: అవినీతి అధికారుల కక్కుర్తితో నిలువునా మునిగిన రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ ప్రభుత్వ ఖజానాకు గుదిబండగా మారింది. ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తుండటంతో రూ.కోట్ల భారం పడుతోంది.  ప్రతినెలా దీని అప్పులకే  రూ.1.4 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అయినా మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం నష్టాలను మరింత పెంచేస్తోంది. రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్రంలో భారీగా ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే.

బండ్లగూడలో 2,600 అపార్ట్‌మెంట్లు, పోచారంలో 2,200 అపార్ట్‌మెంట్లు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని  అమ్ముడుపోగా మిగతావి అలాగే ఉండిపోయాయి. ఉమ్మడి ఏపీలో దీన్ని పర్యవేక్షించిన కొందరు ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇళ్ల నిర్మాణ వస్తువుల ధరలు పెరిగాయని, కూలీ రేట్లు పెరిగాయంటూ భారీగా నిధులు నొక్కేశారు. దాదాపు రూ.150 కోట్లు కొల్లగొట్టారు. నాటి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడంతో అధికారుల ఆటలు సాగాయి. ఆ నష్టాన్ని పూడ్చే క్రమంలో ఒక్కసారిగా ఆ ఇళ్ల ధరలు విపరీతంగా పెంచారు. దీంతో జనం ఇళ్లను కొనేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా ఆ ఇళ్లు అలాగే మిగిలిపోయాయి.
 
రూ.200 కోట్ల అప్పులు..: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులపై రూ.200 కోట్ల బ్యాంకు అప్పు ఉన్నట్లు తేలింది. దీనిపై 8.5 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. అయితే ఆ ఇళ్ల ధర తగ్గించి మార్కెట్‌ ధర ప్రకారం అమ్మితే కొనుగోళ్లు పెరుగుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. వాటిని చవకగా ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇంకా తక్కువ ధరకు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి.

అంత తక్కువకు అమ్మితే భారీ నష్టం వస్తుందని అధికారులు చెప్పినా ప్రభుత్వం చవక ధరలనే ఖరారు చేసింది. అయినా కానీ ఆ ధర మరింత తగ్గించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీంతో ఎటూ తేలక పెండింగులో పడిపోయింది. ఇదంతా బాగానే ఉన్నా అప్పులపై వడ్డీ రోజు రోజుకు కొండలా పెరిగిపోతోంది. తాజాగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌ నెలలకు గాను  రూ.4.24 కోట్ల వడ్డీ విడుదల చేయాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు