మంటగలిసిన మానవత్వం

10 Aug, 2018 08:05 IST|Sakshi
నాగేశ్వరరావు (ఫైల్‌)

గుండెపోటుతో వ్యక్తి మృతి

మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వని ఇంటి యజమానులు

కుటుంబ సభ్యులను సైతం బయటికి గెంటేసిన వైనం

కర్మకాండలు చేయరాదని హుకుం

కాచిగూడ: గుండెపోటుతో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురాకుండా ఇంటి యజమాని అడ్డుకున్న సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వి.నాగేశ్వరరావు (66) తిలక్‌నగర్‌ శివాలయం సమీపంలోని ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి బుధవారం రాత్రి గుండెనొప్పి రావడంతో  కుటుంబసభ్యులు అతడిని కేర్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. నాగేశ్వర్‌రావు మృతిపై ఇంటి యజమానులకు సమాచారం అందించగా మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని వారు సూచించారు.

దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రినుంచే నేరుగా స్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులను ఇంటి యజమానులు మల్లమ్మ, మంజులు ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకోవడమేగాక, ఇంటికి తాళంవేసి బయటకు గెంటేశారు. దీంతో మృతుడు నాగేశ్వర్‌రావు భార్య, కుమారుడు, కుమార్తె, వర్షంలో తడుస్తూ బయటే కూర్చోవాల్సి వచ్చింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటి యజమానిని మందలించి వారిని ఇంట్లోకి పంపించారు. అయినా వారు ఇంట్లోకి నలుగురిని మాత్రమే అనుమతించి షరతులు విధించడం గమనార్హం. ఇంట్లో ఎలాంటి కర్మకాండలు చేయరాదని ముందే హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు