సగం జీతం.. ఇంటి అద్దెకే..!

5 Jul, 2019 07:44 IST|Sakshi

ఈ ఏడాది హైదరాబాద్‌లో అత్యధికంగా 8 శాతం వృద్ధి

హైటెక్‌ సిటీలో అత్యధికం... అత్యల్పం ఓల్డ్‌సిటీలో...

బెంగుళూరు, అహ్మదాబాద్‌లో 7 శాతం వృద్ధి

పలు సంస్థల అధ్యయనాల్లో వెలుగు చూస్తున్న వాస్తవాలు

సాక్షి, సిటీబ్యూరో: అంబర్‌పేట్‌లో స్నేహితులతో షేరింగ్‌ రూమ్‌లో ఉంటున్న మహేశ్‌ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు రూ. 20,000ల జీతం. ఇటీవలే పెళ్లి అయ్యింది. అంతకుముందు స్నేహితులతో కలిసి అంబర్‌పేట్‌ నుంచి బేగంపేట్‌లో ఉన్న తన ఆఫీస్‌కు వచ్చేవాడు. పెళ్లి కావడంతో ఇల్లు మారాల్సి వచ్చింది. బేగంపేట్‌లో ఇల్లు అద్దెకు తీసుకుందామని నిశ్చయించుకుని వెతకడం మొదలుపెట్టాడు. తీరా అక్కడి అద్దెలు చూసి ఆశ్చర్యపోయాడు. నెలకు రూ. 12,000 అద్దె కడితే కానీ అన్ని వసతులతో సింగల్‌ బేడ్‌ రూమ్‌ ఇల్లు లభించడంలేదు.

ఖమ్మం ట్రాన్స్‌పోర్టు కంపెనీలో విధులు నిర్వహిస్తున్న షేక్‌ ఇమామ్‌ ఇటీవల నగరంలోని దివాన్‌దేవిడిలోని ట్రాన్స్‌పోర్టు కంపెనీకి ట్రాన్స్‌ఫర్‌ అయింది. అతని వేతనం 16,000. ఉద్యోగం ఉన్న చోటే ఇల్లు తీసుకుందామని పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల అద్దె కోసం వెతికాడు. సర్వసాధారణంగా ఇళ్ల అద్దెలు పాతబస్తీకి తక్కువగా ఉంటాయాని ఉండాలనుకున్నాడు. కానీ సింగల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు అన్ని సౌకార్యలతో రూ. 8500 కంటే తక్కువ లేదు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన రవితేజకు ఇటీవలే హైటెక్‌ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఫ్రెషర్‌ అవడంతో శిక్షణలో నెలకు రూ. 25,000 జీతం వస్తోంది. అప్పటి వరకు అమీర్‌పేట్‌లో సాఫ్ట్‌వేర్‌ శిక్షణ తీసుకున్నాడు. తొందరగా ఉద్యోగం రావడంలో సమయానికి ఆఫీసు వెళ్లాలని క్రమశిక్షణ పాటించాలని ఇల్లు హైటెక్‌ సిటీ ప్రాంతంలో తీసుకుందామనుకున్నాడు. తీరా అక్కడికి వెళ్లి గది అద్దెకు తీసుకుందామంటే అద్దెను చూసి విస్తుపోయాడు. రూ. 13,000 నుంచి రూ. 15,000కు మించి పెడితేనే సౌకర్యవంతమైన గది దొరికే పరిస్థితి ఉందక్కడ. వచ్చిన జీతంలో సగం గది అద్దెకే వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదీ.. నగరంలోని అద్దెల పరిస్థితి. ఏటా నగరంలో అద్దెలు పెరిగిపోతున్నాయ్‌. దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లోని పలు ప్రాంతా ల్లో అద్దెలు ఎక్కువగా పెరిగాయని పలు సంస్థల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నగరంలోని బేగంపేట్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, హై టెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో అద్దెలు ఏటా పెరుగున్నాయే తప్ప తగ్గడం లేదు. 2019 జూన్‌ నాటికి అద్దెల్లో 8 శాతం వృద్ధి ఏర్పడిందని సంస్థలు తమ సర్వేల్లో పేర్కొంటున్నాయి. మొత్తం 15 నగరాల్లో అధ్యయనం చేయగా అత్యధిక అద్దెలు ఉన్న నగరాలుగా కోల్‌కతా, బెంగుళూరు, అహ్మదాబాద్‌ 6.5 శాతంగా ఉండగా, 8 శాతం వృద్ధితో హైదరబాద్‌ నగరం నిలిచింది.

నగరం ఒక్కటే ఇళ్ల అద్దెలు 60 శాతం వ్యత్యాసం
నగరం ఒక్కటైనా ఇళ్ల అద్దెల వ్యత్యాసం ఓల్డ్‌సిటీకి హైటెక్‌ సిటీ 60 శాతం తేడా ఉంది. 900 చగదరపు గజాల ఇళ్లు ఓల్డ్‌సిటీలో రూ. 8,000 ఉండగా అదే ఇల్లు హైలెక్‌ సిటీలో రూ. 20 వేల వరకు ఉంది. నగరంలో గడచిన మూడేళ్లలో ఓల్డ్‌ సిటీలోనూ ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరగాయి. హైటెక్‌ సిటీతో పోలస్తే ఓల్డ్‌ సిటీలో తక్కువగా అద్దెలు పెరగాయని పలు సంస్థలు సర్వేల్లో
వెల్లడైంది.

అద్దెల వివరాలివీ
బేగంపేటలో అద్దెను పరిశీలిస్తే ఒక పడకగది ఉన్న ఇల్లు 600 చదరపు అడుగుల నుంచి 900 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటే రూ. 7500 నుంచి రూ. 16,000 వరకు ఉంది. సికింద్రాబాద్‌లో పరిశీలిస్తే రూ. 7,000 నుంచి రూ. 13,000 వరకు ఉంది. కొండాపూర్‌లో రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు ఉంది. హైటెక్‌సిటీలోనూ ఇదే పరిస్థితి. నెలకు రూ. 10,000 నుంచి రూ. 13,500 వరకు అద్దెలు ఉన్నాయి. 

కొత్తగా ఇల్లు కట్టేవారికి వరం
గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లో కొత్తగా ఇల్లు నిర్మించేవారు సైతం అద్దెలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణం రెండు లేదా మూడు సంవత్సరాల్లో తీర్చేలా ముందు జాగ్రత్తలు తీసు కుంటున్నారు. తమ కుటుంబం కోసం ఒక అం తస్తు, అద్దెల కోసం మరో రెండస్తుల చొప్పున ప్రణాళిక వేసి అందుకు అవసరమయ్యే సొమ్మును బ్యాంకులో రుణంగా పొందుతున్నారు. ఇదిలా ఉంటే అద్దెలు చెల్లించేవారు వచ్చే నెల జీతంలో సగం అద్దెకే చెల్లించాల్సి వస్తోందని, పొదుపు సంగతి ఏనాడో మర్చిపోయామని చిరుద్యోగులు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు