యుద్ధానికి సిద్ధమెలా?

27 Mar, 2020 04:01 IST|Sakshi

కరోనా వైరస్‌ పేరు చెప్పగానే మనమంతా వణికి పోతున్నాం గానీ.. ఇవి మనకు కొత్తేమీ కాదు. యుగాలుగా మనపై దాడి చేస్తూనే ఉన్నాయి.. ప్రతి దాడితో మనిషి మరింత బలపడ్డాడు. కొత్త వాటిని అడ్డుకునే శక్తి సంపాదించుకున్నాడు అంతా మన శరీరంలోని అత్యంత సంక్లిష్టమైన రోగ నిరోధక వ్యవస్థ ఫలితం! ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఏం చేస్తే బలహీన పడుతుంది? మరింత బలం పుంజుకోవడం ఎలా? 

యుద్ధంలో మాదిరిగానే ఈ రోగ నిరోధక వ్యవస్థలోనూ.. చతురంగ బలాలు ఉంటాయి. సూక్ష్మజీవుల ఎత్తులకు పైఎత్తులేయడం.. అస్త్రశస్త్రాలతో వాటిని చిత్తు చేయడం.. నిత్యం జరిగేవే. వేగులు, సైనికులు, సమాచారం సేకరించే వారు.. బోలెడన్ని ఆయుధ కర్మాగారా లు ఈ వ్యవస్థలో భాగాలే. కణాలు, కణజాలాలు, శోషరస గ్రంథులు (లింఫ్‌నోడ్స్‌), అవయవాలతో కూడి ఉంటుంది ఈ వ్యవస్థ. సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశిస్తే వాటిని నాశనం చేయడం, లోపలికి చొరబడ్డ శత్రువు వివరాలను నిక్షిప్తం చేసుకుని భవిష్యత్తులో మళ్లీ అదే శత్రువు వస్తే అడ్డుకోవడం, క్రిములను చంపేయడం, సమాచారం ఒక చోటి నుంచి ఇంకోచోటికి చేరవేయడం వంటి సుమారు 12 పనులను ఈ వ్యవస్థ చేస్తుంది. ఈ పనులన్నీ చేసేందుకు  సుమారు 21 రకాల కణాలు అందుబాటులో ఉంటాయి. 

ఎలా పనిచేస్తుంది? 
ఉదాహరణకు శరీరంపై ఏదైనా గాటు పడితే.. ఆ వెంటనే దాని గుండా బ్యాక్టీరియా వంటివి లోపలికి ప్రవేశించి బాగా పెరుగుతాయి. వీటిని అడ్డుకునేందుకు సరిహద్దులో గస్తీ సైనికుల మాదిరిగా మాక్రోఫేగస్‌ కణాలు రంగంలోకి దిగుతాయి. కొంచెం పెద్ద సైజు (21 మైక్రోమీటర్లు) ఉండే ఈ మాక్రోఫేగస్‌ ఒక్కొక్కటి వంద వరకు బ్యాక్టీరియాలను మింగేసి ఎంజైమ్‌ల సాయంతో నాశనం చేస్తాయి. మంట/వాపు కలిగించడం ద్వారా నీళ్ల లాంటి ద్రవం విడుదల చేయాల్సిందిగా రక్త కణాలకు సమాచారం పంపుతాయి. బ్యాక్టీరియా తగ్గకపోతే.. కొంతకాలం తర్వాత మాక్రోఫేగస్‌ విడుదల చేసే మెసెంజర్‌ ప్రొటీన్లతో రక్తంలో ప్రవహిస్తున్న న్యూట్రోఫిల్స్‌ను అదనపు బలగాల రూపంలో అందుబాటులోకి వస్తాయి. విష పదార్థాలను విడుదల చేయడం ద్వారా ఇవి బ్యాక్టీరియాను చంపేస్తాయి. బ్యాక్టీరియాను అడ్డుకునేందుకు తమను తాము నాశనం చేసుకునేందుకు కూడా ఇవి వెనుకాడవు.

ఇంత జరిగినా బ్యాక్టీరియా ప్రభావం తగ్గలేదనుకోండి.. అప్పుడు రోగ నిరోధక వ్యవస్థకు మెదడు లాంటి డెండ్రటిక్‌ కణాలు రంగ ప్రవేశం చేస్తాయి. బ్యాక్టీరియా తాలూకు సమాచారం మొత్తం సేకరించి.. దగ్గరలోని శోషరస గ్రంథులను చేరుకుంటాయి. ఈ గ్రంథుల్లోని కోటాను కోట్ల హెల్పర్‌ టి–సెల్స్, కిల్లర్‌ టి–సెల్స్‌లో తగిన వాటిని గుర్తించి వాటిని చైతన్యపరుస్తాయి. ఈ టి, కిల్లర్‌ కణాలు గణనీయంగా వృద్ధి చెంది బ్యాక్టీరియాపై దాడి చేస్తాయి. ఈ క్రమంలో కొన్ని శోషరస గ్రంథిలోనే ఉంటాయి. భవిష్యత్తులో ఇదే రకమైన బ్యాక్టీరియా దాడి చేస్తే ప్రతిదాడికి సిద్ధంగా ఉంటాయి. కొన్ని హెల్పర్‌ టి–కణాలు గ్రంథుల్లోని శక్తిమంతమైన బి–కణాలను చైతన్యపరచడంతో అవి యాంటీబాడీలను తయారు చేసి బ్యాక్టీరియాపైకి వదులుతాయి. ఇవి బ్యాక్టీరియాకు అతుక్కుపోయి వాటిని నిర్వీర్యం చేస్తాయన్న మాట. దాడి చేసే సూక్ష్మజీవిని బట్టి రోగనిరోధక వ్యవస్థలోని కణాలు వేర్వేరు పద్ధతుల్లో వాటిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తాయి. 

బలహీనపడేది ఇలా.. 
రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడేందుకు వయసుతో పాటు ఒత్తిడి, దురలవాట్లు వంటి అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపాలు, కొన్ని రకాల మందులు, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ వంటి రోగాలు కూడా కారణమే. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు మెదడు కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేయడం వల్ల రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన తెల్లరక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే కార్టిసోల్‌ వంటి మంచి చేసే హార్మోన్లు కూడా శరీరానికి హానికారకంగా మారిపోతాయి. రోగ నిరోధక వ్యవస్థలోని కణాలు ఈ హార్మోన్‌కు అలవాటు పడిపోయి తగువిధంగా స్పందించవు. కొన్ని రకాల అలవాట్లు కూడా శరీరాన్ని ఒత్తిడికి గురిచేయడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తాయి. అయితే కొంతమందికి పుట్టుకతో బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది. మరికొందరిలో ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం ద్వారా కీళ్లనొప్పులు, టైప్‌–1 మధుమేహం, మల్టిపుల్‌ స్లీ్కరోసిస్‌ వంటి రోగాలు వస్తూంటాయి. 

శక్తిమంతుడిగా మారాలంటే.. 
రోగ నిరోధక వ్యవస్థన బలపరుచుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కాసింత జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఇందుకు మన జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరమూ ఉండదు. తగిన పోషకాలున్న ఆహారం సగం సమస్యలు తీరుస్తుంది. ఉదాహరణకు ప్రోటీన్లు.. రోగ నిరోధక వ్యవస్థలోని అన్ని కణాలకు, ఇతర కణాలకు కూడా ప్రొటీన్లలో ఉండే ఎల్‌–ఆర్జినిన్‌ అవసరముంటుంది. ఈ ఎల్‌–ఆర్జినిన్‌ శరీరంలో హెల్పర్‌ టి–సెల్స్‌ ఉత్పత్తి అయ్యేందుకు ఉపయోగపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. పండ్లు, కూరగాయలు తగినంత మోతాదులో తీసుకోవడం (భారతీయులు రోజుకు కనీసం 400 గ్రాములు తీసుకోవాలి) వల్ల శరీరానికి అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి. తద్వారా రోగ నిరోధక వ్యవస్థకు బలం చేకూరుతుంది. రోగనిరోధక కణాల్లో సుమారు 70 శాతం మన కడుపు/పేగుల్లో ఉంటాయని సైన్స్‌ చెబుతోంది.

కాబట్టి జీర్ణ వ్యవస్థను కాపాడుకోవడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చూసుకోవచ్చు. జీర్ణ వ్యవస్థలో సుమారు వెయ్యి రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిలో అత్యధికం శరీరానికి మేలు చేసేవే కాబట్టి.. వీటిలో సమతుల్యం ఉండేలా చూడాలి. పెరుగు తదితర ప్రోబయోటిక్స్‌ తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థలో సమతుల్యత చెడకుండా చూసుకోవచ్చు. విటమిన్లు, యాంటీయాక్సిడెంట్లు తగినన్ని శరీరానికి అందేలా చేయడం ముఖ్యమే. సూర్యరశ్మితో శరీరంలో ఉత్పత్తి అయ్యే విటమిన్‌–డి మరీ ముఖ్యం. వ్యాయామం కూడా శరీర రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుందని ఇప్పటికే పలు పరిశోధనల ద్వారా స్పష్టమైంది. మంచి ఆహారం తీసుకోవాలి.. తగినంత వ్యాయామం చేయాలి.. ఒత్తిడి తగ్గించుకోవాలి.. ఇవన్నీ చేయగలిగితే కరోనాను దూరం పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు!  – సాక్షి, హైదరాబాద్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు