ఏయే కాలేజీలో ఏ ర్యాంకుల వరకు సీట్లు..

13 May, 2016 02:30 IST|Sakshi

కాలేజీల వారీగా గతేడాది సీట్లు వచ్చిన ర్యాంకుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాది ఏయే కాలేజీలో ఎంత ర్యాంకు వరకు సీట్లు వచ్చాయో తెలియట్లేదా.. ఇప్పుడు మీ పిల్లలకు వచ్చే ర్యాంకు ప్రకారం ఎక్కడ సీటు వస్తుందో అంచనా వేసుకోవాలనుకుకునే అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారా.. ఇకపై ఆ అవసరమే లేదు. తల్లిదండ్రుల్లో ఉన్న ఆ ఆందోళన తొలగించే చర్యలను సాంకేతిక విద్యాశాఖ చేపట్టింది. గతేడాది ఎంసెట్, పాలీసెట్, ఐసెట్ కౌన్సెలింగ్‌లో ఏయే కాలేజీల్లో ఎంత ర్యాంకు వరకు సీట్లు లభించాయన్న వివరాలను అందుబాటులోకి తెచ్చింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులు, పాలిటెక్నిక్ డిప్లొమా, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో కాలేజీల వారీగా ఎంత ర్యాంకు వరకు సీట్లు లభించాయన్న వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

కాలేజీ వారీగా సీట్లు లభించిన చివరి ర్యాంకులు, కోర్సులు, బ్రాంచీల వివరాలతో రూపొందించిన సీడీలను సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంంలో సాంకేతిక విద్యా జాయింట్ డెరైక్టర్ మూర్తి, సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఆర్‌జేడీ నారాయణరెడ్డి, ప్రవేశాల క్యాంపు ముఖ్య అధికారి బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోర్సులు, బ్రాంచీలు, ర్యాంకుల వివరాలను www.sakshieducation.com, http://dte.telangana.gov.in, http://dtets.cgg.gov.in, https://tspolycet.nic.in, http://tsche.cgg.gov.in వెబ్‌సైట్లలో పొందవచ్చు.

మరిన్ని వార్తలు