ఉస్మానియా ఘటనపై హెచ్‌ఆర్సీ ఆగ్రహం

21 Dec, 2017 02:24 IST|Sakshi

‘సాక్షి’ కథనాన్ని సుమోటోగా స్వీకరించిన కమిషన్‌

28లోగా నివేదిక అందజేయాలని వైద్య, ఆరోగ్య శాఖకు ఆదేశం

మార్చురీని సందర్శించిన సూపరింటెండెంట్, టీఎస్‌ఎంఐడీసీ చీఫ్‌ ఇంజనీర్‌

మార్చురీ నిర్వహణ బాధ్యతపై నెలకొన్న ప్రతిష్టంభన..

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలోని శవాలను ఎలుకలు, పంది కొక్కులు పీక్కుతింటున్న వైనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. ‘సాక్షి’లో ప్రచురితమైన ‘శవాలను పీక్కుతింటున్నాయి’ కథనాన్ని సుమోటోగా స్వీకరించిన కమిషన్‌.. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఈ నెల 28లోగా నివేదిక ఇవ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్, టీఎస్‌ఎంఐడీసీ ఇంజనీర్లు బుధవారం మార్చురీని సంద ర్శించి అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు.

వివాదాస్పదంగా మార్చురీ నిర్వహణ..
ఉస్మానియా మార్చురీ నిర్వహణ అంశం వివాదాస్పదంగా మారింది. ఆ బాధ్యత తమది కాదంటే తమదికాదంటూ ఫోరెన్సిక్, ఆస్పత్రి వైద్యులు తప్పించుకుంటున్నారు. ‘శవాలకు పోస్టుమార్టం చేయడం వరకే మా పని’అని ఫోరెన్సిక్‌ వైద్యులు స్పష్టం చేస్తుండగా.. ‘పోస్టుమార్టం సహా శవాలను భద్రపరచడం, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలను ఇప్పటి వరకు వైద్య కళాశాలకు చెందిన ఫోరెన్సిక్‌ విభాగమే చూసుకునేది’అని ఆస్పత్రి వైద్యులు చెబుతు న్నారు. మార్చురీకి ఆస్పత్రికి సంబంధం లేదని, అది పూర్తిగా వైద్య కళాశాలకు అనుబంధమని, ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్నందు వల్లే మంచినీరు, విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, అంతకు మించి తమకు ఎలాంటి సంబంధం లేదని ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

11 మంది ఆర్‌ఎంఓలు ఉన్నా..
రోడ్డు, అగ్ని ప్రమాదాలు, ఆత్మహత్యలు, హత్యలు వంటి న్యాయపరమైన అంశాలతో ముడిపడిన(మెడికో లీగల్‌ కేసులు) మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తీసుకొస్తారు. వీటిని నేరుగా మార్చురీకి తరలిస్తుండగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన వారి వివరాలను ఎంఎల్‌సీ రిజిస్టర్‌లో నమోదు చేయాలి. నిబంధనల ప్రకారం ఈ పనులను సంబంధిత మెడికల్‌ ఆఫీసర్‌ చూసుకోవాలి. బంధువులు కోరితే పోస్టుమార్టం తర్వాత ఉచిత అంబులెన్స్‌ను బుక్‌ చేసి, శవాన్ని వారి సొంతూరుకు పంపాలి. కానీ ఉస్మానియాలో 11 మంది ఆర్‌ఎంఓలు ఉన్నా.. ఏ ఒక్కరూ ఈ పని చేయడం లేదు. శవాల తరలింపు పనులను కూడా పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించాల్సిన హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లకు అప్పగిస్తున్నారు.

మరిన్ని వార్తలు