ఫీజుల దోపిడీపై హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు

5 Aug, 2015 01:46 IST|Sakshi
ఫీజుల దోపిడీపై హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు

నాంపల్లి: ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతూ బీసీ సంఘం నేత సిరిబాబు ఆత్మబలిదానం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మెదక్ జిల్లాకు చెందిన సిరిబాబు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడని తెలిపారు.  50 శాతం కాలిన గాయాలతో ఉన్న సిరిబాబును నగరంలోని యశోద ఆసుపత్రిలో చేర్పిస్తే అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రి యాజమాన్యం పోలీసుల సహాయంతో బయటకు గెంటేసిందని, వైద్యం అందకపోవడంతో అతను మృతి చెందాడని కృష్ణ తన ఫిర్యాదులో ఆరోపించారు.  

మరిన్ని ఆత్మబలిదానాలు కాకుండా ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులను నియంత్రించాలని, వైద్యం అందించకుండా సూరిబాబును గెంటివేసిన యశోదా ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన హెచ్చార్సీ ఈ ఘటనపై విచారణ జరిపి సెప్టెంబర్ 1 లోగా సమగ్రమైన నివేదికను అందజేయాలని మెదక్ జిల్లా కలెక్టర్‌కు నోటీసులను జారీ చేసింది.  హెచ్చార్సీకి ఫిర్యాదు అందజేసిన వారిలో బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు శారదాగౌడ్, బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌గౌడ్, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. పృధ్విరాజ్‌గౌడ్ ఉన్నారు.

మరిన్ని వార్తలు