తెలంగాణకు ఆర్థిక సహాయం చేస్తాం

14 Jan, 2017 02:30 IST|Sakshi
తెలంగాణకు ఆర్థిక సహాయం చేస్తాం
  • హడ్కో సీఎండీ ఎం.రవికాంత్‌ వెల్లడి
  • గత రెండున్నరేళ్లలో రూ.10 వేల కోట్ల రుణాలిచ్చాం
  • టీఎస్‌ఆర్టీసీకి రూ.1.34 కోట్ల విరాళం అందజేత
  • సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు కావాల్సిన రుణ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హౌసింగ్, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో) సీఎండీ ఎం.రవికాంత్‌ పేర్కొన్నారు. తెలంగాణకు గత రెండున్నరేళ్లలో రూ.10 వేల కోట్ల వరకు రుణ సహాయం అందించామని చెప్పారు. అందులో మిషన్‌ భగీరథకు రూ.4,750 కోట్లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు రూ.3,344 కోట్లు, ఫార్మా సిటీ ప్రాజెక్టుకు రూ.740 కోట్ల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.

    రవికాంత్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని హడ్కో కార్యాలయంలో ఆ సంస్థ తరఫున తెలంగాణ ఆర్టీసీకి రూ.1.34 కోట్లను కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద విరాళంగా అందజేశారు. ఆర్టీసీ కార్యాలయాల్లో 6 వేల ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటు కోసం ఈ మొత్తాన్ని ఇచ్చారు. అనంతరం రవికాంత్‌ విలేకరులతో మాట్లాడారు. తెలుగువాడిగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు హడ్కో తరఫున సాధ్యమైనంత సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

    విస్తృతంగా ఆర్థిక సహాయం
    హడ్కో గత 46 ఏళ్లలో తెలంగాణ ప్రాంతానికి రూ.31,168 కోట్ల రుణ సహాయం అందించిందని చెప్పారు. పేదలకు 8.44 లక్షల ఇళ్ల నిర్మాణంతో పాటు తాగునీరు, రోడ్డు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఈ నిధులను కేటాయించిందన్నారు. బస్సుల కొనుగోళ్ల కోసం టీఎస్‌ఆర్టీసీకి గతంలో రూ.425 కోట్ల రుణం కేటాయించగా.. ఈ ఏడాది మరో రూ.100 కోట్లు విడుదల చేశామని చెప్పారు. హడ్కోకు రుణాలను తిరిగి చెల్లించే విషయంలో సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకుంటున్నారని ప్రశంసించారు.

    డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పథకం బాగుందని కితాబిచ్చారు. తెలంగాణలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.5 వేల కోట్ల రుణం కావాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించిందని హడ్కో ప్రాంతీయ అధికారి పి.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీలో వైట్‌ టాపింగ్‌ రోడ్లు, ఇతర అవసరాల కోసం రూ.3 వేల కోట్లు, ఇతర మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.2 వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని... దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో పీఐబీ అదనపు డీజీ పీజే సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు