పన్నుల విధానంలో సమూల మార్పులు

15 Aug, 2018 03:56 IST|Sakshi
యువపారిశ్రామిక వేత్తల భేటీలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ

యువ పారిశ్రామికవేత్తల భేటీలో రాహుల్‌గాంధీ 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పన్నుల విధానంలో సమూల మార్పులు తీసుకువస్తామని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లో లోపభూయిష్టమైన విధానాల కారణంగా చిన్న, మధ్యతరహా వ్యాపార, వాణిజ్య సంస్థలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇక్కడ ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో ఏర్పాటు చేసిన యువ పారిశ్రామిక వేత్తల ప్రత్యేక భేటీలో రాహుల్‌ పాల్గొన్నారు. సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రహ్మణి, సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు, టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు పవన్‌కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక విధానాలు, ఉద్యోగ, ఉపాధి కల్పనపై ఈ సమావేశంలో చర్చించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పన్నుల విధానంలో సమూ

ల మార్పులతో పాటు ఒకే శ్లాబ్‌ విధానాన్ని తీసుకురానున్నట్లు హామీ ఇచ్చారు. బ్యాంకింగ్‌ రంగాన్ని ప్రక్షాళన చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. పారిశ్రామిక విధానాలు, తెలుగు రాష్ట్రాల వృద్ధిరేటు, ఉద్యోగ, ఉపాధి కల్పనపై చర్చించిన రాహుల్‌ ఆ తరువాత అరగంట పాటు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఉద్యోగాల కల్పనలో దేశం వెనుకబడిపోయిందని, చైనాలో రోజుకు 50వేల ఉద్యోగాలను సృష్టిస్తుంటే మన దేశం లో కేవలం 450 మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు.

పెద్ద నోట్ల రద్దు అనేది ఎవరికి ప్రయోజనం చేకూర్చిందో అంతుపట్టడం లేదన్నారు. సులభతర వ్యాపార నిర్వహణ, ప్రోత్సాహకా లు లాంటివి మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు. తమ ప్రభుత్వంలో యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సరళీకృత విధానాలను తీసుకొస్తామని చెప్పారు. ప్రస్తుతం పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారాలు చూపుతామని రాహుల్‌ హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు