ఇంకా తెలవారదేమి?

13 Jan, 2019 02:05 IST|Sakshi

సీఎం కేసీఆర్‌ పిలుపు కోసం నిరీక్షణ

కేబినెట్‌లో చోటుపై ఎమ్మెల్యేల్లో ఆందోళన

మంత్రి పదవుల కోసం భారీగా పోటీ

ఒక్కో ఉమ్మడి జిల్లాకు నలుగురైదుగురు ఆశావహులు

2,3 రోజుల్లో స్పష్టత ఇవ్వనున్న సీఎం  

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ సమావేశాల నిర్వహణ తేదీ దగ్గరపడుతుండటంతో మంత్రివర్గ విస్తరణపై ఆశావహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఎమ్మెల్యేల ప్రమాణం, స్పీకర్‌ ఎన్నికతోపాటే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతుండటంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలు, సామాజిక సమీకరణాల ప్రకారం తమకు అవకాశం ఉంటుందని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. పోటీదారులతో తమకు ఉన్న బలాలను అనుచరుల వద్ద చెప్పుకుంటూ ఈసారి మంత్రివర్గంలో చోటు ఖాయమని భావిస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతుండటంతో ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ముఖ్యమంత్రి మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణలు, రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఎమ్మెల్యేల పేర్లను పరిశీలిస్తున్నారు. కొత్త జిల్లాల సంఖ్య మేరకు ప్రతి జిల్లాకు ఒక పదవి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రులతోపాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్‌ విప్, విప్, పార్లమెంటరీ కార్యదర్శుల పోస్టులను పరిగణనలోకి తీసుకొని పదవులవారీగా జాబితా రూపొందిస్తున్నారు. మంత్రి పదవుల కోసం ఎమ్మెల్సీల్లో సైతం ఎక్కువ మంది ఆశావహులు ఉండటంతో కూర్పు ఒకింత సంక్లిష్టంగా మారుతోంది. అయితే ఈ అంశంపై రెండు, మూడు రోజుల్లో ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వనున్నారని తెలిసింది. 

నెల రోజులుగా ఎదురుచూపులే... 
అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లను గెలుచుకొని టీఆర్‌ఎస్‌ భారీ ఆధిక్యంతో అధికారం చేపట్టింది. గతేడాది డిసెంబర్‌ 13న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా, మహమూద్‌ అలీ మంత్రిగా ప్రమాణం చేశారు. ఐదారు రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రమాణ స్వీకారానికి ముందురోజు కేసీఆర్‌ వెల్లడించారు. అయితే ఫెడరల్‌ ఫ్రంట్‌ బలోపేతం కోసం పలు రాష్ట్రాల్లో పర్యటనలు, అనంతరం సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాలతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ఆ తర్వాత మంచి రోజులు లేకపోవడంతో కేబినెట్‌ విస్తరణ మరింత జాప్యమవుతూ వస్తోంది. అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు తాజాగా చెబుతుండగా ఫిబ్రవరిలోనే విస్తరణ ఉంటుందని అధికార పార్టీ ముఖ్యులు అంటున్నారు.

మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా తమకు చోటు దక్కుతుందని తాజా మాజీ మంత్రులు, సీనియర్‌ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అయితే విస్తరణ కార్యక్రమం వీలైనంత త్వరగా జరిగితే టెన్షన్‌ తొలగిపోతుందని అంటున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా 17 మంది మంత్రులు ఉండవచ్చు. మహమూద్‌ అలీ ఇప్పటికే మంత్రిగా ఉన్నందున మరో 16 మందికి అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో 11 మంది ఓసీలు, నలుగురు బీసీలు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీకి మంత్రివర్గంలో చోటు లభించింది. కొత్త మంత్రివర్గంలోనూ ఇదే రకమైన సామాజిక సమీకరణలు ఉంటాయని తెలుస్తోంది. దీని ప్రకారం సీనియర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమకు చోటు దక్కుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. 

స్పీకర్‌గా ఆరుగురి పేర్లు పరిశీలన...  
శాసనసభ స్పీకర్‌ ఎన్నిక జనవరి 18న జరగనుంది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేరును ఈ పదవికి సీఎం కేసీఆర్‌ దాదాపుగా నిర్ణయించారు. అయితే జిల్లాల సమీకరణాల్లో మార్పులు జరిగితే సీనియర్‌ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్‌), ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి (మెదక్‌)లో ఒకరి పేరును పరిశీలించే అవకాశం ఉంది. గత శాసనసభలో స్పీకర్‌ పదవిని బీసీ వర్గాలకు కేటాయించినందున ఈ వర్గానికి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (హుజూరాబాద్‌) పేరును సీఎం పరిశీలిస్తున్నారు. ఎస్సీ వర్గం నుంచి కొప్పుల ఈశ్వర్‌ (ధర్మపురి), ఎస్టీ వర్గం నుంచి డి. ఎస్‌. రెడ్యానాయక్‌ (డోర్నకల్‌)లను సైతం స్పీకర్‌ పదవికి కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలవారీగా మంత్రి పదవుల ఆశావహులు
ఆదిలాబాద్‌: అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, అజ్మీర రేఖానాయక్, బాల్క సుమన్, కోనేరు కోనప్ప 
నిజామాబాద్‌: వేముల ప్రశాంత్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్‌ 
కరీంనగర్‌: కె. తారక రామారావు, ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌ 
మెదక్‌: తన్నీరు హరీశ్‌రావు, సోలిపేట రామలింగారెడ్డి, ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి 
రంగారెడ్డి: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కె. పి. వివేకానందగౌడ్, సీహెచ్‌.మల్లారెడ్డి 
హైదరాబాద్‌: నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీని వాస్‌ యాదవ్, టి. పద్మారావుగౌడ్, దానం నాగేందర్‌ 
మహబూబ్‌నగర్‌: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సి. లక్ష్మారెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్‌ 
నల్లగొండ: జి. జగదీశ్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి 
వరంగల్‌: కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డి. ఎస్‌. రెడ్యానాయక్, ఆరూరి రమేశ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, దాస్యం వినయ భాస్కర్‌ 
ఖమ్మం: పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌

మరిన్ని వార్తలు