బాసర ట్రిపుల్‌ఐటీకి భారీ పోటీ 

11 Jul, 2020 08:43 IST|Sakshi
బాసర ట్రిపుల్‌ఐటీ భవనం

ప్రభుత్వ నిర్ణయంతో పది విద్యార్థులందరూ పాస్‌ 

ఉమ్మడి జిల్లాలో 16,739 మందికి 10జీపీఏ 

ట్రిపుల్‌ఐటీకి మూడు దశల్లో ఎంపిక 

ర్యాండమ్‌ విధానంలో సీట్ల కేటాయింపు

ఇంకా మొదలు కాని ఎంపిక ప్రక్రియ

జ్యోతినగర్‌(రామగుండం): ట్రిపుల్‌ఐటీ అనేది పదోతరగతి పూర్తిచేసిన ప్రతీ విద్యార్థి కల. అందులో సీటు సంపాదిస్తే.. జీవితంలో ఉన్నతంగా స్థిరపడొచ్చనే ఉద్దేశం. పదోతరగతిలో ప్రతిభ ఆధారంగా 10 జీపీఏ సాధించిన వారికి ట్రిపుల్‌ఐటీలో చోటు దక్కుతుంది. ఈసారి కరోనా ఎఫెక్ట్‌... ప్రభుత్వ నిర్ణయంతో ఈ సీట్లు హాట్‌కేకులు అవబోతున్నాయి. పదో తరగతిలో అందరినీ పాస్‌ చేయగా.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 42,456 మంది విద్యార్థులకు 16,739 మంది 10 జీపీఏ సాధించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువగా బాసర ట్రిపుల్‌ఐటీకి ప్రాధాన్యత ఇస్తారు. అందులో 1,500 సీట్లు ఉండగా.. తెలంగాణవ్యాప్తంగా పెద్దమొత్తంలో 10 జీపీఏ సాధించినవారున్నారు. ఈసారి ట్రిపుల్‌ఐటీ సీటుకు పోటీ ఉండడంతో మూడు దశల్లో ఎంపిక విధానాన్ని అమలు చేయనున్నారు.

ఇప్పటి నుంచే కసరత్తు.. 
ప్రతీ ఏడాదికన్నా ఈసారి ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించడం కష్టంగానే మారబోతోంది. ప్రభుత్వం ‘పది’లో అందరినీ పాస్‌ చేయగా.. 10 జీపీఏ సాధించిన వారుకూడా ఎక్కువగానే ఉన్నారు. దీంతో అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం మూడు ప్రమాణాలు నిర్వచించింది. సీట్ల కేటాయింపును వివిధ దశల్లో పరిశీలించి, మెరుగైన ర్యాంకువచ్చిన వారిని ఎంపిక చేస్తారు. అయినా పోటీ ఉంటే ర్యాండమ్‌ విధానం అవలంబిస్తారు. ఇంకా ట్రిపుల్‌ఐటీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరనప్పటికీ.. ఇప్పటినుంచే అధికారులు ప్రక్రియకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారు.

మూడు దశల్లో పరిశీలన...
ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశం పొందాలంటే వివిధ సామాజిక రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకోవడంతోపాటు పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రధాన్యత ఇస్తారు. రెండోదశలో వివిధ పాఠ్యాంశాల్లో వచ్చిన మార్కులు పరిగణలోకి తీసుకుంటారు. మొదటి ప్రాధాన్యత గణితంకు ఇవ్వగా.. సామాన్యశాస్త్రం, ఇంగ్లిష్, సాంఘికశాస్త్రం, ఫస్ట్‌ లాంగ్వేజ్‌లో వచ్చిన మార్కులు పరిశీలిస్తారు. ప్రతీదశలోనూ మార్కులు సమానంగా వస్తే.. మరోదశలో విద్యార్థి పుట్టిన తేదీని ప్రమాణంగా తీసుకుంటారు. దీని ఆధారంగా గరిష్ట వయసున్న వారికి ప్రాధాన్యమిస్తారు. ఈ మూడు దశల్లోనూ సమానంగా మార్కులు వచ్చి పోటీ నెలకొంటే చివరగా విద్యార్థి పదో తరగతి హాల్‌ టికెట్‌ నంబర్‌ ఆధారంగా ర్యాండమ్‌స్కోర్‌ ద్వారా సీటు కేటాయిస్తారు.

ర్యాండమ్‌ విధానం ఇలా
మూడు దశల్లోనూ సీటు కేటాయింపుపై సందిగ్ధత నెలకొన్న క్రమంలో చివరకు ర్యాండమ్‌ విధానం అమలు చేస్తారు. విద్యార్థి హాల్‌టికెట్‌ నంబర్‌ ఆధారంగా దీన్ని గుర్తిస్తారు. ఈ ప్రక్రియ అంతసులువుకాదని, విద్యావ్యవహారాలు ఇంటర్నెట్లో ఉంచే ఒక వెబ్‌సైట్‌ ద్వారా సులభపద్ధతిని అందుబాటులో ఉంచిందని పెద్దపల్లి డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. https://www.teachersteam.co.in/ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయిన తర్వాత మొదటి ఆఫ్షన్‌లో హాల్‌టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే ర్యాండమ్‌ ర్యాంకు లభిస్తుంది. ప్రవేశాలకు పేర్కొన్న ప్రమాణాలు సంతృప్తి పరిచి టై అయిన సమయంలో చివరగా ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆర్జీకేయూటీ సైట్లో వివరించారు.

మరిన్ని వార్తలు