పోటెత్తిన పత్తి

26 Nov, 2019 01:46 IST|Sakshi

వరంగల్‌: వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం పత్తి పోటెత్తింది. రైతులు విక్రయించడానికి 30 వేల బస్తాలకు పైగా పత్తిని తీసుకురావడంతో యార్డు కిటకిటలాడింది. ఈ సీజన్‌లో ఇంత సరుకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వరుసగా 2 రోజులు సెలవులు, పత్తిలో కొంత తేమ తగ్గడంతో భారీగా పత్తి వచ్చినట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు. అయితే సరుకు అధికంగా రావడం తో ఇదే అదనుగా వ్యాపారులు ధర తగ్గించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈనెల 18న క్వింటాలుకు గరిష్ట ధర రూ.5,000 ఉండగా రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. గరిష్ట ధర నిర్ణయించినప్పటికీ ఎక్కువ పత్తిని రూ.4,400 నుంచి రూ.3,500 ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఇదేమిటని అడిగితే ‘ఎక్కువ ధర పెట్టలే సీసీఐ దగ్గరకు పోండి’ అని వ్యాపారులు అంటున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.5,555తో కొనుగోలు చేయడానికి సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసినా ఈనెల 7 నుంచి 23 వరకు 9340.55 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేశారు. తేమ శాతాన్ని బట్టి ధర చెల్లిస్తున్నారు.        

మరిన్ని వార్తలు