పదకొండో రోజు.. 32 లక్షల పైమాటే!

23 Aug, 2016 03:35 IST|Sakshi
పదకొండో రోజు.. 32 లక్షల పైమాటే!

- కిటకిటలాడిన నల్లగొండ, పాలమూరు ఘాట్లు
- పుణ్యస్నానాలు చేసిన జానారెడ్డి, ఉత్తమ్
- అమరవీరులకు తెలంగాణ జాగృతి కార్యకర్తల పిండ ప్రదానం
- వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ/మహబూబ్‌నగర్: మరో రోజులో కృష్ణా పుష్కర పండుగ ముగియనున్న వేళ నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఘాట్లు కిట కిటలాడాయి. పదకొండో రోజైన సోమవారం నల్లగొండ జిల్లావ్యాప్తంగా 11.5 లక్షల మంది, మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 21 లక్షల మంది భక్తు లు పుణ్యస్నానాలు ఆచరించారు. నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లి, దర్వేశిపురం ఘాట్లు లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయాయి. నాగార్జున సాగర్‌లో 3 లక్షల మందికి పైగా పుష్కర స్నానాలు చేయగా, వాడపల్లి, మట్టపల్లి, దర్వేశిపురం ఘాట్ల లో 2 లక్షల చొప్పున పుణ్యస్నానాలు చేశారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఘాట్ల వద్దకు క్యూ కట్టారు.

 ప్రముఖుల పుణ్యస్నానాలు
 పుష్కర స్నానాల కోసం పలువురు ప్రముఖులు నల్లగొండ జిల్లాలోని ఘాట్లకు తరలివచ్చారు. వాడపల్లి వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానం చేసిన కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత కె.జానారెడ్డి.. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మట్టపల్లి ప్రహ్లాద్ ఘాట్‌లో పీపీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ స్నానాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీ రులకు వాడపల్లి శివాలయం ఘాట్‌లో తెలంగాణ జాగృతి కార్యకర్తలు పిండ ప్రదానం చేశారు.

 పాలమూరు ఘాట్లకు తగ్గని జనం
 ఇక పాలమూరులోని వివిధ పుష్కరఘాట్లు భక్తులతో పోటెత్తాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీచుపల్లి ఘాట్‌లో పుణ్య స్నానమాచరించి అలంపూర్ జోగుళాంబ దేవాలయాన్ని సందర్శిం చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి రంగాపూర్ పుష్కర ఘాట్‌లో పుణ్యస్నానం చేశారు. ఆత్మకూరు మండలం మూల మల్ల పుష్కర ఘాట్‌లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పుణ్యస్నానం ఆచరించారు. బీచుపల్లిలో ఎంపీ గరికపాటి మోహన్‌రావు పుణ్యస్నానం చేశారు. సోమశిలలో మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ టికె.శ్రీదేవి కృష్ణమ్మకు గంగాహారతి ఇచ్చారు. బీచుపల్లిలో మంత్రి లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హారతి ఇచ్చారు. మంగళవారం పుష్కరాల ముగింపు సందర్భంగా బీచుపల్లిలో ప్రభుత్వం ముగింపు పర్వాన్ని చేపట్టనుంది. ఇందుకోసం బీచుపల్లి ఘాట్‌ను ముస్తాబు చేస్తున్నారు. మరోవైపు సాగర్ శివాలయం, ఆంజనేయస్వామి ఘాట్లకు సోమవారం నీరు నిలిచి భక్తుల పుష్కర స్నానాలకు అంతరాయం ఏర్పడింది.

 వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
 పెద్దకొత్తపల్లి/కోడేరు: పుష్కరాల్లో సోమవారం అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌కు చెం దిన మినీ వ్యాన్ డ్రైవర్ మహేశ్‌గౌడ్(32) పుష్కర స్నానానికి వెళ్లి నీట మునిగి చనిపోయాడు. నదిలోకి స్నానాలకు వచ్చిన భక్తుల కాళ్లకు శవం తగలడంతో, గజ ఈతగాళ్లు శవాన్ని బయటకు తీసినట్లు స్పెషల్ ఆఫీసర్ సురేందర్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌న గర్‌జిల్లా కోడేరు చెందిన రామదాసు (16) వనపర్తిలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు శ్యామలమ్మ, వెంకటయ్యలతో సోమశిల ఘాట్‌లో స్నానమాచరించి.. ఆటోలో తిరుగు ప్రయాణమయ్యాడు. నర్సాయిపల్లి  వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో మృతి చెందాడు.

మరిన్ని వార్తలు