కన్నీటియాత్ర!

17 Sep, 2018 03:45 IST|Sakshi
రోదిస్తున్న కుటుంబసభ్యులు , అంతిమయాత్రకు భారీగా వచ్చిన జనం

ప్రణయ్‌ అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన ప్రజలు

మిర్యాలగూడ: పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌కి మిర్యాలగూడ ప్రజలు, కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల, కుల సంఘాల నాయకులు ఆదివారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఉక్రెయిన్‌లో వైద్య విద్య చదువుతున్న ప్రణయ్‌ తమ్ముడు అజయ్‌ మధ్యాహ్నం 2.40 గంటలకు ఇక్కడికి చేరుకున్నాడు. అనంతరం వినోభానగర్‌లోని నివాసం నుంచి 3.15 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. యాత్ర సాగుతున్నంత సేపూ ప్రణయ్‌ భార్య అమృత, తల్లిదండ్రులు బాలస్వామి, ప్రేమలత రోదిస్తూనే ఉన్నారు. వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల, కుల సంఘాల నాయకులు భారీగా తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. వినోభానగర్‌ శ్మశానవాటికలో క్రిస్టియన్‌ సంప్రదాయం ప్రకారం.. 7.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ప్రణయ్‌ని హత్య చేయించిన మారుతీరావును ఉరితీయాలని అంతియయాత్రలో స్నేహితులు, బంధువులు నినాదాలు చేశారు.  
నివాళులర్పిస్తున్న  వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ప్రణయ్‌ అంతిమయాత్రలో పాల్గొన్నగోరటి వెంకన్న, ఇతర ప్రజా సంఘాల నేతలు 

వదినను, తండ్రిని పట్టుకొని రోదిస్తున్న ప్రణయ్‌ తమ్ముడు అజయ్‌ 
అంతిమయాత్రలో పాల్గొన్న నాయకులు... 
ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, ప్రజా కవి గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, జూలకంటి రంగారెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాల్వాయి రజిని, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎల్లయ్య, న్యూ డెమొక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోవర్ధన్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అనురాధ, తెలంగాణ ఎంఆర్‌పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, కుల నిర్మూలన వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండారు లక్ష్మయ్య, మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ లక్ష్మణ్, విరసం నాయకురాలు ఉదయ కుమారి పాల్గొన్నారు.  

పలువురి పరామర్శ: ప్రణయ్‌ మృతదేహాన్ని సందర్శించి, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీ రాములునాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ మందుల సామేలు, మాజీ ఎమ్మెల్సీ భారతీరాగ్యానాయక్, మాజీ ఎమ్మెల్యేలు రామ్మూర్తి యాదవ్, చిరుమర్తి లింగయ్య, ఇండియన్‌ రైల్వే సర్వీసెస్‌ రిటైర్డ్‌ చీఫ్‌ జనరల్‌ భరత్‌ భూషణ్, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్‌ మురళీమోహన్‌ ఉన్నారు.

కఠినంగా శిక్షించాలి 
ప్రణయ్‌ హత్యలో నిందితులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రణయ్‌ మృతదేహాన్ని జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డితో కలసి సందర్శించి సంతాపం తెలిపారు. అనంతరం అమృత, ప్రణయ్‌ తల్లిదండ్రులను పరామర్శించి మాట్లాడారు. ఇంకా కులాల పేరుతో పరువు హత్యలు జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు