డాంబర్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌లో భారీ పేలుడు

28 Jul, 2018 00:54 IST|Sakshi

యజమానితో సహా ఆరుగురికి తీవ్ర గాయాలు

నలుగురి పరిస్థితి విషమం

తాండూర్‌: మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండలం రేపల్లెవాడ శివారులో శుక్రవారం ఓ డాంబర్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆయిల్‌ ట్యాంక్‌ బాయిలర్‌ ప్రమాదవశాత్తు పేలడంతో ఒక్కసారిగా విస్పోటనం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలు కాగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. తాండూర్‌ మండలం రేపల్లెవాడ గ్రామ శివారు ప్రాంతంలో గ్లోబల్‌ సిరామిక్స్‌ ఫ్యాక్టరీ ఉంది. ఆయిల్‌ ట్యాంక్‌ బాయిలర్‌ వద్ద ప్లాంట్‌ యజమాని ఉండి కూలీలతో పనులు చేయిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

భారీ శబ్దంతో పేలుడు జరిగి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. పేలుడు ధాటికి ఆయిల్‌ ట్యాంక్‌ ఘటనాస్థలి నుంచి ఎగిరిపోయి వంద మీటర్ల దూరంలో పడింది. ఈ ఘటనలో రేపల్లెవాడకు చెందిన ప్లాంట్‌ యజమాని సలావుద్దీన్‌ సహా ఆరుగురు కూలీలపై మరిగించిన డాంబర్‌ మీదపడటంతో శరీరం కాలిపోయి తీవ్ర గాయాలయ్యాయి. సలావుద్దీన్, సాయితేజ, బ్రిజేష్, కేశవ్‌గౌడ్‌ శరీరం 80 శాతం వరకు కాలిపోయింది. క్షతగాత్రులకు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు