మార్కెట్‌ చైర్మన్ల వేతనాలు భారీగా పెంపు

22 Oct, 2017 01:58 IST|Sakshi

రూ. 2 వేలున్న సెలక్షన్‌ గ్రేడ్‌ చైర్మన్ల వేతనం రూ. 25 వేలు

స్పెషల్‌ గ్రేడ్‌ చైర్మన్ల వేతనం రూ.1,500 నుంచి రూ. 20 వేలు..

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: మార్కెట్‌ కమిటీ చైర్మన్ల గౌరవ వేతనాలను భారీగా పెంచుతూ రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలను ఏకంగా పదింతలకు పైగా పెంచుతూ ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి ఆదేశాలు ఇచ్చారు. సెలక్షన్‌ గ్రేడ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్లకు ప్రస్తుతం నెలకు రూ. 2 వేలు వేతనం ఇస్తున్నారు. దాన్ని ఏకంగా రూ. 25 వేలకు పెంచారు. స్పెషల్‌ గ్రేడ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్లకు ప్రస్తుతం రూ. 1,500 ఇస్తుండగా, దాన్ని రూ. 20 వేలు చేశారు.

అలాగే ఇతర గ్రేడ్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్లకు ప్రస్తుతం నెలకు రూ. 500 నుంచి రూ. వెయ్యి ఇస్తుండగా, దాన్ని రూ. 15 వేలకు పెంచారు. అలాగే గ్రేడ్లతో సంబంధం లేకుండా అన్ని మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, ఇతర సభ్యులకు సిట్టింగ్‌ ఫీజును రూ. 250 నుంచి రూ. వెయ్యి వరకు పెంచారు. మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రతి పాదనల మేరకు సీఎం కేసీఆర్‌ ఆమోదంతో ఈ పెంపుదల చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

ఇప్పుడు మార్కెట్లకు ధాన్యం వచ్చే సమయం. ధాన్యంతోపాటు పత్తి కూడా మార్కెట్లను పోటెత్తనుంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్లను సరిగ్గా నడిపించడంలో చైర్మన్లదే కీలకపాత్ర. ఈ నేపథ్యంలో భారీగా వేతనాలు పెంచడంతో వారిలో నూతనోత్సాహం వస్తుందని మార్కెటింగ్‌ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

సరైన వేతనాలు లేక ఇబ్బందులు...
రాష్ట్రంలో 180 మార్కెట్‌ కమిటీలున్నాయి. అందులో సెలక్షన్‌ గ్రేడ్‌ మార్కెట్లు 16 ఉన్నాయి. స్పెషల్‌ గ్రేడ్‌ మార్కెట్లు 29, గ్రేడ్‌–1 మార్కెట్లు 26, ఇవిగాక ఇతర మార్కెట్లు 109 ఉన్నాయి. ఈ కమిటీల చైర్మన్లకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలతో పోలిస్తే రాష్ట్రంలో వివిధ అణగారిన వర్గాలకు ఇస్తున్న పింఛన్లే నయంగా ఉన్నాయని మార్కెటింగ్‌శాఖ భావించింది. అంతేకాక మార్కెట్‌ కమిటీల చైర్మన్లలో అనేకమంది బడుగు, బలహీనవర్గాల వారున్నారు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలోనే వేతనాలు భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్ని వార్తలు