రైతు కంట్లో కారం

13 May, 2017 02:31 IST|Sakshi
రైతు కంట్లో కారం

ఒక్కో ఎకరాకు లక్ష దాకా నష్టపోయిన మిర్చి రైతు
అన్ని పెట్టుబడులతో కలిపి ఎకరానికి రూ.1.60 లక్షలు ఖర్చు
ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల దిగుబడి..  క్వింటాకు 4 వేల ధర
ఈ లెక్కన పెట్టుబడిలోనే రూ.60 వేల నష్టం.. రైతు దంపతుల కష్టాన్నీ కలిపితే రూ.లక్ష పైనే..  
రాష్ట్రవ్యాప్తంగా మిర్చి రైతుల నష్టం రూ.2 వేల కోట్ల కన్నా ఎక్కువే..
ధర దగాతో నిండా మునిగిన రైతన్న


బొల్లం శ్రీనివాస్, సాక్షి, ఖమ్మం: ఆరుగాలం చేసిన కాయకష్టానికి నష్టమే మిగిలింది. ఎండనక.. వాననక.. పగలనక.. రేయనక మిర్చి పంట సాగు చేసిన రైతన్నకు నష్టాలు తప్ప చేతిలో చిల్లి గవ్వ మిగల్లేదు. దిగుబడి ఆశించినంతగా వచ్చినా.. మార్కెట్‌ మాయాజాలంతో నిండా మునిగారు. గత ఏడాది ధరను చూసి ఈసారి రాష్ట్రంలో రైతులు 2.61 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో ఎన్నడూ లేనంతగా మిర్చి విస్తీర్ణం పెరి గింది. పంట చేతికొచ్చాక తీరా ధరలు పతనం కావడంతో రైతు కంట్లో కారం పడినట్లయింది. పంట సాగు చేసిన రైతు ఎకరానికి కనీసం రూ.60 వేల చొప్పున నష్టపోయాడు. రైతు కష్టాన్నీ లెక్కలోకి తీసుకుంటే ఇది రూ.లక్షపైనే ఉంటుంది!

పెట్టుబడి కూడా దక్కలేదు..
పత్తి సాగు చేయవద్దని ప్రభుత్వం ప్రకటిం చడంతో రైతులు మిర్చి వైపు మొగ్గుచూపారు. గతంతో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో మిర్చి సాగు ఎక్కువగా అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 85 వేల ఎకరాలు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సుమారు 60 వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు. వాతావరణం అనుకూలించడం, చీడపీడలు లేకపోవడంతో ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. గతంలో మాదిరిగా ధర బాగానే ఉంటుందని రైతులు ఆశించారు. ఫిబ్రవరిలో మిర్చి కోత ప్రారంభంలో ధర రూ.10 వేల దాకా ఉండటంతో ఈ ధర చివరి వరకు ఉంటుందని అనుకున్నారు. తీరా అందులో సగం ధర కూడా దక్కకలేదు. ఎకరాకు రూ.1.60 లక్షల పెట్టుబడి పెట్టారు. సగటున 25 క్వింటాళ్ల దిగుబడికి.. గతంలో ఉన్న ధర(రూ.10 వేలు)ను బట్టి చూస్తే పంట అమ్మినందుకు రూ.2.50 లక్షలు రైతుకు దక్కాలి. రైతు శ్రమను మినహాయిస్తే సుమారు రూ.లక్ష వరకు మిగలాలి. కానీ ధర అమాంతం తగ్గడంతో క్వింటాల్‌కు సగటున రూ.4 వేలే దక్కాయి. అంటే రైతు ఎకరాకు రూ.1.60 లక్షలు ఖర్చు చేస్తే చివరికి దక్కింది రూ.లక్ష. అంటే రూ.60 వేల నష్టం! రైతు దంపతుల శ్రమ విలువతో కలిపి చూస్తే ఈ మొత్తం రూ.లక్షకు పైనే!!

పంటను చేలపైనే వదిలేసి..
ధర లేక.. సాగు ఖర్చు కూడా రావడం లేదని భావించిన రైతులు ఒకట్రెండు కోతలు తీసిన తర్వాత మిగిలిన పంటను చేలపైనే వదిలేశారు. రూ.150 నుంచి రూ.200 కూలీ ఇస్తే పొద్దంతా మిర్చి ఏరేవారు. ఈసారి కూలీల కొరత ఏర్పడడంతో కొందరు రైతులు గ్రూపుగా ఏర్పడి ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి రవాణా ఖర్చులు భరించి కూలీలను తెచ్చారు. కేజీకి రూ.15 నుంచి రూ.20 వరకు ఇవ్వాలని కూలీలు డిమాండ్‌ చేయడంతో విధి లేని పరిస్థితుల్లో రైతులు ఆ మేరకు చెల్లించారు. మొదటి, రెండు కోతల తర్వాత ధర అమాంతం రూ.2,500, రూ.3 వేలకు పడిపోవడంతో కూలీ, రవాణా ఖర్చు కూడా గిట్టదని పంటను రైతులు చేలపైనే వదిలారు.

ఆగిన శుభకార్యాలు..
మిర్చి ధర అమాంతం పడిపోవడంతో రైతు కుటుంబాల్లో శుభకార్యాలు నిలిచిపోయాయి. దిక్కులేని పరిస్థితుల్లో పంటను తక్కువ ధరకు అమ్ముకోవడంతో చేతిలో డబ్బులు లేక రైతులు తమ పిల్లల పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సాగు ఖర్చుతోపాటు ఎకరానికి రూ.25 వేలు కౌలు చెల్లించి చివరికి ధర రాక.. వారంతా కుదేలయ్యారు.

దుక్కి నుంచి మార్కెట్‌ దాకా..

మిర్చి వేసేందుకు దుక్కి నుంచి మార్కెట్‌కు తరలించే వరకు.. సాగు, రవాణా ఖర్చులతో సహా ఎకరానికి రూ.1.60 లక్షల ఖర్చవుతుంది. రైతు దంపతుల కష్టాన్ని లెక్కలోకి తీసుకుంటే ఇది మరింతగా పెరుగుతుంది.

ఎకరాకు ఖర్చుల వివరాలివీ..(రూ.లలో..)
దుక్కి దున్నితే             8,500
15 ప్యాకెట్ల విత్తనాలు, నారు పెంపకం     6,500
సూపర్, పొటాష్, డీఏపీ, రిజెంట్‌ గుళికలు    6,500
తోట వేసిన తర్వాత అరక పాట్లు 6, 7 సార్లు     10,000
చీడ పీడల నివారణకు మందుల పిచికారికి     40,000
మిర్చి పంట ఎదుగుదలకు రసాయన ఎరువులు    8,500
మిర్చి ఏరేందుకు కూలీల ఖర్చు    70,000
బస్తాల్లో తొక్కి మార్కెట్‌కి తరలించేందుకు    10,000
మొత్తం ఖర్చు            1,60,000

రైతుల అభిప్రాయాలు..
బిడ్డ పెళ్లి వాయిదా వేసుకున్నా – భూక్యా ఖాసీరామ్, మేకలతండా, కారేపల్లి మండలం
మిర్చి వేసి నష్టపోయా. బిడ్డ పెళ్లి వాయిదా వేసుకున్న. రూ.20 వేల చొప్పున 4 ఎకరాలను రూ.80 వేలకు కౌలుకు తీసుకొని పంట సాగు చేసిన. పెట్టుబడికి రూ.2.40 లక్షలు, మిర్చి ఏరిస్తే కూలీలకు రూ.1.50 లక్షలను అప్పు తెచ్చి పెట్టితే.. 80 క్వింటాళ్ల మిర్చి వచ్చింది. 20 క్వింటాళ్లను రూ.4 వేల చొప్పున అమ్మితే..రూ.80 వేలే వచ్చాయి. అప్పు ఇచ్చినోళ్లు, కూలోళ్లు ఇంటి చుట్టు తిరుగుతున్నరు. ఉన్న మిర్చి అమ్ముదామంటే.. రూ.1900, రూ.2 వేలకు అడుగుతున్నరు. ఏం చేయాలో దిక్కు తోచట్లేదు.

ధర లేక అమ్మలేదు – యల్లంకి వెంకటేశ్వర్లు, కారేపల్లి
ధర లేకపోవడంతో 40 క్వింటాళ్ల మిర్చి అమ్మకుండా అట్లే ఉంచిన. నేను 3 ఎకరాల్లో మిర్చి సాగు చేసిన. రూ.1.50 లక్షల పెట్టుబడితోపాటు, మిర్చి ఏరించినందుకు రూ.1.20 లక్షల ఖర్చు వచ్చింది. 45 క్వింటాళ్ల దిగుబడిలో 5 క్వింటాళ్లను మొదట్లో రూ.10 వేల చొప్పున అమ్మిన. అప్పటి నుంచి రేటు తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు రూ.2 వేల చొప్పున అడుగుతున్నరు. అమ్మితే..కూలోళ్లకు ఏమి ఇయ్యాలి..? అప్పు తెచ్చిన కాడ ఏం కట్టాలి..?

వ్యవసాయం బంద్‌ చేసి కూలీకి పోదామనుకుంటున్నా.. – బానోతు వీరన్న, గేటు కారేపల్లి
పోయిన ఏడాది చెల్లి పెళ్లికి, ఇల్లు మరమ్మతులకు తెచ్చిన అప్పు రూ.2 లక్షలు మిర్చి పంట మీద తీర్చుదామనుకున్నా. ఈ అప్పు కాకుండానే మళీŠల్‌ రూ.2 లక్షలు అప్పు అయింది. రూ.60 వేలు పెట్టి 2.5 ఎకరాలు కౌలుకు తీసుకుని, రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టిన. మిర్చి ఏరిస్తే రూ.1.70 లక్షలు అయింది. మొత్తంగా రూ.3.20 లక్షలు అప్పు తెచ్చి సాగుచేస్తే..60 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ధర లేకపోవడంతో.. రూ.3 వేల చొప్పున అమ్ముకోవాల్సి వచ్చింది. రూ.2 లక్షలు అప్పు తీరుతుందనుకుంటే.. మరో రూ.2 లక్షలు అప్పు అయింది. వ్యవసాయం బంద్‌ చేసి కూలీ పనులకు పోదామనుకుంటున్నా.

ఫలితం లేదు.. సుతారి పనికి పోత..గుగులోతు సేట్‌రామ్, మేకలతండా, కారేపల్లి మండలం
నాకున్న 4 ఎకరాల్లో మిర్చి పంటకు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన. నకిలీ విత్తనాలు రావడంతో.. తోట సగం నాశనమైంది. 40 క్వింటాళ్లేæ దిగుబడి వచ్చింది. మిర్చి బాగా లేదని సేటు క్వింటాకు రూ.1900 మాత్రమే సేటు పెట్టిండు. ఏం చేయాల వచ్చిన కాడికే.. తీసుకొని వచ్చి కూలోళ్లకు ఇచ్చిన. కష్టపడి ఎవుసం చేస్తే.. కుటుంబాన్ని సాదుకోలేక పోతున్నం. మా ఊరోళ్లతో ఖమ్మం సుతారి పనికి పోత.

అప్పు చేసి ఆపరేషన్‌ చేయించుకున్నా...– తాటికింది మంగమ్మ, సింగరాయపాలెం, కొణిజర్ల మండలం
మాకు ఎకరం పొలం ఉంది. మరో ఎకరం కౌలుకు తీసుకున్నాం. కౌలు రూ.30 వేలు ముందే చెల్లించాం. రెండు ఎకరాలు తోట వేసాం. మొదట నకిలీ మిర్చి విత్తనాలతో కాత రాకుంటే తోట పీకి వేసి మళ్లీ వేసాం. అంతా కలిపి ఎకరానికి రూ.90 వేలు ఖర్చయింది. కౌలుతో కలిపి రెండు ఎకరాలకు రూ 2.10 లక్షలు వచ్చింది. మొదటి కోత 10 క్వింటాళ్లు వచ్చింది. రూ.5 వేలు లెక్క అమ్మాం. ఇంతలో నాకు కడుపు నొప్పి రావడంతో రూ.లక్ష అప్పు చేసి ఆపరేషన్‌ చేయించారు. రెండోసారి మిర్చి కోయిస్తే 22 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అమ్మడానికి పోతే రూ 2,800 కి అడిగారు. ఆ రేటుతో అమ్మితే అప్పులు కూడా తీరవు.

పాత అప్పులు తీరుద్దామనుకున్నా..బండారు వీరభద్రం, చిన్నగోపతి, కొణిజర్ల మండలం
నాకు 3 ఎకరాల పొలం ఉంది. మరో ఒకటిన్నర ఎకరం కౌలుకు తీసకున్నా. రెండెకరాలలో మిర్చి సాగు చేశా. కౌలు రూ.25 వేలు. ఎకరానికి 16 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పెట్టుబడులకు రూ.80 వేల దాకా ఖర్చు వచ్చింది. మిర్చి అమ్ముదామని ఖమ్మం మార్కెట్‌కు తీసుకపోతే రూ.3,100 చొప్పున అడిగారు. తిరిగి ఇంటికి వేసుకుని వచ్చా. ఇప్పుడు ఎంతకో కొంతకు అమ్ముదామన్నా కొనే నాథుడు కరువయ్యాడు. పాత అప్పులతో కలుపుకుంటే రూ.4 లక్షల అప్పులు మిగిలాయి.

పంట కోయకుండా వదిలేశా..– కొత్తపల్లి మంగారావు, సింగరాయపాలెం, కొణిజర్ల మండలం
సింగరాయపాలెంలో ఎకరం రూ.30 వేలు చొప్పున 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. నాకున్న 2 ఎకరాల పొలంలో నీళ్లు కోసం మూడుసార్లు బోర్లు వేయించా, రూ.2 లక్షలు ఖర్చు అయింది. చుక్క నీళ్లు పడలేదు. 2 ఎకరాలలో మిర్చి సాగు చేశా. పంటకు రూ.1.50 లక్షలు అప్పు తెచ్చాను. ఇద్దరు ఆడపిల్లలున్నారు. పంట మంచిగా పండితే పెద్ద పిల్ల పెళ్లి చేద్దామనుకున్నా. అనుకున్నట్లు గానే పంట మంచి గానే పండింది. కానీ ధర లేదు. పంట కోయిస్తే కోత కోసిన కూలీలకు కూడా సరిపోవని అలాగే వదిలేశా.

లక్ష పెట్టుబడి...లక్షన్నర కూలీ..– ఆడెపు వెంకన్న, కూసుమంచి
నేను రెండెకరాల్లో తోట వేస్తే 30 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. అమ్మితే రూ.1.80 లక్షలు వచ్చింది. కూలీ, పెట్టుబడి ఖర్చు రూ.2.50 లక్షలు వచ్చింది. ఇలా అయితే మిర్చి పంటను ఎలా సాగు చేస్తాం. మాకు లాభాలు ఎలా వస్తాయి? మరోసారి మిరప తోటలు వేయాలంటే భయమేస్తోంది.

ఇదీ నష్టం లెక్క..
ఈ ఏడాది మిర్చి సాగు    2.61 లక్షల ఎకరాలు
దిగుబడి(ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున)  65.25 లక్షల క్వింటాళ్లు
ఎకరాకు రైతు చేసిన ఖర్చు     1.60 లక్షలు
2.61 లక్షల ఎకరాలకు  ఖర్చు    4,176 కోట్లు
క్వింటాల్‌కు దక్కిన సగటు ధర    4 వేలు
65.25 లక్షల క్వింటాళ్లకు    2,610 కోట్లు
అంటే.. రైతు రూ.4,176 కోట్లు ఖర్చు పెడితే నికరంగా చేతికొచ్చింది.. రూ.2,610 కోట్లు! రైతు ఆరుగాల కష్టానికి ప్రతిఫలం రూ.1,566 కోట్ల నష్టం! రైతు దంపతుల ఆరేడు నెలల కష్టాన్ని కూడా కలిపితే ఈ మొత్తం నష్టం రూ.2 వేల కోట్లపైనే..!!!

మరిన్ని వార్తలు