రవాణా సంస్థలకు భారీ అ‘ధనం’ 

23 Oct, 2018 03:26 IST|Sakshi

ఆర్టీసీకి  అదనంగా రూ.39 కోట్లు 

జంటనగరాల నుంచి 5 వేల ప్రత్యేక బస్సులు

13 లక్షలకు మందికి పైగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం

రూ.50 కోట్లు ఆర్జించిన రైల్వే

రైళ్లలో 7 లక్షలకుపైగా  ప్రయాణం  

సాక్షి, హైదరాబాద్‌: రవాణాసంస్థలకు దసరా రద్దీ కాసుల వర్షం కురిపించింది. అదనపు సంపాదన భారీగా సమకూరింది. అంచనాలకు మించి నగర జనం సొంత ఊళ్లకు వెళ్లడంతో రైల్వే, ఆర్టీసీలకు అదేస్థాయిలో ఆదాయం లభించింది. ఆర్టీసీతోపాటు ప్రైవేట్‌ బస్సులు, ఇతర వాహనాలు సైతం అదనపు చార్జీలు వడ్డించాయి. దసరా సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లినవారు రెండు రోజులుగా తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. సోమవారం కూడా హైవేలపైన వాహనాల రద్దీ భారీగా కనిపించింది. దసరా సెలవుల సందర్భంగా 25 లక్షల మందికి పైగా నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లారు. ఆర్టీసీ బస్సుల్లోనే 13 లక్షల మందికిపైగా ప్రయాణించినట్లు ఆ సంస్థ లెక్కలు వేసింది. 

ఆర్టీసీకి రూ.39 కోట్లకుపైగా ఆదాయం... 
ఆర్టీసీ ఈ ఏడాది దసరా సందర్భంగా 4,500 ప్రత్యేక బస్సులను వేయాలనుకుంది. చివరి మూడు రోజుల్లో అంచనాలకు మించి జనం బయలుదేరడంతో 5 వేలకుపైగా అదనపు బస్సులను నడిపింది. సుమారు రూ.39 కోట్ల ఆదాయం అదనంగా లభించినట్లు ఆర్టీసీ అధికారవర్గాలు పేర్కొన్నాయి. 

ద.మ.రైల్వేకు రూ.50 కోట్లు : దసరా సందర్భంగా మొత్తంగా 7 లక్షలకుపైగా మంది రైళ్లల్లో సొంత ఊళ్లకు తరలివెళ్లినట్లు అంచనా.  రూ.50 కోట్లకుపైగా అదనంగా ఆర్జించినట్లు దక్షిణ మధ్య రైల్వే అంచనా వేసింది.

23 వరకు ఆర్టీసీ ‘ప్రత్యేక’చార్జీలు
సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ‘ప్రత్యేక’బాదుడు ఇంకా కొనసాగుతోంది. రద్దీ కారణంగా ఈ సర్వీసులను 23 వరకు పొడిగించాలని అధికారులు నిర్ణయించారు.

మరిన్ని వార్తలు