గర్జించిన క్యుములోనింబస్‌! 

18 Oct, 2018 02:00 IST|Sakshi

గ్రేటర్‌లో కుండపోత..లోతట్టు ప్రాంతాలు జలమయం

స్తంభించిన జనజీవనం

గంటల పాటు స్తంభించిన ట్రాఫిక్‌

వాతావరణంలో అస్థిరతే కారణం: శాస్త్రవేత్తలు

సాక్షి, హైదరాబాద్‌: క్యుములోనింబస్‌ మేఘాలు భాగ్యనగరంపై మళ్లీ గర్జించాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా నగరంలో పలు చోట్ల ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన కుండ పోతకు గ్రేటర్‌లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధానంగా ఆసిఫ్‌నగర్, చార్మినార్, విరాట్‌నగర్, శ్రీనగర్‌కాలనీ, ముషీరాబాద్‌ తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా కనిపించింది. బుధవారం కురిసిన భారీ వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. పలు కాలనీలు, బస్తీల్లో ఇళ్ల ముందు పార్క్‌ చేసిన ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లు వరదనీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షం కారణంగా సద్దుల బతుకమ్మ వేడుకలకు తీవ్ర ఆటంకం కలిగింది. దసరా సందర్భంగా షాపింగ్, దూర ప్రాంతాలకు బయలుదేరిన వారు వర్షంలో చిక్కుకొని ఇబ్బందులు పడ్డారు. పలు ప్రధాన రహదారులపై నడుములోతున వరదనీరు పోటెత్తడంతో ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు, బస్సులు భారంగా ముందు కు కదిలాయి. భారీ వర్షానికి చాలాచోట్ల దాదాపు 2–4 గంటల పాటు ట్రాఫిక్‌ జాం నగరవాసులకు నరకం చూపించింది. సాయంత్రం 6 గంటల వరకు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లోనూ ఈ మేఘాల ప్రభావంతో పలుచోట్ల కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. 

అధికార యంత్రాంగం అలర్ట్‌ 
భాగ్యనగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్‌ తదితర ప్రాంతాల్లో సాయంత్రం 4 నుంచి 5.30 గంటల మధ్య భారీ వర్షం కురియడంతో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తు నిర్వహణ బృందాలు, వర్షాకాల అత్యవసర బృందా లు రంగంలోకి దిగాయి. నగరంలో పలు ప్రాంతాల్లో జడివాన ఉధృతి నేపథ్యంలో.. అధికారులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ సమీక్ష నిర్వహించారు. వర్షం కురిసే ప్రాంతాల్లో తాత్కాలికంగా పర్యటనలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక ట్యాంక్‌బండ్, కోఠి, బేగం బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌ బాగ్, లిబర్టీ, హైదర్‌ గూడ, హిమాయత్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లోనూ వర్షం కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. రోడ్లపై ఎక్కడికక్కడే నీరు నిలవడంతో  రోడ్లపై చిన్న కొట్లు పెట్టుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూం నుంచి పరిస్థితులను సమీక్షించారు.

పగటి ఉష్ణోగ్రతలు పెరగటమే! 
ఇటీవల దక్షిణ, మధ్య తెలంగాణ ప్రాంతా ల్లో పగటి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర పెరిగిన కారణంగా భూవాతావరణం వేడెక్కింది. ఈ తరుణం లో బుధవారం ఒక్కసారిగా అండమాన్‌ నికోబార్, తూర్పు దిశ నుంచి వీస్తున్న తేమగాలులు నగరాన్ని తాకడంతో అకస్మాత్తుగా క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి కుండపోత కురిసిందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. వాతావరణంలో అస్థిర పరిస్థితులు చోటుచేసుకోవడమే ఇందుకు కారణమన్నారు. తరచుగా వేసవిలో ఏర్పడే క్యుములోనింబస్‌ మేఘాలు.. ఈ సారి వర్షాకాలం పూర్తవుతున్న సమయంలో ఏర్పడుతున్నాయని రాజారావు వెల్లడించారు. మరోవైపు దక్షిణ అండమాన్‌ సముద్రం దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే నైరుతి రుతుపవనాలు ఈ నెల 20వ తేదీ నాటికి దేశం నుండి పూర్తిగా ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. తదుపరి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశానికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన వివరించారు. దీంతో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు