‘కల్యాణలక్ష్మి’కి దరఖాస్తుల కళ

6 Jun, 2016 03:23 IST|Sakshi

► 23 రోజుల్లోనే 4,709 దరఖాస్తుల రిజిస్ట్రేషన్
► తహసీల్దార్ల ద్వారా పరిశీలనకు బీసీ సంక్షేమ శాఖ నిర్ణయం


 సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులు(బీసీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఈబీసీ)ల కల్యాణలక్ష్మి పథకానికి మంచి స్పందన వ్యక్తమవుతోంది. ఈ పథకం లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అధికారికంగా వెబ్సైట్ను ప్రారంభించిన 23 రోజుల్లోనే 4,700 పైచిలుకు దరఖాస్తులు నమోదయ్యాయి. బీసీ, ఈబీసీ లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తులను నమోదు చేసుకునేందుకు ఒక వెబ్ సైట్ను గత నెల 13న బీసీ సంక్షేమ శాఖ ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీల కల్యాణలక్ష్మి, మైనారిటీల షాదీముబారక్, బీసీ, ఈబీసీల కల్యాణలక్ష్మి పథకాలు కలుపుకుని ఈ శనివారం వరకు 33,345 దరఖాస్తులు నమోదయ్యాయి. ఎస్సీల అభివృద్ధి శాఖ 13,348, ఎస్టీ సంక్షేమ శాఖ 9,421, మైనారిటీ శాఖ పరిధిలో 5,907 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. బీసీ, ఈబీసీ కల్యాణలక్ష్మిలో భాగంగా 2016-17లో రూ.300 కోట్లతో 58,820 మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.

ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి నిర్ణీత సంఖ్య మేరకు దీని కింద సహాయం అందించనుంది. దీనితోపాటు దరఖాస్తుల రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తేదీ, సమయం రికార్డు అయ్యేలా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు ద్వారా సీనియారిటీని నిర్ధారించి చెల్లింపులు చేస్తారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆయా జిల్లాల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు అవినీతి నిరోధకశాఖ తనిఖీల్లో బయటపడింది. ఈ నేపథ్యంలో తమకు ఇచ్చే దరఖాస్తుల పరిశీలన బాధ్యతను ఎమ్మార్వోలకే అప్పగించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సీసీఎల్ఏకు కూడా లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తుదారులు ఇంకా కొంత కాలం వేచిచూడాల్సి ఉంటుంది. 2016 ఏప్రిల్ 1, ఆ తర్వాత వివాహం అయిన వాళ్లందరికీ ఈ పథకం కింద రూ.51 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు బీసీ శాఖ గతంలోనే ప్రకటించింది.

మరిన్ని వార్తలు