‘ఔటర్‌’ టోల్‌కు గండి!

15 Jun, 2018 01:06 IST|Sakshi

రూ.లక్షల్లో దండుకున్న పాత కాంట్రాక్టు కంపెనీ 

టెండరు గడువు ముగిసినా కొత్త వారికి ఇవ్వకుండా జబర్దస్తీ  

కంప్యూటర్‌తో కాకుండా చేతి రాతతో రశీదులిస్తూ వసూళ్లు 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై భారీ టోల్‌ ‘దందా’సాగింది. టెండరు గడువు ముగిసినా కొత్త కాంట్రాక్టర్లకు టోల్‌ వసూలు బాధ్యతను అప్పగించకుండా పాత కాంట్రాక్టు కంపెనీ టోల్‌కు గండి కొట్టింది. కంప్యూటర్‌ ద్వారా కాకుండా చేతి రాతతోనే రశీదు ఇస్తూ రూ.లక్షల్లో దండుకుంది. ఈ విషయమై ప్రశ్నించిన మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శికి సైతం ‘ఇక్కడింతే’అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.  

రోజూ రూ.80 లక్షలు.. 
మహానగరం చుట్టూ ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డు హెచ్‌ఎండీఏకు ప్రధాన ఆదాయ వనరు. సగటున రోజుకు రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల టోల్‌ వసూలవుతుంది. గతంలో ప్రతి నెలా రూ.16 కోట్ల చొప్పున ఏడాదికి రూ.192 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. గత కంపెనీ గడువు ముగియడంతో తాజా టెండర్‌ ప్రక్రియ చేపట్టగా ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ టెండర్‌ దక్కించుకుంది. ప్రతి నెలా రూ.26 కోట్ల చొప్పున ఏడాదికి రూ.312 కోట్లకు ఆదాయం కూడా పెరిగింది.

158 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిపై టోల్‌ వసూలులో అవకతవకలకు తావు లేకుండా అధునాతన టోల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ వినియోగిస్తున్నారు. అయితే పాత, కొత్త కాంట్రాక్టర్ల మధ్య గొడవ కారణంగా కొత్త కాంట్రాక్టరుకు టోల్‌ వసూలు బాధ్యతను అప్పగించకుండా భారీ మొత్తంలో టోల్‌కు పాత కంపెనీ గండి కొట్టింది. అన్ని టోల్‌ గేట్లలో తమ సిబ్బందిని మోహరించి చేతి రాతతోనే రశీదు రాసి రోజుకు రూ.లక్షల్లోనే దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. తనిఖీ చేసేందుకు తన సొంత వాహనంలో అటుగా వెళ్లిన ము న్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌కు కూడా చేతి రాతతో రాసిన రశీదు ఇచ్చారు. దీంతో ఈ విషయమై ఆయన ప్రశ్నించగా ‘ఇక్కడింతే’అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.  

క్రిమినల్‌ కేసులు పెట్టండి: కేటీఆర్‌ 
ఇటీవల మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో టోల్‌ టెండర్లు, హెచ్‌ఎండీఏ ఆదాయం పెంపుపై సంబంధిత అధికారులతో చర్చ జరగ్గా పాత కాంట్రాక్టర్ల టోల్‌ దందా విషయాన్ని అధికారులు మంత్రికి వివరించినట్లు తెలిసింది. కానీ అలాంటిదేమీ లేదని, అంతా సజావుగా సాగుతుందని హెచ్‌ఎండీఏ అధికారులు వివరించగా.. తన దగ్గర ఉన్న చేతి రశీదును మంత్రికి ప్రిన్సిపల్‌ సెక్రటరీ చూపించారు. దీంతో అధికారులంతా అవాక్కయ్యారు. తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్‌ కొత్త కంపెనీకి టోల్‌ బాధ్యతలు అప్పగించాలని, పాత కాంట్రాక్టు కంపెనీపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడొద్దని ఆదేశించారు.   

మరిన్ని వార్తలు