పోలీస్‌పై 'ఫెల్ట్‌' భారం

11 Mar, 2020 02:35 IST|Sakshi

గ్రామాల్లో ప్రజలకు చేరువయ్యేందుకు చేపట్టిన కార్యక్రమంతో ఖాకీలకు చిక్కులు

బస్సులు, తాగునీరు, డ్రైనేజీ సమస్యలపై ఫిర్యాదులు

తలలు పట్టుకుంటున్న కానిస్టేబుళ్లు, ఎస్సైలు

హలో పోలీస్‌ స్టేషనా..? కరెంటు పోయి చాలా సేపవుతోంది సార్‌. కొంచెం లైన్‌మన్‌కు చెప్పి వేయించండి. సార్‌.. ఊళ్లోని వైన్‌షాపులో క్వార్టర్‌పై రూ.5 అధికంగా విక్రయిస్తున్నారు. ఇదెక్కడి అన్యాయం సార్‌.. వెంటనే వారిపై చర్యలు తీసుకోండి

ఇవీ పోలీసులకు ప్రజల నుంచి వస్తోన్న ఫిర్యాదులు. ప్రజలకు చేరువయ్యేందుకు పోలీసుశాఖ జిల్లాల్లో ‘ఫెల్ట్‌ నీడ్స్‌’పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తమ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో భద్రతను పటిష్ట పరిచేలా పోలీసులు సీసీ కెమెరాల వ్యవస్థను పరిశీలించి పెట్రోలింగ్, గస్తీ అవసరమా? పోకిరీలు, మందుబాబుల బెడద ఉందా? తదితర అంశాలపై గ్రామ పెద్దలతో చర్చించాలి. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఇందులో అదనంగా చేర్చిన కొన్ని అంశాలపై పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు బస్సులు వస్తున్నాయా? పారిశుద్ధ్యం పరిస్థితి ఎలా ఉంది? డ్రైనేజీ ఇబ్బందులు ఉన్నాయా? కరెంటు సమస్య ఎలా ఉంది? తాగునీరు సరిగా సరఫరా అవుతోందా? వంటి విషయాలను కానిస్టేబుళ్లు, ఎస్సైలు తెలుసుకొని వాటిని సంబంధిత గ్రామాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని కార్యక్రమ ఎజెండాలో చేర్చారు. ఇక్కడే పోలీసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శాంతిభద్రతల సమస్యలైతే ఫర్వాలేదుగానీ మరీ డ్రైనేజీ, బస్సు సౌకర్యం, పారిశుద్ధ్యం, రోడ్డు సమస్యలపై కొందరు ఫిర్యాదులు చేస్తుండటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.  

శాఖలో సిబ్బంది కొరత ఇలా..: రాష్ట్రంలో క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందిపై విపరీతమైన పని ఒత్తిడి పడుతోంది.  రాష్ట్ర జనాభా ఆధారంగా తెలంగాణ పోలీస్‌ డిపార్ట్‌మెంటుకు సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ విభాగాల్లో 81,647 పోస్టులు మంజూరయ్యాయి. కానీ వాస్తవానికి ఇక్కడ 53,115 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 72.93 మంది పోలీసులు ఉండాల్సి ఉండగా కేవలం 47.44 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో అసలే సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతుండగా, ‘ఫెల్ట్‌ నీడ్స్‌’ మరింత చికాకు పెడుతోందని సిబ్బంది అంటున్నారు.   
 –సాక్షి, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు