అడవితల్లి ఒడిలో ముత్యం‘ధార’

23 Oct, 2017 02:07 IST|Sakshi

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో వెలుగులోకి భారీ జలపాతం

700 అడుగుల ఎత్తు నుంచి దిగువకు ప్రవాహం       

దేశంలో మూడో ఎల్తైన జలపాతంగా  పర్యాటకుల అభివర్ణన 

     అభివృద్ధి చేస్తే రాష్ట్రానికే తలమానికం

ములుగు: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో భారీ జలపాతం వెలుగులోకి వచ్చింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం (కే) మండలం వీరభద్రవరం గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి రమణీయత మధ్యన సుమారు 700 అడుగుల ఎత్తు నుంచి ముత్యంధార జలపాతం జాలువారుతోంది. ఎగువనున్న మూడు, నాలుగు కొండలను దాటుకుంటూ పాలనురగలా కిందకు ప్రవహిస్తూ సుమారు 10 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తోంది.

దాదాపు నాలుగు నెలల కిందట స్థానికులు గుర్తించిన ఈ జలపాతం ప్రస్తుతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. గద్దలు ఎగిరేంత ఎత్తులోంచి నీటి ధార పడుతుండటంతో దీన్ని గద్దెల సరి అని కూడా స్థానికులు పిలుస్తున్నారు. ఎత్తు విషయంలో కర్ణాటకలోని జోగ్‌ జలపాతం, మేఘాలయలోని జలపాతాల సరసన ఇది నిలుస్తుందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో మూడో ఎత్తయిన జలపాతంగా దీన్ని కొందరు అభివర్ణిస్తున్నారు. జలపాతం అందాలను వీక్షించేందుకు వరంగల్, ఖమ్మం, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. 

చేరుకోవడం కాస్త కష్టమే... 
ముత్యంధార జలపాతాన్ని చేరుకోవాలంటే పర్యాటకులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రం నుంచి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ములుగు మీదుగా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట–వాజేడు మండలం పూసూరు మధ్యనున్న బ్రిడ్జిని దాటుకుంటూ వెంకటాపురం (కె) మండల కేంద్రానికి వెళ్లాలి. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని వీరభద్రవరం గ్రామానికి చేరుకుని సమీప అటవీ ప్రాంతంలో సుమారు 9 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తే జలపాతం వద్దకు చేరుకోవచ్చు. అభయారణ్యం నుంచి పర్యాటకులు సులువుగా జలపాతం వద్దకు చేరుకునేందుకు స్థానికులు తాత్కాలిక రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలు నేరుగా జలపాతం వద్దకు వెళ్లేలా అడ్డుగా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, టాటా ఏస్‌లు జలపాతం వద్దకు వెళ్లేందుకు వీలవుతోంది.

సౌకర్యాలతో పర్యాటకానికి ఊతం 
ముత్యంధార జలపాతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి తలమానికంగా మారే అవకాశం ఉంది. రాష్ట్ర పర్యాటక, అటవీశాఖలు, జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డు మార్గం, బొగతా జలపాతం మాదిరిగా సౌకర్యాలు కల్పిస్తే పర్యాటకుల సంఖ్య పెరగనుంది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. 

ఆదిమానవులు నివసించే వారని ప్రచారం... 
జలపాతం నుంచి 200 మీటర్ల దూరంలో కాల్వ నీటిని ఆధారంగా చేసుకుని ఆదిమానవులు జీవించారనేది ప్రచారంలో ఉంది. జలపాతం నుంచి వచ్చే నీటి ప్రవాహానికి అడ్డంగా చిన్న, చిన్న ఆనకట్టలు ఉన్నట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు. అలాగే బంకమన్ను తయారీ వస్తువులు, రాతి ఆయుధాలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు గతంలో ఇక్కడ మునులు తపస్సు చేసే వారని స్థానికులు చెబుతున్నారు.

సౌకర్యాలు కల్పించాలి
ముత్యంధార జలపాతానికి ప్రతి వారాంతంలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో జలపాతానికి వెళ్లేందుకు పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి రోడ్డు ఏర్పాటు చేయాలి. జలపాతం వద్ద మౌలిక సౌకర్యాలు కల్పించాలి. 
    – ప్రసాద్, మంచర్ల నాగేశ్వర్‌రావు, వీరభద్రవరం గ్రామస్తులు 

మరిన్ని వార్తలు