అసలు ఇదంతా ఎలా జరిగింది?

8 Dec, 2019 01:49 IST|Sakshi

‘దిశ’నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ

మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో వివరాల సేకరణ

చటాన్‌పల్లి, తొండుపల్లిలో సంఘటనా స్థలాల పరిశీలన

సోమవారం వరకు రాష్ట్రంలో కమిషన్‌ ప్రతినిధులు

సాక్షి, శంషాబాద్‌ : ‘దిశ’అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) విచారణ మొదలైంది. కమిషన్‌ ప్రతినిధులు శనివారం మహబూబ్‌నగర్‌ లో విచారణ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధులు సోమవారం వరకు రాష్ట్రంలోనే ఉండి ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరుపై సమగ్ర విచారణ జరపనున్నారు. తొలిరోజు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారి మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నివేదికను అధ్యయనం చేశారు.

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగిన చటాన్‌పల్లి సంఘటనా  స్థలాన్ని కూడా పరిశీలించారు. ఆదివారం మృతుల  తల్లిదండ్రులతో సమావేశం కానున్నారు. అయితే వారి తల్లిదండ్రులను హైదరాబాద్‌కు పిలిపించుకుంటారా? లేక మృతుల స్వస్థలమైన నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల, జక్లేర్‌ గ్రామాలకు వెళ్తారా అనే దానిపై శనివారం రాత్రి వరకు స్పష్టత రాలేదు. సోమవారం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని పోలీసువర్గాలు తెలిపాయి. విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

మూడున్నర గంటల పాటు భేటీ...
శనివారం మధ్యాహ్నం 1.20 గంటలకు మహబూబ్‌నగర్‌ వచ్చిన ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధులు స్థానిక పోలీసు అధికారులు, పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్‌ వైద్య బృందం, స్థానిక జనరల్‌ ఆస్పత్రి వైద్యులతో సుమారు మూడున్నర గంటల పాటు భేటీ అయ్యారు. ‘దిశ’అత్యాచారం, హత్య మొదలు.. ఎన్‌కౌంటర్, శవపరీక్ష వరకు అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. దిశ హత్య తర్వాత, ఎన్‌కౌంటర్‌ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

పోస్టుమార్టం నివేదికను పరిశీలిస్తున్న సమయంలో ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధులకు పలు అనుమానాలు రావడంతో పోస్టుమార్టం చేసిన వైద్యులను పిలిపించాలని కోరారు. దీంతో గాంధీ ఆస్పత్రికి చెందిన ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ హెచ్‌ఓడీ కృపాల్‌సింగ్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ లావణ్య, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మహేందర్, మరో వైద్యుడు హుటాహుటిన మహబూబ్‌నగర్‌ వచ్చి, వారి సందేహాలను నివృత్తి చేశారు. 

రెండుసార్లు మృతదేహాలు పరిశీలన..
ఆస్పత్రికి చేరుకున్న వెంటనే నేరుగా మార్చురీకి వెళ్లిన ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధులు.. అక్కడ మృతదేహాలను వారి పేర్లతో సహా వివరాలన్నీ నిర్ధారించుకున్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌ చాంబర్‌కు వెళ్లి పోస్టుమార్టం నివేదికను క్షుణ్ణంగా చదివారు. ముఖ్యంగా ఎంత దూరం నుంచి కాల్చి ఉండొచ్చు? తూటాలు మృతుల శరీరాల్లో చొచ్చుకుని పోవడంతో ఏ మేరకు రంధ్రం ఏర్పడింది? మృతులు పారిపోతున్నట్టు ధ్రువీకరించే ఆధారాలు ఏవైనా ఉన్నాయా అనే కోణాల్లో ఆరా తీశారు.

అనంతరం మరోసారి మార్చురీకి వెళ్లి.. మృతదేహాలను పరిశీలించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అక్కడ నుంచి చటాన్‌పల్లి శివారులో దిశను కాల్చివేసిన స్థలానికి చేరుకున్నారు. నిందితులు దిశను శంషాబాద్‌ నుంచి అక్కడకు ఎలా తీసుకొచ్చారు..? ఆమె మృతదేహాన్ని ఎక్కడ దహనం చేశారు..? అనే విషయాలను శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి వారికి వివరించారు. తర్వాత ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి చేరుకుని.. మృతదేహాలు ఎక్కడ పడి ఉన్నాయి.. ఎన్‌కౌంటర్‌ ఎలా జరిగిందనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

దిశను కాల్చేసిన స్థలానికి ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం ఎంత దూరంలో ఉందనే వివరాలను కూడా సేకరించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన సమయంలో ఎంతమంది పోలీసులు ఉన్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆ ప్రదేశాన్ని క్షుణ్నంగా పరిశీలించాక, అక్కడి నుంచి నిందితులు దిశపై హత్యాచారం చేసిన తొండుపల్లిలోని టోల్‌ప్లాజా వద్దకు వెళ్లారు. దిశపై అత్యాచారం, హత్య జరిగిన ప్రహరీ లోపలి ప్రదేశాన్ని నిశితంగా గమనించారు. నిందితులు ఆమెపై ఘాతుకానికి ఎలా పాల్పడ్డారో డీసీపీ ప్రకాష్‌రెడ్డి వారికి వివరించారు.

నేడు మృతుల తల్లిదండ్రులతో భేటీ...
జాతీయ మానవహక్కుల కమిషన్‌ ప్రతినిధులు ‘దిశ’ఎన్‌కౌంటర్‌ మృతుల తల్లిదండ్రులతో ఆదివారం సమావేశం కానున్నారు. మృతుల వ్యక్తిత్వం.. అలవాట్ల వివరాలతో పాటు ఎన్‌కౌంటర్‌పై వారి అభిప్రాయాలు సేకరించనున్నారు. నిందితులను పోలీసులు ఎప్పుడు తీసుకెళ్లారు? ఎలా తీసుకెళ్లారు? ఏం చెప్పి తీసుకెళ్లారు? ఎన్‌కౌంటర్‌ చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారా? చేసిన తర్వాత వారి స్పందన ఏమిటి? అనే విషయాలపై ఆరా తీస్తారని ఓ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు.

రహస్యంగా విచారణ..
ఎన్‌కౌంటర్‌ నిజానిజాలను నిర్ధారించేందుకు వచ్చిన ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధులు తమ విచారణను రహస్యంగా నిర్వహించారు. ఎన్‌కౌంటర్, పోస్టుమార్టంపై తమ అనుమానాలను నివృత్తి చేసుకునే క్రమంలో వైద్యులు, పోలీసు ఉన్నతాధికారులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించలేదు. మీడియాతో మాట్లాడతారని భావించినా మాట్లాడలేదు. మూడు రోజుల విచారణ పూర్తయిన తర్వాతే వారు మీడియాతో మాట్లాడతారని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.

ఈ క్రమంలో విచారణకు అంతరాయం కలగకుండా పోలీసులు ఆస్పత్రి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులెవరినీ లోపలికి అనుమతించలేదు. రోగులను క్షుణ్ణంగా పరిశీలించి.. నిర్ధారించుకున్న తర్వాతే వదిలిపెట్టారు. మీడియాను సైతం గేటు బయటకు పంపేశారు. మరోవైపు దిశ తల్లిదండ్రులను కమిషన్‌ ప్రతినిధులు కలుస్తారని భావించినా.. వారు ఆమె ఇంటికి వెళ్లలేదు.

మూడురోజుల్లో ఫోరెన్సిక్‌ నివేదిక
‘‘ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన దిశ నిందితుల పోస్టుమార్టం నివేదికను మరో మూడు రోజుల్లో జిల్లా జడ్జి ద్వారా హైకోర్టుకు సమర్పిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదుగురితో కూడిన వైద్య బృందం నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసింది. ఈ వ్యవహారంలో అన్ని నిబంధనలూ అనుసరించాం. పోస్టుమార్టానికి సంబంధించి ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధులు అడిగిన సందేహాలను నివృత్తి చేశాం’’
– డాక్టర్‌ కృపాల్‌సింగ్, గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్‌ నిపుణుడు

ఘటన తీరును తెలుసుకునేందుకే వచ్చారు
‘‘దిశ హత్యోదంతం, నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరును పరిశీలించేందుకే జాతీయ మానవ హక్కుల సంఘం బృందం వచ్చింది. ఏడుగురు సభ్యులతో కూడిన బృందం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌ వెళ్లి తిరుగు ప్రయాణంలో చటాన్‌పల్లి వద్ద దిశను కాల్చిన స్థలాన్ని, ఎన్‌కౌంటర్‌ స్థలిని పరిశీలించింది. విచారణ కమిటీలో ఓ ఫోరెన్సిక్‌ నిపుణుడితోపాటు ఏడుగురు సభ్యులున్నారు. విచారణ ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం’’
– ప్రకాష్‌రెడ్డి, డీసీపీ

మరిన్ని వార్తలు