నేలమాలిగలు.. ఈస్ట్రోజన్‌ ఇంజెక్షన్లు లేవు! 

20 Jan, 2019 03:15 IST|Sakshi
యాదగిరిగుట్టలో ఓ వేశ్యా గృహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు (ఫైల్‌ ఫొటో)

అదంతా కొన్ని సంస్థల ప్రచారం మాత్రమే: హెచ్‌ఆర్‌ఎఫ్‌

గుట్ట వేశ్యాగృహాల్లోని పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: యాదగిరిగుట్ట కేంద్రంలోని వేశ్యాగృహాల్లో నేలమాలిగలు లేవని, అలాగే ఈస్ట్రోజన్‌ ఇంజెక్షన్లు వాడలేదని మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్‌) తెలిపింది. ఇది కేవలం కొన్ని సంస్థలు చేస్తున్న ప్రచారం మాత్రమేనని అభిప్రాయపడింది. యాదగిరిగుట్టలో వేశ్యావృత్తిని నిర్వహిస్తున్న వారిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు జరిపి పీడీ యాక్టు కింద అరెస్టు చేసి జైళ్లకు తరలించి ఆర్నెల్లుగా జైళ్లలో ఉంచిన నేపథ్యంలో ఈ నెల 8న మానవ హక్కుల వేదిక బృందం యాదగిరిగుట్టకు చేరుకుని అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 

అన్నీ హృదయవిదారక అంశాలే... 
యాదగిరిగుట్ట వేశ్యాగృహాలను నిర్వహిస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేసి జైళ్లకు, బాలికల సంరక్షణ గృహాలకు తరలించారు. వారి ఇళ్లకు తాళం వేయడంతో మిగిలిన కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న హెచ్‌ఆర్‌ఎఫ్‌ బృందం బాధితులను పరామర్శించడంతో వారు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అరెస్టు కాని కుటుంబ సభ్యుల్లో కొందరు ఇతర ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకోగా.. మరికొందరికి అవి కూడా దొరకలేదు. కొందరు గుడారాలు వేసుకుని నివసిస్తున్నారు. ఈ గుడారాల్లో ఓ బాలింత సైతం పసికందుతో అవస్థలు పడుతూ ఉంది. ఇటు పీడీ యాక్టుపై జైలుకు వెళ్లి వచ్చిన వారి పరిస్థితిదుర్భరంగా మారింది. దీన్ని చూసి హెచ్‌ఆర్‌ఎఫ్‌ సభ్యులు చలించిపోయారు. 

పునరావాసం ఎక్కడ...: వేశ్యావృత్తిని మానేసిన వారు ఇతర ఉపాధి పనులకు వెళ్తున్నారని హెచ్‌ఆర్‌ఎఫ్‌ తెలిపింది. ‘వేశ్యావృత్తిని మానేసినట్లు ప్రత్యేకంగా బోర్డులు తగిలించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పునరావాసం, ఆర్థిక సాయం అందలేదు. బాధితులకు పునరావాసం కల్పించడంతో పాటు వారి ఇళ్లను వారికే అప్పగించాలి. హోంలలోని పిల్లలను వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చాలి..’అని నివేదికలో కోరింది.  

అవన్నీ నిరాధారం.. 
వేశ్యాగృహాల్లో పిల్లలను నేలమాలిగల్లో రహస్యంగా పెంచుతున్నట్లు, వారు త్వరగా ఎదిగేందుకు ఈస్ట్రోజన్‌ ఇంజక్షన్లు చేస్తున్నట్లు పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. కానీ అదంతా ప్రచారమేనని హెచ్‌ఆర్‌ఎఫ్‌ బృందం అభిప్రాయపడింది. అక్కడ అలాంటి పరిస్థితేమీ లేదని.. అందుకు తగ్గ ఆధారాలు కూడా ఏమీ కనిపించలేదని వెల్లడించింది. ‘ఈ ఆరోపణల ఆధారంగా ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి క్లినిక్‌పై పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. ఆస్పత్రి సీజ్‌ చేసినప్పటికీ అక్కడ ఈస్ట్రోజన్‌కు సంబంధించిన ఆధారాలు దొరకలేదు. మరి ఆ వైద్యుడిని ఎందుకు అరెస్టు చేశారో అర్థం కాలేదు. 33 మంది బాధిత బాలికలను రెండు హోంలకు తరలించారు. ఆమన్‌గల్‌లో ప్రజ్వల నడుపుతున్న హోంలో 20 మంది, మిగిలిన 13 మందిని నల్లగొండలోని శిశు విహార్‌కు పంపించారు. అయితే ప్రజ్వల హోంలోని పిల్లలను చూసే అవకాశం కూడా ఇవ్వడం లేదు..’అని హెచ్‌ఆర్‌ఎఫ్‌ పేర్కొంది.  

మరిన్ని వార్తలు