మంటగలిసిన మానవత్వం!

18 Jul, 2015 03:01 IST|Sakshi
మంటగలిసిన మానవత్వం!

♦ జవహర్‌నగర్ డంపింగ్‌యార్డ్ సమీపంలో పసికందు మృతదేహం
♦ ఆడపిల్ల అని వదిలేసిన తల్లిదండ్రులు..!
 
 జవహర్‌నగర్ : ‘అమ్మా నవమాసాలు మోసి కన్నావు.. పుట్టిపుట్టగానే ఎందుకమ్మా వదిలించుకున్నావ్.. భారం అనుకున్నావా.. ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన నేరమా..?’ .. మాటలొస్తే ఆ పసికందు తన కన్నతల్లిని ఈ ప్రశ్నలు అడిగేదేమో.. కల్వర్టు కింద రాళ్లలో పడి కళ్లు కూడా సరిగా తెరవని ఆ పసికందు ఏడ్చిఏడ్చి కళ్లు మూసింది. ఈ హృదయ విదారక ఘటన జవహర్‌నగర్‌లోని డంపింగ్‌యార్డ్ సమీపంలోని కల్వర్టు దగ్గర చోటుచేసుకుంది. వివరాలు.. జవహర్‌నగర్‌లోని డంపింగ్‌యార్డ్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్డుకు మరమ్మతులు జరుగుతున్నాయి.

డంపింగ్ సమీపంలో ఉన్న ఓ కల్వర్టు కింద రెండు రోజుల పసికందు శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో రోడ్డుపై వెళ్తున్న యువకుడు జోగారావు పసికందును గమనించాడు. పసిపాప మృతదేహానికి చీమలు పట్టి ఉన్నాయి. స్థానికులు ఆ ఆడపిల్లలను చేతుల్లోకి తీసుకొని చీమలు తొలగించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ వెంకటగిరి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సమీప ప్రాంతంలోని ప్రైవేట్ ఆస్పత్రులు, జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో విచారణ జరుపుతున్నారు.

పాప పుట్టి రెండు రోజులు అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆడపిల్ల కావడంతో తల్లిదండ్రులు పడేసి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదు. ఆయా పథకాలు అమలుకు నోచుకోకపోవడమే ప్రధాన కారణం. ఆడపిల్లల కోసం సర్కార్ ప్రవేశపెట్టిన ‘ భేటీ బచావో...భేటీ పడావో ’ లాంటి పథకాలు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేకుండా పోతోంది.

మరిన్ని వార్తలు