విదేశీ గనుల కోసం వేట

14 May, 2015 01:51 IST|Sakshi
విదేశీ గనుల కోసం వేట

కొత్తగూడెం(ఖమ్మం) : బొగ్గు ఉత్పత్తిలో 120 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన సింగరేణి సంస్థ ఇప్పటికే గోదావరిలోయ పరివాహక ప్రాంతంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో బొగ్గు గనులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం విదేశాలలోనూ బొగ్గు గనులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ మేరకు ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణాప్రికా, మొజాంబిక్ దేశాలలో గనులను చేపట్టేందుకు ఈఓఐ(ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) అందించాలని సంస్థ ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన టీఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణిపై సమీక్ష నిర్వహించింది. దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు విదేశాలలో సైతం బొగ్గు గనులను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఈ మేరకు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ నడిమిట్ల శ్రీధర్ విదేశాలలో గనుల ఏర్పాటుపై, అక్కడున్న పరిస్థితులను అవగాహన కల్పించుకునేం దుకు సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో కూడిన బృందాన్ని గత ఏడాది డిసెంబర్‌లో విదేశాలకు పంపించారు.

ఆ తర్వాత సీఎండీ స్వయంగా దక్షిణాప్రికా పర్యటన చేసి అక్కడున్న పరిస్థితులను పరిశీలించి వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాప్రికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మొజాంబిక్ దేశాలలో బొగ్గు గనుల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని నిర్థారించుకుని అక్కడ గనుల ఏర్పాటుకు ప్రయత్నాలను మమ్మురం చేశారు.
 
ఏడాదికి రెండు మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం
సింగరేణి సంస్థ విదేశాలలో చేపట్టే గనులు 50 మిలి యన్ టన్నుల నిక్షేపాలు కలిగి, ఏడాదికి రెండు మిలి యన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న గనులను తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతోపాటు అవసరమైతే 51 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. గనులను అమ్మే కంపెనీ లు తప్పనిసరిగా యాజమాన్య హక్కులను కలిగి ఉండటంతోపాటు బొగ్గు అమ్మకానికి సంబంధించిన అన్ని హక్కులు కలిగి ఉండాలని సూచించింది.

జూన్ 10వ తేదీలోగా ఆయా దేశాలలోని గనుల యాజమానులు వాటా అమ్మకానికి సంబంధించిన ఈఓఐను అందించాలని కోరింది. ఏది ఏమైనా మరో ఏడాదిలో గా విదేశాలలో గనులను నిర్వహించాలని సింగరేణి యాజమాన్యం సంకల్పించి ముందుకు సాగుతోంది.

మరిన్ని వార్తలు